వేటజంగాలపాలెంలో అక్రమ మైనింగ్
ABN , Publish Date - Jan 10 , 2025 | 01:20 AM
ప్రభుత్వ సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో కుమ్మక్కు అవుతున్నారు. వారి నుంచి మామూళ్లు పుచ్చుకుంటూ సహజ సంపద దోపిడీకి సహకరిస్తున్నారు. దీంతో తవ్వకాలకు అనుమతులు లేని క్వారీల నుంచి పగలు, రాత్రి అన్న తేడా లేకుండా భారీ వాహనాలతో నల్లరాయిని తరలించుకుపోతున్నారు. అయినా సరే ఎక్కడా తనిఖీలు చేపట్టడంలేదు.
ఈసీలు లేకుండానే రాయి క్వారీల్లో తవ్వకాలు
రేయింబవళ్లు భారీ వాహనాలతో తరలింపు
కలెక్టర్, తహసీల్దారు హెచ్చరిక బోర్డుల సాక్షిగా రవాణా
పట్టించుకోని సంబంధిత శాఖల అధికారులు
మామూళ్లు పుచ్చుకుంటూ అక్రమార్కులకు సహకారం?
కొత్తూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో కుమ్మక్కు అవుతున్నారు. వారి నుంచి మామూళ్లు పుచ్చుకుంటూ సహజ సంపద దోపిడీకి సహకరిస్తున్నారు. దీంతో తవ్వకాలకు అనుమతులు లేని క్వారీల నుంచి పగలు, రాత్రి అన్న తేడా లేకుండా భారీ వాహనాలతో నల్లరాయిని తరలించుకుపోతున్నారు. అయినా సరే ఎక్కడా తనిఖీలు చేపట్టడంలేదు.
అనకాపల్లి మండలం వేటజంగాలపాలెం 84 సర్వే నంబరులో 36, కుంచంగి 316 సర్వే నంబరులో ఎనిమిది రాయి క్వారీలు వున్నాయి. మైనింగ్ అధికారులు క్వారీల్లో రాయి తవ్వకాలు, రవాణాకు ప్రస్తుతం ఒక్క క్వారీకి కూడా ఈసీ ఇవ్వలేదు. అయినా సరే పలు క్వారీల్లో రాయి కోసం పెద్ద ఎత్తున పేలుళ్లు జరుపుతున్నారు. ఎక్స్‌కవేటర్లతో రాళ్లను భారీ డంపర్ లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లలోకి లోడింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి రాంబిల్లి మండలంలో ఎన్‌ఏఓబీ పనులకు తరలిస్తున్నారు. ఈసీలు లేకుండానే రేయింబవళ్లు నల్లరాయిని రవాణాచేస్తుండడం, ఎక్కడా మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పట్టుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. నల్లరాయిని రవాణా చేసే వాహనాలతో కేబీ రోడ్డు నిత్యం రద్దీగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్, అనకాపల్లి తహసీల్దారు పేర్లతో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డుల సాక్షిగా నల్లరాయిని అక్రమంగా తరలించుకుపోతున్నారు. కాగా వేటజంగాలపాలెం క్వారీల నుంచి ఈసీ లేకుండా నల్ల రాయి తవ్వకాలు, రవాణా గురించి మైన్స్ ఏడీ శ్రీనివాసరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. అన్ని క్వారీలకు అనుమతులు ఉన్నాయని అన్నారు. ఎన్ని క్వారీలకు ఈసీలు ఉన్నాయని అడగ్గా.. ఇప్పటికిప్పుడు చెప్పలేనని, ఫిర్యాదు ఇస్తే అప్పుడు పరిశీలిస్తానని చెప్పారు.