నైట్ ఫుడ్‌కోర్ట్‌పై చర్యలేవీ?
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:13 AM
నైట్‌ఫుడ్‌కోర్ట్ తొలగింపుపై కూటమి కార్పొరేటర్ల తీరు అనుమానాలకు తావిస్తోంది.
కూటమి కార్పొరేటర్ల శపథం ఏమైందో?
గతనెల 30 నాటికి తొలగించకపోతే ధర్నా చేస్తామని అల్టిమేటం
అయినప్పటికీ యథావిధిగా కొనసాగుతున్న ఫుడ్‌కోర్ట్
కార్పొరేటర్లతీరుపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
విశాఖపట్నం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):
నైట్‌ఫుడ్‌కోర్ట్ తొలగింపుపై కూటమి కార్పొరేటర్ల తీరు అనుమానాలకు తావిస్తోంది. జీవీఎంసీ అనుమతి లేకుండా పాతజైలురోడ్డులో కొనసాగుతున్న నైట్ ఫుడ్‌కోర్ట్‌ను గతనెల 30లోగా తొలగించాల్సిందేనని, లేదంటే అక్కడే ధరాన చేస్తామని ప్రెస్‌మీట్ పెట్టి మరీ హెచ్చరించారు. ఈ విషయాన్ని వినతిపత్రంలో పేర్కొంటూ జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్‌కు అందజేసి అల్టిమేటం జారీచేశారు. డెడ్‌లైన్ దాటి వారం గడిచినా నైట్ ఫుడ్‌కోర్ట్‌పై ఎలాంటి చర్యలు కనిపించలేదు.
కూటమి కార్పొరేటర్లు అల్టిమేటం జారీచేసినప్పటికీ జీవీఎంసీ అధికారులు నైట్‌ఫుడ్ కోర్ట్ వైపు కన్నెత్తిచూడకపోవడం విశేషం. జీవీఎంసీ అనుమతి లేకుండా 32 దుకాణాలతో ప్రారంభమైన నైట్ ఫుడ్‌కోర్ట్‌లో ప్రస్తుతం 150కిపైగా దుకాణాలున్నాయి. వీటివల్ల జీవీఎంసీకి పైసా ఆదాయం సమకూరడం లేదు. పైగా అక్కడ పారిశుధ్య నిర్వహణ, లైటింగ్ కోసం సిబ్బందిని కేటాయించి, నిధులు వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది దళారులు నైట్ ఫుడ్‌కోర్ట్‌ను గుప్పిట్లో పెట్టుకుని జేబులు నింపుకుంటున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. దీనివెనుక వైసీపీ ప్రజాప్రతినిధులున్నారని బహిరంగంగానే విమర్శించారు. ఫుడ్‌కోర్ట్‌ను రద్దుచేయాలని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో తరచూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన కౌన్సిల్ ఫుడ్‌కోర్ట్‌ను తొలగించాలని ఏడాది కిందటే తీర్మానం చేసింది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. దీంతో టీడీపీ, జనసేన కార్పొరేటర్లు ప్రెస్‌మీట్ పెట్టి నైట్ ఫుడ్‌కోర్ట్‌లో జరుగుతున్న అక్రమాలను ఏకరువుపెట్టారు. వైసీపీ నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారని, డిసెంబరు 30లోగా ఫుడ్‌కోర్ట్‌ను తొలగించాలని, లేదంటే ధర్నా చేస్తామని జీవీఎంసీ కమిషనర్‌కు అల్టిమేటం జారీచేశారు. తర్వాత ఏమైందో కూటమి కార్పొరేటర్లంతా మౌనం వహించారు. కాగా వారికి ఏదో ఆఫర్ వచ్చి ఉంటుందని, అందుకే నోరెత్తడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.