విశాఖలో గ్రావెల్ దొంగలు!
ABN , Publish Date - Jan 13 , 2025 | 12:33 AM
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కొండలపై గ్రావెల్ దొంగలు పడ్డారు.
రాజకీయ నేతల పేరుతో అక్రమాలు
యథేచ్ఛగా గ్రావెల్, మట్టి తవ్వకాలు
ఆనందపురం మండలంలో జేబులు నింపుకుంటున్న మట్టి మాఫియా
గుర్రంపాలెం ఏపీఐఐసీ లేఅవుట్‌లో ప్లాట్ల ఫిల్లింగ్ పేరుతో విక్రయాలు
విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కొండలపై గ్రావెల్ దొంగలు పడ్డారు. ఎక్సవేటర్లతో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వుకుని విక్రయిస్తున్నారు. రాత్రికి రాత్రే యంత్రాలతో కొండలు డొలిచేస్తున్నారు. రాత్రిపూట, తెల్లవారుజామున ఈ దందా దర్జాగా సాగుతోది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల అండతో రెచ్చిపోయిన గ్రావెల్ మాఫియా కూటమి అధికారంలోకి వచ్చినా అక్రమాలు కొనసాగిస్తోంది.
గత ఏడాది డిసెంబరు వరకు వర్షాలు కురవడం కొండల తవ్వకాలకు అనువుగా మారింది. ఆనందపురం మండలం తర్లువాడ, నగరపాలెం, శొంఠ్యాం, గిడిజాల, చందక, రామవరం, గండిగుండం, కుశలవాడ, దబ్బంద తదితర గ్రామాలు, పెందుర్తి పరిధిలోని నరవ, గుర్రంపాలెం తదితర గ్రామాల్లో గ్రావెల్ తవ్వకాలు పెచ్చుమీరుతున్నాయి. తర్లువాడ పంచాయతీ నగరపాలం సర్వేనంబరు 165లో ఉన్న కొండను అదే గ్రామానికి ఓ వ్యక్తి రాత్రిపూట తవ్వి తరలిస్తున్నారు. ఉదయం కొండ వద్దకు వెళితే... ఆనవాళ్లు మినహా ఎవరూ కనిపించరు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన ఈ వ్యక్తి ఇప్పుడూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఇతడికి కూటమి పార్టీలకు చెందిన చోటా నాయకులు, రెవెన్యూ, పోలీసుల అండ ఉందనే ఆరోపణలున్నాయి. శొంఠ్యాంలో స్థానిక ప్రజాప్రతినిఽధికి గనుల శాఖ భారీ జరిమానా విధించినా అతడి అనుచరులు అక్రమాలను ఆపలేదు. గిడిజాల కొండ నుంచి వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వి విక్రయించిన మరికొందరు స్థానిక నాయకులు రూ.కోట్లు సంపాదించారు. జాతీయ రహదారికి ఆనుకుని వాణిజ్య సముదాయాలు, లేఅవుట్‌లు, ఇళ్ల నిర్మాణాలకు భారీగా గ్రావెల్, మట్టి అవసరం కావడంతో అక్రమార్కుల పండ పండుతోంది.
గుర్రంపాలెంలోనూ అంతే...
పెందుర్తి మండలం గుర్రంపాలెం పారిశ్రామిక లేఅవుట్‌లో వ్యాపారులకు కేటాయించిన ప్లాట్ల ఫిల్లింగ్‌కు తొలుత ఏపీఐఐసీకి చెందిన కొండను తవ్వేశారు. ఆ తరువాత పక్కనే ఉన్న రెవెన్యూకు చెందిన కొండను తవ్వుతున్నారు. అక్రమంగా గ్రావెల్ తవ్విన ఏడు పారిశ్రామిక సంస్థలకు గనుల శాఖ విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీచేశారు. అయినా మరికొందరు పారిశ్రామికవేత్తలు గ్రావెల్ తవ్వుతూనే ఉన్నారు. ఈ తవ్వకాలకు ఒకరిద్దరికి మాత్రమే పర్మిట్లున్నాయి. ఏపీఐఐసీకి చెందిన కొండను పరిరక్షించాల్సిన సంస్థ అధికారులు, సిబ్బంది ప్లాట్ల యజమానులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి. విచిత్రమేమిటంటే కొండలు తవ్వేసిన తరువాత హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీఐఐసీ కేటాయించిన ప్లాట్ల ఫిల్లింగ్, సమీపంలో గుట్ట, రెవెన్యూకు చెందిన కొండలో అక్రమతవ్వకాలపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే గూగూల్ మ్యాపులు పరిశీలించాలనే వాదన వినిపిస్తోంది. దీంతో పాటు గ్రావెల్ తవ్వకాల వ్యవహారంలో ఏపీఐఐసీ అధికారుల నిర్వాకంపై విచారణ చేపట్టాలని గండిగుండం, గుర్రంపాలెం గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.