Share News

ఏయూ ఆదాయానికి గండి

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:10 AM

మైదానాలను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఏటా భారీగా ఆదాయం సమకూరుతుంది.

ఏయూ ఆదాయానికి గండి

  • మైదానాల కేటాయింపులో వర్సిటీ అధికారుల పక్షపాతం

  • ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను కొన్నాళ్లుగా ఒకే వ్యక్తికి కట్టబెడుతున్న వైనం

  • ఒడిశాకు చెందిన ఈవెంట్‌ మేనేజర్‌ దరఖాస్తు తిరస్కరణ

  • వర్సిటీ మాజీ ఉన్నతాధికారి సన్నిహితుడికితక్కువ అద్దెకే కేటాయింపు

  • చక్రం తిప్పుతున్న ఇదే సెక్షన్‌లోని ఉన్నతాధికారి

  • ఆదాయానికి గండి పడుతున్నా దృష్టిసారించని ఉన్నతాధికారులు

విశాఖపట్నం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):

మైదానాలను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఏటా భారీగా ఆదాయం సమకూరుతుంది. సువి శాల విస్తీర్ణంలో ఉన్న వర్సిటీకి పలు చోట్ల ఖాళీ స్థలాలు ఉండడంతో వాటిని అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని సమూపార్జించు కుంటున్నారు. అయితే వర్సిటీలోని కొందరు అధికారులు ఆదాయానికి గండి కొట్టేలా నిర్ణయాలను తీసుకుంటున్నారు. మైదానాల కేటాయింపుల్లో ఆశ్రిత పక్షపాతం వర్సిటీకి తీవ్ర నష్టం కలిగిస్తోంది.

తాజాగా ఏయూ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల వెనుక ఉన్న ఎగ్జిబిషన్‌ మైదానంలో భారీ ఈవెంట్‌ నిర్వహించేందుకు ఇడిశాకు చెందిన ప్రముఖ ఈవెంట్‌ మేనేజర్‌ వర్సిటీ అధికారులను సంప్రదించారు. మైదానం అద్దెకు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కంటే భారీగానే అద్దె చెల్లించేందుకు సిద్ధపడ్డారు. అయితే సంక్రాంతి సీజన్‌ కావడంతో కొన్నేళ్లుగా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి వర్సిటీ అధికారులను సంప్రదించాడు. తనకు మైదానాన్ని ఇవ్వాలని కోరారు. ఈ వ్యక్తి వర్సిటీ మాజీ ఉన్నతాధికారికి అత్యంత ఆత్మీయుడు కావడంతో ఈ సెక్షన్‌లోని అధికారులు తలలూపారు. గతంలో దరఖాస్తు చేసిన వ్యక్తికి మైదానం అద్దెకు ఇవ్వడం కుదరదని చెప్పేశారు. మాజీ ఉన్నతాధికారికి ఆత్మీయుడైన వ్యక్తికి తక్కువ అద్దెకే ఇచ్చేశారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మైదానంలో ఏడెకరాలు వినియోగంలో ఉన్నట్టు తెలుస్తోంది. నగరం మధ్యలో ఉన్న ఈ స్థలాన్ని అద్దెకు ఇస్తే రోజుకు రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. కానీ వర్సిటీ అధికారులు మాత్రం తక్కువ అద్దెకు ఇచ్చి స్వామిభక్తిని చాటుకున్నారు. దీంతో వర్సిటీ ఆదాయానికి భారీగా గండిపడింది. అయినప్పటికీ ఉన్నతాధికారుల్లో చలనం కనిపించడం లేదు.

ఉన్నతాధికారి సూచనతోనే?

సాధారణంగా మైదానం కోసం పోటీ ఉన్నప్పుడు ఎక్కువ అద్దె ఎవరు ప్రతిపాదిస్తే వారికి ఇవ్వాలి. కానీ అధికారులు తమకు కావాల్సిన వారికి తక్కువ అద్దెకు ఇవ్వడంపైనే దృష్టి పెట్టారు. ఈ కేటాయింపు వెనుక మాజీ ఉన్నతాధికారి సూచనలున్నాయని చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి వర్సిటీ ఆదాయానికి గండి పడకుండా చూడాలని కోరుతున్నారు. సాధారణంగా మైదానం అద్దెకు ఇవ్వాలంటే నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌ ఇవ్వాలని, కానీ అవేవీ పాటించడం లేదని చెబుతున్నారు.

విశాఖ లాంటి మహా నగరంలో భిన్నమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు సువిశాలమైన స్థలాన్ని కోరుకునే వ్యాపారులు, ఈవెంట్‌ ఆర్గనైజర్లు ఎంతోమంది ఉన్నారు. వర్సిటీ అధికారులు మాత్రం ఈ స్థలాన్ని ఎప్పుడూ ఒకే వ్యక్తికి కట్టబెడుతున్నారు. దీనివెనుక ఆంతర్యమేమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు.

Updated Date - Jan 06 , 2025 | 01:10 AM