గ్రిడ్‌కు తలూపితే నిధులు నీళ్లపాలేనా?
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:33 PM
ప్రజా క్షేమం కోసం ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందులోని లోటుపాట్లను అధికారులు గుర్తించి తగిన సూచనలు చేయాలి. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా చూడాలి. కానీ జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
వాటర్ గ్రిడ్ విధానం ద్వారా ప్రజలకు తాగునీరు అందించాలని ప్రభుత్వం యోచన
1,554 జల్ జీవన్ మిషన్ పనుల రద్దుకు నిర్ణయం
రూ.1,500 కోట్లతో వాటర్ గ్రిడ్ స్కీమ్‌కు ప్రతిపాదనలు
గిరిజన గ్రామాల్లో గ్రిడ్‌తో నీటి సరఫరా సాధ్యం కాదని తెలిసినా ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు ముందడుగు
కమీషన్ల కోసం కలెక్టర్‌ను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు
గతంలో సుజనకోటలో ఇదే తరహా ప్రయోగం విఫలం
రూ.3.5 కోట్లు వృథా
అధికారుల తీరుతో సర్కారుకు చెడ్డ పేరు వస్తుందని పలువురి అభిప్రాయం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ప్రజా క్షేమం కోసం ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందులోని లోటుపాట్లను అధికారులు గుర్తించి తగిన సూచనలు చేయాలి. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా చూడాలి. కానీ జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జల్ జీవన్ మిషన్ పనులు రద్దు చేసి వాటర్ గ్రిడ్ విధానం ద్వారా ప్రజలకు తాగునీరు అందించాలనే సర్కారు యోచన వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పలువురు అభిప్రాయపడు తున్నారు.
జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ కొళాయిల ద్వారా తాగునీరు అందించే ప్రక్రియకు స్వస్తి పలికి, వాటర్ గ్రిడ్ విధానంలో రిజర్వాయర్ ఆధారంగా ఒక పెద్ద నీటి పథకాన్ని నిర్మించి దాని ద్వారా ప్రజలకు తాగునీటిని అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా మైదాన ప్రాంతాల్లో పలు రిజర్వాయర్లను ప్రభుత్వం గుర్తించింది. అయితే అటువంటి వాటర్ గ్రిడ్ విధానం మైదాన ప్రాంతానికి సరిపోతుందని, అయితే కొండకోనల్లో ఇళ్లులుండే గిరిజన ప్రాంతానికి సరికాదనే వాదన బలంగా వినిపిస్తున్నది. రిజర్వాయర్‌లో నీటిని సేకరించి ఒక ప్రాంతంలో నిల్వ చేసి పైపుల ద్వారా గ్రామాలకు, కొళాయిలతో ఇంటింటికీ నీటిని సరఫరా చేయడం గిరిజన ప్రాంతంలో సాధ్యం కాని పని. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో తాగునీటి పథకాలను నిర్మించడం ద్వారా మాత్రమే గిరిజనులకు తాగునీటిని అందించగలమనే విషయం స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు అనుభవ పూర్వకంగా తెలుసు. అయినప్పటికీ వాటర్ గ్రిడ్ విధానం సాధ్యాసాధ్యాలను కనీసం పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను ఏదో విధంగా వ్యయం చేసి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తమ కమీషన్ల పంచుకోవాలని చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటర్ గ్రిడ్ విధానంతో గిరిజన ప్రాంతంలో నీటిని అందించగలమా?, విఫలమైతే గిరిజనుల పరిస్థితి ఏమిటి? అనే దానిపై కనీసం ఆలోచన చేయకుండా ముందుకు వెళుతుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
1,554 జల్ జీవన్ మిషన్ పనులు రద్దుకు నిర్ణయం
వాటర్ గ్రిడ్ విధానాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతానికి ప్రారంభం కాని జల్ జీవన్ మిషన్ పనులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వాటర్ గ్రిడ్ పనులు పూర్తయి తాగునీటిని అందించే వరకు గిరిజన ప్రాంతంలో దాహం కేకలు మరింత పెరుగుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ఏజెన్సీ 11 మండలాల్లో 3,866 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.237 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతానికి రూ.54 కోట్లతో 2,272 పనులు ప్రగతిలో ఉండగా, రూ.183 కోట్ల విలువైన 1,594 పనులను రద్దు చేస్తున్నారు. దీంతో సుమారుగా 1500 గ్రామాలకు వాటర్ గ్రిడ్ స్కీమ్ పూర్తయితేనే గాని తాగునీరు అందే పరిస్థితి ఉండదు. ఈ క్రమంలో ఏజెన్సీలో గిరిజనులకు తాగునీటి సమస్యలు అధికమై, కూటమి ప్రభుత్వం నిర్వాకంతోనే తమకు తాగునీటి కష్టాలు తప్పలేదని ప్రజల్లో ప్రభుత్వంపై చెడు అభిప్రాయానికి దారి తీసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎంత వేగంగా పనులు చేసినా వాటర్ గ్రిడ్ పనులు పూర్తవడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. అప్పటి వరకు జల్ జీవన్ మిషన్ పనులు రద్దయిన సుమారు 1500 గ్రామాల్లోని గిరిజనులకు దాహం కేకలు తప్పవని స్పష్టమవుతున్నది.
