ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
ABN , Publish Date - Jan 05 , 2025 | 01:40 AM
జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, తొమ్మిది హైస్కూల్ ప్లస్‌లలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, హైస్కూల్ ప్లస్‌లలో ప్రారంభం
జిల్లాలో 5,600 మందికి ప్రయోజనం
మహిళా కళాశాలలో పథకాన్ని ప్రారంభించి విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి
విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, తొమ్మిది హైస్కూల్ ప్లస్‌లలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుచేసింది. అయితే 2019లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో 5,600 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనున్నది.
నగరంలో వీఎస్ కృష్ణా జూనియర్, ఒకేషనల్ కళాశాలలు, మహిళా జూనియర్ కళాశాల ఉన్నా యి. ఇంకా మల్కాపురం, పెందుర్తి, అగనంపూడి, ఇస్లాంపేట, మధురవాడ, ఆనందపురం, భీమిలిల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అలాగే రాంపురం, గోపాలపట్నం, గాజువాక, గంగవరం, రెడ్డిపల్లి, హెచ్.వెంకటాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలు, వన్‌టౌన్‌లోని ఎంవీడీఎం, సీతమ్మధార నెహ్రూ మునిసిపల్ స్కూలు, మల్కాపురం జీవీఎంసీ ఉన్నత పాఠశాలల్లో హైస్కూల్ ప్లస్ ఉన్నాయి. జూనియర్ కళాశాలలు, హైస్కూల్ ప్లస్‌లలో కలిపి మొత్తం 5,600 మంది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరిలో తొలిరోజు 4,800 మంది భోజనం చేశారు. పది జూనియర్ కళాశాలలు, నాలుగు హైస్కూల్ ప్లస్‌లకు అక్షయపాత్ర భోజనం అందించగా, మరో ఐదు హైస్కూల్ ప్లస్‌లలో అక్కడ ఉన్నత పాఠశాలల్లో పిల్లలకు భోజనం వండే స్వయంశక్తి సంఘాలే సిద్ధం చేశాయి.
నగరంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, దక్షిణ నియోజకవర్గ ఎమ్యెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ భోజన పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన పోషకాహారం లభించేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. కాగా, అగనంపూడి జూనియర్ కళాశాలలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగరంలోని కృష్ణా జూనియర్ కళాశాలలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పథకాన్ని ప్రారంభించారు. మిగిలినచోట్ల స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఇంటర్ విద్యాశాఖ అధికారులు పథకం ప్రారంభించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. జిల్లాలోని అన్ని కళాశాలలు, హైస్కూల్ ప్లస్‌లలో భోజనం పథకం ప్రారంభమైందని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి బి.రాధ, డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు.