పారిశ్రామిక విప్లవం
ABN , Publish Date - Jan 10 , 2025 | 01:18 AM
అనకాపల్లి జిల్లా పరిశ్రల హబ్‌గా మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తున్నది. ఇంధన, ఉక్కు, ఔషధ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేయాడానికి ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నాయి.
జిల్లాకు ఇంధన, ఫార్మా, ఉక్కు రంగాల్లో పలు పరిశ్రమలు
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు
వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
పూడిమడక వద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్
ప్రభుత్వ రంగంలో మొట్టమొదటి హరిత ఇంధన ప్రాజెక్టు
రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులు
రోజూ 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 7,500 టన్నుల ఇతర హరిత ఉత్పత్తులు
ఏటా 2.5 మిలియన్ టన్నుల గ్రీన్ కెమికల్స్ తయారీ
57 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్
2 వేల ఎకరాల్లో రూ.1,876 కోట్లతో మౌలిక సదుపాయాలు
రూ.14 వేల కోట్ల పెట్టుబడులతో ఫార్మా కంపెనీలు
30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
అచ్యుతాపురం/ నక్కపల్లి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లా పరిశ్రల హబ్‌గా మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తున్నది. ఇంధన, ఉక్కు, ఔషధ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేయాడానికి ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నాయి. అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద రూ.1.85 లక్షల కోట్లతో ఏర్పాటు చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు, నక్కపల్లి మండలంలో సుమారు 16 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు కానన్ను బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఐదారేళ్ల కాలంలో నిర్మాణం పూర్తయ్యే ఈ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 90 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక నక్కపల్లి మండలంలో ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా కలిసి జాయింట్ వెంచర్ ప్రాజెక్టు కింద రూ.1,47,162 కోట్ల భారీ పెట్టుబడితో తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పచ్చజెండా ఊపింది. రెండు దశల్లో నిర్మించే ఈ ప్రాజెక్టులో 60 వేల మందికి ఉపాధి లభిస్తుంది. 2029 జనవరి నాటికి మొదటి దశ, 2033కల్లా రెండో దశ పూర్తి చేయాలన్నది లక్ష్యం.
గ్రీన్ హైడ్రోజన్ హబ్‌తో హరిత ఇంధన విప్లవం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద సుమారు పదేళ్ల క్రితం థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం ఎన్‌టీపీసీ సేకరించిన భూమిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మించనున్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఇది ముఖ్యమైన మైలురాయి కానున్నది. ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్- న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) కలిసి దీనిని ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగం (నేషనల్ గ్రీన్ హైడ్రో మిషన్)లో ఇది మొట్టమొదటి హరిత ఇంధన ప్రాజెక్టు. మొత్తం 1,600 ఎకరాల్లో రూ.1.85 లక్షల కోట్లతో రెండు దశల్లో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను నిర్మిస్తారు. ఇందులో 300 ఎకరాల్లో 25 పారిశ్రామిక మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు (అనుబంధ), మరో 300 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, రోడ్లు, పారిశ్రామిక కేంద్రాలు, విద్యుత్తు, నీరు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్, డీశాలినేషన్ ప్లాంట్, ఓడరేవు తదితర వాటిని ఏర్పాటు చేశారు. ఈ పనులన్నీ వచ్చే ఏడాది డిసెంబరునాటికి పూర్తిచేస్తారు. రోజూ ఎనిమిది కోట్ల లీటర్ల సముద్ర జలాలను (రెండు కిలోమీట్లర దూరంలో వున్న బంగాళాఖాతం నుంచి) డీశాలినేషన్ చేసి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. రోజుకు 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌తోపాటు 7,500 టన్నుల గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ యూరియా, గ్రీన్ మెథనాల్, సస్టెయినబుల్ ఏవియేషన్ ఇంధనం ఉత్పత్తి అవుతాయి. ఏటా 2.5 మిలియన్ టన్నుల గ్రీన్ కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. పలు దేశాలకు ఇక్కడి నుంచి హైడ్రోజన్‌ను ఎగుమతి చేస్తారు. గ్రీన్ హైడ్రోజన్‌ను పరిశ్రమలు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో వినియోగించడం ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే ఏటా 20 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్, 2.5 మిలియన్ టన్నుల గ్రీన్ కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మాణం పూర్తయితే (2032 నాటికి) ప్రత్యక్షంగా, పరోక్షంగా 57 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఔషధ రంగంలో కొత్త శకం
విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగమైన నక్కపల్లి క్లస్టర్‌లో ఏపీఐఐసీ గతంలో వేంపాడు, బుచ్చిరాజుపేట, రాజయ్యపేట, చందనాడ, డీఎల్‌పురం గ్రామాల్లో సేకరించిన సుమారు రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానున్నది. ‘ఆంధ్రప్రదేశ బల్క్ డ్రగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్’ రూ.1,876 కోట్లతో అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తుంది. కామన్ ఎఫ్ల్యూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఆవిరితో విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం, సాల్వెంట్ రికవరీ సిస్టమ్స్, ఎనలిటికల్ టెస్టింగ్ ల్యాబ్‌లు, గోదాములు, లాజిస్టిక్స్, విద్యుత్తు, నీరు, డ్రైనేజీలు, రోడ్లు, తదితర పనులు వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేయాలని లక్ష్యం. దేశ, విదేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు ఇక్కడ దాదాపు 14 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ఫార్మా కంపెనీల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఔషధాలను తయారు చేస్తారు. ప్రస్తుతం మన దేశంలో వున్న ఫార్మా కంపెనీల్లో కొన్ని రకాల ఔషధాలను, మందులను తయారు చేయడానికి అవసరమైన ముడిసరకును దిగుమతి చేసుకుంటున్నాయి. నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న బల్ డ్రగ్ పార్క్‌లో వీటిని ఉత్పత్తి చేసుకుంటే విదేశీమారక ద్రవ్యం ఆదా కావడంతోపాటు ఆయా ఔషధాల ధరలు ప్రజలకు అందుబాటులో వుంటాయి. బల్ డ్రగ్ పార్క్‌లో ఏర్పాటయ్యే ఫార్మా కంపెల్లో సుమారు 30 వేల మంది ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి.