Share News

చిన్నపిల్లలు తప్పిపోతే ఆర్‌ఎఫ్‌ఐడీ ద్వారా గుర్తింపు

ABN , Publish Date - Jan 05 , 2025 | 01:38 AM

సభలు, సమావేశాలు, జాతరల సందర్భంగా చిన్న పిల్లలు తప్పిపోతే వారిని తక్షణం గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించేందుకు విశాఖ నగర పోలీసులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) తీసుకువచ్చారు.

చిన్నపిల్లలు తప్పిపోతే ఆర్‌ఎఫ్‌ఐడీ ద్వారా గుర్తింపు

నేవీ డే సందర్భంగా తొలిసారి అమలుచేసిన విశాఖ పోలీసులు

విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):

సభలు, సమావేశాలు, జాతరల సందర్భంగా చిన్న పిల్లలు తప్పిపోతే వారిని తక్షణం గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించేందుకు విశాఖ నగర పోలీసులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) తీసుకువచ్చారు. బీచ్‌రోడ్డులో శనివారం జరిగిన నేవీ విన్యాసాలు సందర్భంగా తొలిసారి దీనిని అమలుచేశారు. నేవీ విన్యాసాలను వీక్షించేందుకు తల్లిదండ్రులతో కలిసి బీచ్‌కు వచ్చిన ఐదేళ్లలోపు పిల్లల పేరు, తల్లిదండ్రుల పేరు, ఫోన్‌ నంబర్‌, చిరునామాతో కూడిన వివరాలను ఒక క్యూఆర్‌కోడ్‌ రూపంలో ట్యాగ్‌పై ముద్రించారు. ఆ ట్యాగ్‌లను పిల్లల చేతికి అతికించారు. ఎవరైనా పిల్లలు తప్పిపోయినప్పుడు వారి వివరాలను చెప్పలేరు కాబట్టి, తమ సెల్‌ఫోన్‌ ద్వారా చేతికి ఉన్న ట్యాగ్‌లోని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే మొత్తం సమాచారం తెలుసుకోవచ్చు. వాటి ఆధారంగా పిల్లలను వారి తల్లిదండ్రులకు వెంటనే అప్పగించేందుకు వీలుంటుంది. నేవీ విన్యాసాల సందర్భంగా శనివారం బీచ్‌కు వచ్చిన రెండు వేల మంది చిన్నారులకు ట్యాగ్‌ వేసినట్టు సీపీ శంఖబ్రతబాగ్చి తెలిపారు.

Updated Date - Jan 05 , 2025 | 01:38 AM