పుడమిపై హరివిల్లు
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:17 AM
సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఏటా మాదిరిగానే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది.
‘ఆంధ్రజ్యోతి - ఏబీఎన్’ ముగ్గుల పోటీలకు విశేష స్పందన
ఉత్సాహంగా పాల్గొన్న 135 మంది మహిళలు
కుటుంబసభ్యులతో సహా హాజరైన అతివలు
శ్రీప్రకాష్ ప్రాంగణానికి సంక్రాంతి శోభ
ముగ్గురు విజేతలకు నగదు బహుమతులు
మరో ముగ్గురికి కన్సొలేషన్, పాల్గొన్న వారందరికీ ప్రత్యేక బహుమతుల ప్రదానం
విశాఖపట్నం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఏటా మాదిరిగానే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ’ఆంధ్రజ్యోతి, ఏబీఎన్’ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్ వారి పర్‌ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా(ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్)’కు సీతమ్మధారలోని శ్రీప్రకాష్ విద్యానికేతన్ ప్రాంగణం వేదికగా నిలిచింది. ఈ పోటీలకు నగర పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 135 మంది మహిళలు హాజరై తమలో దాగి ఉన్న సృజనాత్మకతను ముగ్గుల రూపంలో ప్రదర్శించారు. ఉదయం నుంచే మహిళలు కుటుంబసభ్యులతో సహా హాజరై సందడి చేశారు. ముందే సంక్రాంతి వచ్చిందా అన్నట్టుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీలు సాగాయి. సంక్రాంతి పండగను ప్రతిబింబించేలా రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ వాతావరణానికి ప్రతీకగా నిలిచాయి.
ఉత్సాహంగా పోటీలు
ముగ్గుల పోటీకి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలందరికీ నిర్వాహకులు అవకాశం కల్పించారు. రంగవల్లులతో పాఠశాల ప్రాంగణం సరికొత్త కళను సంతరించుకుంది. సంక్రాంతి థీమ్‌తో ముగ్గులు తీర్చిదిద్దారు. పచ్చని తోరణాలు, పాడి పశువుల సందడి, పూర్ణ కుంభం, పాలు పొంగే సిరులు, నవధాన్యాలు, పిండి వంటలు, చెరకు గడలు, డూడూ బసవన్నలు, హరిదాసు కీర్తనలు స్ఫురించేలా రంగవల్లులను తీర్చిదిద్దారు.
ముగ్గురు విజేతలకు బహుమతులు
ముగ్గుల పోటీలకు ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా ప్రొగ్రామ్ ఆఫీసర్ ఈపీఎస్ భాగ్యలక్ష్మి, ఏఎస్ రాజా కళాశాల డైరెక్టర్ లారెన్స్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వీరిద్దరూ ఒకటికి రెండుసార్లు ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. టాప్‌లో నిలిచిన ముగ్గురు విజేతలతో పాటు మంచి ముగ్గులు వేసిన మరో ముగ్గురిని కొన్సొలేషన్ బహమతులకు ఎంపిక చేశారు. ఆరిలోవకు చెందిన ఎ.సంతోషి ప్రథమ స్థానంలో నిలిచింది. డైరీ ఫామ్ ప్రాంతానికి చెందిన వి.లక్ష్మీ మూర్తి ద్వితీయస్థానం, పెదవాల్తేరుకి చెందిన ఆర్.ప్రవీణ తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి వరుసగా రూ.6 వేలు, రూ.4 వేలు, రూ.3 వేల చొప్పున నగదు బహమతులను అందించారు. లక్ష్మీదేవి, ఆర్.స్వాతి, కె.నాగమణిలకు కన్సొలేషన్ బహుమతుగా రూ.వెయ్యి చొప్పున ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ యాజమాన్యం అందించింది. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రత్యేక బహుమతులను ఇచ్చారు. పోటీల అనంతరం పలువురు యువతులు, చిన్నారులు నృత్యాలతో సందడి చేశారు. పోటీలకు హాజరవడంతో ఒత్తిళ్లు, ఇబ్బందులను మర్చిపోయి ఆనందంగా గడిపామని పలువురు మహిళలు పేర్కొన్నారు.