Share News

రైళ్లకు పెరిగిన తాకిడి

ABN , Publish Date - Jan 11 , 2025 | 01:10 AM

సంక్రాంతి ప్రయాణాలు శుక్రవారం మొదలయ్యాయి.

రైళ్లకు పెరిగిన తాకిడి

  • సంక్రాంతి ప్రయాణాలు షురూ

  • కిక్కిరిసిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌

  • రద్దీగా సికింద్రాబాద్‌, చెన్నై, భువనేశ్వర్‌, హౌరా, బెంగుళూరు, ఎర్నాకులం రైళ్లు

విశాఖపట్నం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి ప్రయాణాలు శుక్రవారం మొదలయ్యాయి. విద్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా సొంత ఊళ్లకు బయలుదేరిన వారితో రైల్వే స్టేషన్‌ కిటకిటలాడింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717) కిక్కిరిసింది. రత్నాచల్‌ కోసం గంట ముందుగానే ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవడంతో ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫారం జాతర వాతావరణం కనిపించింది. రైలు ప్లాట్‌ఫారం పైకి చేరిన వెంటనే ప్రయాణికులు ఒకేసారి బోగీల్లో ఎక్కేందుకు యత్నించడంతో కొద్దిపాటి తొక్కిసలాట జరిగింది. దీంతో పిల్లాపాపలతో ఉన్నవారు ఇబ్బందిపడ్డారు.ఈ నేపథ్యంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రయాణికులు క్రమపద్ధతిలో కోచ్‌లోకి ప్రవేశించే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. రత్నాచల్‌తో పాటు సికింద్రాబాద్‌ వైపు వెళ్లే గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్‌, నాందేడ్‌, కాచీగూడ, ఫలక్‌నుమా, కోణార్క్‌, ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లు, హౌరా వెళ్లే ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, మెయిల్‌, ఫలక్‌నుమా, కోరమండల్‌, యశ్వంత్‌పూర్‌ వంటి రెగ్యులర్‌ (ప్రతిరోజు) రైళ్లు, చెన్నై వెళ్లే మెయిల్‌, బొకారో, బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌, హౌరా-యశ్వంతపూర్‌ వంటివి కిటకిటలాడాయి.

కిక్కిరిసిన బొకారో ఎక్స్‌ప్రెస్‌

సంక్రాంతి ప్రయాణికులతోపాటు శబరిమలై భక్తుల తాకిడి కూడా తోడవడంతో బొకారో ఎక్స్‌ప్రెస్‌ (13351) అత్యంత రద్దీగా కనిపించింది. ఈ రైల్లో రిజర్వేషన్‌ కోచ్‌లు సాధారణ బోగీలను తలపించాయి. ఏసీ కోచ్‌లలోనూ దాదాపు అదే పరిస్థితి ఏర్పడింది. నిరీక్షణ జాబితా టికెట్లు పొంది ప్రయాణ సమయానికి బెర్తు ఖరారు కాని వారు జరిమానా చెల్లించేందుకు సిద్ధం కావడంతో ఏసీ కోచ్‌లలోనూ పరిమితికి మించి ప్రయాణించారు.

కిటకిట లాడిన ద్వారకా కాంప్లెక్సు

174 ప్రత్యేక బస్సులు నడిపిన అధికారులు

నేడు, రేపు కూడా రద్దీ కొనసాగుతుందని అంచనా

ద్వారకా బస్‌స్టేషన్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి ప్రయాణికులతో ఆర్టీసీ ద్వారకా కాంప్లెక్స్‌ శుక్రవారం కిటకిటలాడింది. వివిధ రవాణా సాధనాల ద్వారా విశాఖ వచ్చినవారు, చుట్టుపక్కల గల తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ద్వారకా కాంప్లెక్సుకు చేరుకున్నారు. టిక్కెట్లు జారీచేసే కౌంటర్ల వద్ద బారులు తీరారు. ప్రయాణికుల రద్దీని గుర్తించిన అధికారులు అదనంగా మూడు కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ శ్రీకాకుళం, విజయనగరం నాన్‌స్టాప్‌ సర్వీసుల కౌంటర్లు ఎక్కువ రద్దీగా ఉన్నాయి.

174 ప్రత్యేక సర్వీసులు

ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ విశాఖ రీజియన్‌ అధికారులు శుక్రవారం 174 ప్రత్యేక సర్వీస్‌లు నడిపారు. దూర ప్రాంతాలైన హైదరాబాద్‌ 22, విజయవాడ 35, రాజమండ్రి 21, కాకినాడ 19, అమలాపురం 2, భీమవరానికి 2 ప్రత్యేక సర్వీసులు నడిపారు. అలాగే జోన్‌ పరిధిలోని పార్వతీపురం 10, రాజాం 5, పాలకొండ 5, శ్రీకాకుళం 20, ఇచ్ఛాపురం 10, టెక్కలి 8, పాతపట్నం 2, సోంపేట 7, మందస 2, నరసన్నపేట 4 చొప్పున ప్రత్యేక సర్వీసులు ఆపరేట్‌ చేశారు. శని, ఆదివారాల్లో మరింత రద్దీ ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు బస్సులు సమకూర్చుకుంటున్నట్టు రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్‌ ఉంటే రాత్రి కూడా బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. .

Updated Date - Jan 11 , 2025 | 01:10 AM