రూ.1,500 కోట్లతో వాటర్ గ్రిడ్ స్కీమ్‌కు ప్రతిపాదనలు
మన్యంలో వాటర్ గ్రిడ్ ద్వారా ప్రజలకు తాగునీటిని అందించేందుకు సుమారుగా రూ.1500 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించే పనిలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసే బాధ్యతలను ఇప్పటికే ఒక ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఏజెన్సీలో అనంతగిరి మండలంలోని గ్రామాలకు విజయనగరం జిల్లాలోని తాటిపూడి రిజర్వాయర్ నుంచి, మిగిలిన ముంచంగిపుట్టు, పెదబయలు, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలకు జోలాపుట్టు రిజర్వాయర్ నుంచి తాగునీటి అందించాలని భావిస్తున్నారు. వాస్తవానికి జోలాపుట్టు రిజర్వాయర్‌లో వర్షాకాలం మినహా వేసవితో తగినన్ని జల వనరులు అందుబాటులో ఉండని దుస్థితి. అయినప్పటికీ వాటర్ గ్రిడ్‌తో ఏజెన్సీలోని ప్రతి గ్రామానికి తాగునీటిని అందించేందుకు చర్యలు చేపడతామని, అందుకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ఈ నెల రెండో వారంలో ప్రతిపాదనలు సమర్పించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే ఈ విషయంలో కలెక్టర్‌ను సైతం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని, కేవలం సాంకేతిక అంశాలు ఆయనకు చెబుతూ, వాస్తవ పరిస్థితులను దాచి పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
గతంలో సుజనకోటలో రూ.3.5 కోట్లు వృథా
గ్రిడ్ తరహాలో తాగునీరు సరఫరా చేయడం గిరిజన ప్రాంతంలో అసాధ్యమని చెప్పేందుకు ముంచంగిపుట్టు మండలంలో గతంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏర్పాటు చేసిన చిన్న వాటర్ గ్రిడ్ పథకాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జోలాపుట్టు రిజర్వాయర్ నీటి ఆధారంగా ముంచంగిపుట్టు మండలంలోని సుజనకోట గ్రామంలో రూ.3 కోట్ల 50 లక్షల వ్యయంతో ముంచంగిపుట్టు మండల కేంద్రంతో పాటు మరో పది గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఆ నీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. అయితే రిజర్వాయర్‌లో తగినన్ని నీటి నిల్వలు లేకపోవడంతో పాటు నీటి పథకం ఏర్పాటు చేసిన సుజనకోట గ్రామం నుంచి ఇతర గ్రామాలకు పైపుల ద్వారా నీటిని సరఫరా చేయలేకపోయారు. దీంతో ఆ నీటి పథకం పూర్తిగా మూలకు చేరింది. దీంతో ఆయా గ్రామాల్లోనే ప్రత్యామ్నాయంగా బోర్లను తవ్వి ప్రజలకు నీటిని అందించే చర్యలు చేపట్టారు. దీంతో సుజనకోటలో వాటర్ గ్రిడ్ స్కీమ్‌కు వెచ్చించిన రూ.3 కోట్ల 50 లక్షలు వృఽథా అయ్యాయి. జోలాపుట్టు రిజర్వాయర్ నీటి ఆధారంగా కేవలం 11 గ్రామాలకు నీటిని సరఫరా చేయలేని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తాజా వాటర్ గ్రిడ్ పథకం ద్వారా అదే రిజర్వాయర్ నీటి ఆధారంగా వందల సంఖ్యలో గ్రామాలకు తాగునీటిని ఎలా సరఫరా చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా గతంలో సుజనకోటలో వాటర్ గ్రిడ్ స్కీమ్ ఏర్పాటు చేసిన సమయంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈగా ఉన్న అధికారే ప్రస్తుతం ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈగా పని చేస్తుండడం గమనార్హం.