సంప్రదాయాలను గుర్తు చేసేలా భోగి పండుగ
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:20 AM
నేటి తరానికి పాత సంప్రదాయాలను గుర్తు చేసేలా వాకర్స్ క్లబ్ సభ్యులు భోగి పండుగ నిర్వహించారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి పండుగను నిర్వహించారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): నేటి తరానికి పాత సంప్రదాయాలను గుర్తు చేసేలా వాకర్స్ క్లబ్ సభ్యులు భోగి పండుగ నిర్వహించారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి పండుగను నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భోగి మంటను వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు. వచ్చే ఉగాది పండుగను రాష్ట్రంలో 14 వేల పంచాయతీలలో జరిపేలా జీవో ఇవ్వాలని చంద్రబాబును కోరానని తెలిపారు. మంగళవారం నుంచి నిర్వహించే మకరజ్యోతి ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో కంచి పీఠం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని, అవసరమైన స్థలం ఇస్తామని పీఠాధిపతికి తెలిపామని చెప్పారు. అనంతరం పిల్లలకు గాలిపటాలు పంపిణీ చేశారు. గచ్చపువీధి బృందం కోలాటం, హార్ట్‌పుల్ మెడిటేషన్ పిల్లల డాన్సులు, బుడబుక్కలు, హరిదాసు, గంగిరెడ్లు, కొయ్యదొర, సోదమ్మ ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. భోగి పండుగలో పాల్గొన్న వారి కోసం సంప్రదాయబద్ధంగా కట్టు పొంగలి, పచ్చిపులుసుతో పాటు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, అప్పలనాయుడు, క్లబ్ కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ, ట్రెజరర్ అల్లు అప్పారావు, ప్రోగ్రామ్ కో- ఆర్డినేటర్ బాబీ, కుప్పిలి స్వామి, ఎంవీ రంగారావు, తదితరులు పాల్గొన్నారు.