గురువులు అడ్డదారి
ABN , Publish Date - Jan 08 , 2025 | 01:06 AM
ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న కొంత మంది ఉపాధ్యాయులు అడ్డదారిలో నడుస్తున్నారు. తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్టు పేర్లు నమోదు చేసి, ప్రైవేటు సూళ్లలో చదివిస్తున్నారు. మరోవైపు రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతిధుల ఒత్తిళ్లు లేదా సిఫారసుతో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లను ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్ చేస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు అందడంతో నర్సీపట్నం, రోలుగుంట, గొలుగొండ, చోడవరం మండలాల్లో విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టారు. వాస్తవమని తేలడంతో చర్యలకు ఉపక్రమించారు. చోడవరం మండలంలో ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నర్సీపట్నం మండలంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఈ తరహా అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. ఒకటి, రెండు రోజుల్లో వీరిపై చర్యలు తీసుకుంటారని తెలిసింది.
తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు
నర్సీపట్నం మండలంలో రెండు ఎంపీపీ పాఠశాలల్లో డిప్యూటీ డీఈవో విచారణ
ఇద్దరు విద్యార్థుల గుర్తింపు
గోప్యత పాటిస్తున్న విద్యా శాఖ అధికారులు
చోడవరం మండలంలో ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
నర్సీపట్నం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న కొంత మంది ఉపాధ్యాయులు అడ్డదారిలో నడుస్తున్నారు. తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్టు పేర్లు నమోదు చేసి, ప్రైవేటు సూళ్లలో చదివిస్తున్నారు. మరోవైపు రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతిధుల ఒత్తిళ్లు లేదా సిఫారసుతో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లను ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్ చేస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు అందడంతో నర్సీపట్నం, రోలుగుంట, గొలుగొండ, చోడవరం మండలాల్లో విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టారు. వాస్తవమని తేలడంతో చర్యలకు ఉపక్రమించారు. చోడవరం మండలంలో ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నర్సీపట్నం మండలంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఈ తరహా అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. ఒకటి, రెండు రోజుల్లో వీరిపై చర్యలు తీసుకుంటారని తెలిసింది.
కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీట్లకు డిమాండ్ అధికంగా వుంటుంది. ఇందులో ప్రవేశాలకు గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యం వుంటుంది. దీంతో నవోదయలో సీటు కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తూ మరోవైపు ప్రత్యేకంగా కోచింగ్ కూడా ఇప్పిస్తుంటారు. అయితే కొంతమంది ఉపాధ్యాయులు తమ పిల్లలకు నవోదయ విద్యాలయంలో సీటు సాధించడం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. తమ పిల్లలను ప్రైవేటు/ కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నట్టు రికార్డుల్లో పేర్లు నమోదు చేస్తున్నారు. విద్యార్థి ప్రభుత్వ పాఠశాలకు హాజరు కాకపోయినప్పటికీ రోజూ బడికి వస్తున్నట్టు హాజరు నమోదు చేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు తమ పిల్లలకు నవోదయ విద్యాలయంలో సీటు సాధించడానికి ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తూ రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల సిఫారసులతో ప్రభుత్వ పాఠశాలల్లో పేర్లు నమోదు చేయిస్తున్నారు. వీరికి కొంతమంది ఉపాధ్యాయులు సహకరిస్తున్నారు. ఈ తరహా ప్రవేశాలపై ఫిర్యాదులు రావడంతో జిల్లా విద్యా శాఖ అధికారి గిడ్డి అప్పారావునాయుడు ఆదేశాలతో ఎలమంచిలి డిప్యూటీ డీఈవో అప్పారావు సోమవారం నర్సీపట్నం మండలంలో విచారణ చేశారు. రెండు ఎంపీపీ పాఠశాలల్లో ఒక్కొక్కరు చొప్పున విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో పేర్లు నమోదైనట్టు గుర్తించారు. అయితే అక్రమాలకు పాల్పడిన ఉపాధ్యాయుల పేర్లు వెల్లడించడానికి డిప్యూటీ డీఈవో ఇష్టపడలేదు. విచారణ నివేదికను డీఈవోకు అందజేస్తానని, సదరు ఉపాధ్యాయుల పేర్లను ఆయన వెల్లడిస్తారని చెప్పారు. దీనిపై డీఈవో గిడ్డి అప్పారావునాయుడుని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, ఇప్పటి వరకు ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లు తన దృష్టికి వచ్చాయన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని మండల విద్యా శాఖ అధికారులతో విచారణ చేయిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో పేర్లు నమోదు చేయించి, ప్రైవేటు పాఠశాలలో చదివించడం నేరమని అన్నారు.
ఎంఈవోల నుంచి నివేదికలు
ప్రభుత్వ పాఠశాలల్లో పేర్లు నమోదై, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల గురించి అధికారులు కూపీ లాగుతున్నారు. ఈ మేరకు మండల విద్యా శాఖాధికారుల నుంచి డీఈవో నివేదికలు తెప్పించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అటువంటివి ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని ఆదేశించారు. ఎంఈవోలు ప్రధానోపాధ్యాయుల నుంచి వివరణ తీసుకుంటున్నారు.
చోడవరం మండలంలో ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
చోడవరం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): చోడవరం మండలంలో ఆరుగురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో పేర్లు నమోదు చేయించుకుని, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నట్టు విద్యా శాఖ అధికారులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. వీరిలో ఇద్దరు ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తూ, తాము పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల రికార్డుల్లో నమోదు చేశారు. మిగిలిన నలుగురు ఉపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల సిఫారసులు, తెలిసిన వారి ఒత్తిళ్లతో వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నట్టు చూపించినట్టు సమాచారం. మొత్తం ఆరుగురు ఉపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు ఉపాధ్యాయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే ఆ ఉపాధ్యాయులు ఎవరన్నది వెల్లడించడానికి విద్యా శాఖ అధికారులు విముఖత చూపుతున్నారు.