Share News

ప్రధాన పర్యటనను విజయవంతం చేద్దాం

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:51 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధికారులను ఆదేశించారు.

ప్రధాన పర్యటనను విజయవంతం చేద్దాం

  • అధికారులు సమన్వయంతో పనిచేయాలి

  • రవాణా, భోజనం, ఇతర ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

  • మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశం

అనకాపల్లి కలెక్టరేట్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ, విశాఖ బహిరంగ సభకు జిల్లా నుంచి ప్రజలను తరలించేందుకు ఏర్పాటు చేసే ఆర్టీసీ బస్సుల పర్యవేక్షణకు కంట్రోల్‌రూం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. ఆహారం, తాగునీరు, రవాణా విషయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లాలో ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు, బల్‌డ్రగ్‌ పార్కుకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని, సుమారు రూ.90 వేల కోట్లతో ఏర్పాటయ్యే వీటిల్లో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, మండలాల నుంచి ప్రజలను తీసుకెళ్లే వాహనాలు ఏ రూట్‌లో విశాఖ వెళ్లాలి, అక్కడ ఏయే ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్‌ చేయాలో ముందుగానే రూటు మ్యాప్‌ తయారు చేసుకోవాలని చెప్పారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ మాట్లాడుతూ, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రధాన మోదీ పర్యటనను విజయవంతం చేయాలని చెప్పారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా నుంచి 840 బస్సులు ఏర్పాటు చేశామని, వీటిల్లో 42 వేల మంది ప్రధాని సభకు వెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి బస్సుకు ఇద్దరు సిబ్బందిని నియమించామని, గ్రామ, మండల, జిల్లాస్థాయిలో పర్యవేక్షణ బృందాలను నియమించామని తెలిపారు. బస్సులు ఉదయం బయలుదేరి మధ్యాహ్నానికి విశాఖ చేరతాయని, అల్పాహారాన్ని బస్సులోనే అందిస్తామని, విశాఖ చేరిన తరువాత బస్సు వద్దనే భోజనం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్‌కుమార్‌, పంచకర్ల రమేశ్‌బాబు, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 01:51 AM