బౌద్ధుల ఆరామం బొజ్జనకొండ
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:57 AM
అనకాపల్లి మండలం శంకరం రెవెన్యూ పరిధిలోని ప్రముఖ బౌద్ధక్షేత్రం బొజ్జన్నకొండ బౌద్ధ మేళాకు సిద్ధమైంది. విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి ఏటా కనుమ పండుగ రోజున మేళా నిర్వహించడం అనాదిగా వస్తున్నది. గురువారంనాడు బొజ్జన్నకొండపై ప్రత్యేక ప్రార్థనలు, శాంతి ర్యాలీ, బుద్ధుని ఉపన్యాసాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దేశ, విదేశాల నుంచి బౌద్ధ భిక్షువులు హాజరవుతారు. కొండ దిగువ మైదానంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ ఎత్తున బొజ్జన్నకొండ తీర్థం జరుగుతుంది. పతంగుల పోటీలు నిర్వహిస్తారు.
4-9 శాతాబ్దాల కాలంలో విరాజిల్లిన బొజ్జన్నకొండ
ఆకట్టుకునే శిల్పసంపద, గుహలు, ఆరామాలు
ఇటీవల రూ.7.5 కోట్లతో అభివృద్ధి చేసిన కేంద్రం
కనుమ పండుగ సందర్భంగా బౌద్ధ మేళా రేపు
తుమ్మపాల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం శంకరం రెవెన్యూ పరిధిలోని ప్రముఖ బౌద్ధక్షేత్రం బొజ్జన్నకొండ బౌద్ధ మేళాకు సిద్ధమైంది. విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి ఏటా కనుమ పండుగ రోజున మేళా నిర్వహించడం అనాదిగా వస్తున్నది. గురువారంనాడు బొజ్జన్నకొండపై ప్రత్యేక ప్రార్థనలు, శాంతి ర్యాలీ, బుద్ధుని ఉపన్యాసాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దేశ, విదేశాల నుంచి బౌద్ధ భిక్షువులు హాజరవుతారు. కొండ దిగువ మైదానంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ ఎత్తున బొజ్జన్నకొండ తీర్థం జరుగుతుంది. పతంగుల పోటీలు నిర్వహిస్తారు.
బొజ్జన్నకొండకు సుదీర్ఘ చరిత్ర
బొజ్జన్నకొండకు సుదీర్ఘ చరిత్ర వుంది. క్రీస్తు శకం నాలుగు నుంచి తొమ్మిది శతాబ్దాల మధ్య కాలంలో ఇక్కడ బౌద్ధ ఆరామాలుగా విరాజిల్లినట్టు చరిత్ర చెబుతున్నది. అయితే 1906-08లో బ్రిటీషర్ అలెగ్జాండర్ రిమ్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగే వరకు ఇక్కడ బౌద్ధ ఆరామాలు వున్నట్టు బాహ్య ప్రపంచానికి తెలియదు. నాటి తవ్వకాల్లో అలనాటి రాజశాసనాలు, నాణేలు, బౌద్ధక్షేత్ర అవశేషాలు బయటపడ్డాయి. ఇక్కడ లభించిన బంగారు నాణేల్లో కొన్ని సముద్రగుప్తుని హయాంలోని కాగా మరికొన్ని శాతవాహనుల కాలం నాటివని చరిత్రకారులు నిర్ధారించారు. కొండ మొదటి గుహ వద్ద బుద్ధునిఇ నిలువెత్తు స్థూపం ఉంది. బౌద్ధ భిక్షువులు నిత్యం ధ్యానం చేస్తూ బౌద్ధమతం గురించి ఈ ప్రాంతంలో ప్రచారం చేసేవారని చెబుతుంటారు. పక్కనే ఉన్న లింగాలకొండపై వందల సంఖ్యలో లింగాకార స్థూపాలు ఉన్నాయి.
పర్యాటకంగా గుర్తింపు
కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని బొజ్జన్నకొండను నిత్యం ఎంతో పర్యాటకులు సందర్శిస్తుంటారు. కొండపైన, గుహ లోపల శిల్ప సంపద, బుద్ధుని విగ్రహాలు, ధాన్య మందిరాలు, బౌద్ధ భిక్షువులు ఆవాసం వుండడానికి పెద్ద పరిమాణంలోగల ఇటుకలతో నిర్మించిన ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.7.5 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టింది. లేజర్ షో, సౌండ్ అండ్ లైటింగ్ షో, ధ్యాన మందిరం, ముఖద్వారం నిర్మించారు. దీంతో బొజ్జన్నకొండ మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రతి ఏటా కనుమ పండుగనాడు బౌద్ధమేళా నిర్వహిస్తుంటారు. బొజ్జన్నకొండకు వెళ్లాలంటే అనకాపల్లి పట్టణం నుంచి చోడవరం రోడ్డులో గల తుమ్మపాలకు చేరుకుని ఇక్కడి నుంచి తూర్పు దిశగా ప్రయాణించి బొజ్జన్నకొండకు చేరుకోవచ్చు. అనకాపల్లి- ఆనందపురం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న శంకరం గ్రామం నుంచి కూడా బొజ్జన్నకొండకు వెళ్లవచ్చు.