పందెం కోఢీ.. రెడీ
ABN , Publish Date - Jan 11 , 2025 | 10:56 PM
సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాల్లో ముందుగా అందరికీ గుర్తొచ్చేది కోడి పందాలు. జిల్లాలో పండుగకు ముందే సన్నాహక కోడి పందాలు ఊపందుకున్నాయి. పండుగకు గ్రామాల్లోని మారుమూల తోటల్లో కోడి పందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామాల్లో కోడి పందాల నిర్వహణకు సన్నాహాలు
మారుమూల తోటల్లో గుట్టుగా బరిల ఏర్పాటు
ఈ ఏడాది ముందుగానే సిద్ధం చేసిన నిర్వాహకులు
అనకాపల్లి రూరల్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాల్లో ముందుగా అందరికీ గుర్తొచ్చేది కోడి పందాలు. జిల్లాలో పండుగకు ముందే సన్నాహక కోడి పందాలు ఊపందుకున్నాయి. పండుగకు గ్రామాల్లోని మారుమూల తోటల్లో కోడి పందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అనకాపల్లి మండలంలోని 32 పంచాయతీలతో పాటు జీవీఎంసీ విలీన గ్రామాల్లో కూడా కోడి పందాలను ఉభయ గోదావరి జిల్లాకు దీటుగా నిర్వహించడం ఎప్పటి నుంచో ఆనవాయితీ వస్తోంది. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు ముందు నుంచే కోడి పందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. పందాల నిర్వహణకు బరిలను కూడా సిద్ధం చేస్తున్నారు. గ్రామాలకు, జనసంచారానికి దూరంగా పోలీసులు దాడులు చేస్తే సులభంగా తప్పించేందుకు వీలుగా వీటిని తయారు చేస్తున్నారు. ప్రధానంగా యూకలిప్టస్, జీడీ తోటల్లో నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పందెం పుంజులు సిద్ధం
గ్రామాల్లో పోటీలకు పందెం పుంజులు సిద్ధమయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి రూ.3 వేలు నుంచి రూ.15 వేలు వరకు వెచ్చించి వాటిని కొనుగోలు చేసి తీసుకొచ్చి మేపుతున్నారు. జీడీపప్పు, బాదంపప్పు వంటి పౌష్టికాహారాన్ని పెట్టి పోటీలకు రోజూ శిక్షణ ఇస్తున్నారు. సంక్రాంతి పండుగకు ముందుగానే బరిలను సిద్ధం చేస్తుండడంతో ఈ సంవత్సరం భారీ ఎత్తున డబ్బులు చేతులు మారే అవకాశం వుంది.