విశాఖకు నవోదయం
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:33 AM
విశాఖ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది.
సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
రాష్ట్ర చరిత్రలోనూ ఇదే ప్రథమం
గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారనున్న విశాఖ
ప్రధాని నరేంద్రమోదీ
బల్క్ డ్రగ్ పార్క్‌తో వస్తుత్పత్తి రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు
నీలి విప్లవంతో ప్రాభవాన్ని చాటనున్న నగరం
ఫిషింగ్ హార్బర్‌ను ఆధునికీకరిస్తున్నట్టు ప్రకటన
విశాఖను ఆర్థిక రాజధానిగా మరోసారి ఉద్ఘాటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
విశాఖపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):
విశాఖ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది. ఒకేరోజు రూ.2 లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ ఈ స్థాయి పెట్టుబడులకు సంబంధించిన కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించలేదు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ పాధాన్యం గుర్తించిన కేంద్రం భారీగా నిధులు మంజూరుచేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సభా వేదికపై ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ ప్రాధాన్యాన్ని మరోసారి గుర్తుచేశారు.
విద్యుత్ రంగంలో నూతన విప్లవానికి నాంది పలికిన హైడ్రోజన్ పవర్‌లో విశాఖపట్నం అత్యంత కీలకంగా మారబోతోందని ప్రధానమంత్రి ప్రకటించారు. 2030 నాటికి దేశంలో రెండు చోట్ల గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు ఏర్పాటు కానున్నాయని, వాటిలో ఒకటి విశాఖపట్నమన్నారు. భవిష్యత్తులో హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ ద్వారా ఏపీలో పెట్టుబడులు, తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని వివరించారు. నక్కపల్లిలో బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటుతో మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. దేశంలో మూడు చోట్ల బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటుచేయనుండగా అందులో ఒకటి నక్కపల్లిలో వస్తోందన్నారు.
దశ మార్చనున్న నీలి విప్లవం
సముద్ర వ్యాపారంలో శతాబ్దాల చరిత్ర గల విశాఖపట్నం నీలి విప్లవంతో మరోసారి తన ప్రాభవాన్ని చాటనుందని, ఇందులో భాగంగా విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌ను ఆధునికీకరిస్తున్నామని ప్రధాని వివరించారు. దశాబ్దాలుగా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కోసం పోరాడిన ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశామని, తద్వారా ఏళ్ల నాటి కలను సాకారం చేశామన్నారు. కాగా, విశాఖను ఆర్థిక రాజధానిగా మరింత బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ప్రపంచానికి అరకు కాఫీని పరిచయం చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో ఐటీ, ఫార్మా, టూరిజం అభివృద్ధి చెందుతాయని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమవుతుందని చంద్రబాబు వివరించారు.
ఎట్టకేలకు రైల్వే జోన్ కల సాకారం
ప్రధాన కార్యాలయానికి నరేంద్రమోదీ శంకుస్థాపన
వాల్తేరు డివిజన్ కొనసాగింపుపై సందిగ్ధం
విశాఖపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగానే విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు బుధవారం శంకుస్థాపన జరిగింది. ముడసర్లోవలో జీవీఎంసీ ఇచ్చిన 52 ఎకరాల్లో జోనల్ కార్యాలయం నిర్మాణం కానుంది. ఇది శుభ పరిణామం. అయితే ఇందులో స్పష్టత లేని అనేక అంశాలు ఉన్నాయి. విశాఖ జోన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు రైల్వే బోర్డు ఇంకా ఆమోదం తెలపలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న భవన నమూనాలు డీఆర్‌ఎం కార్యాలయం వెనుక వైర్‌లెస్ కాలనీలో గల 12 ఎకరాల్లో జోనల్ కార్యాలయం నిర్మించాలనుకున్నప్పుడు తయారు చేసినవి. అప్పటికన్నా ఇప్పుడు అదనంగా 40 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. అంటే డిజైన్లు మార్చాల్సి ఉంది.
వాల్తేరు డివిజన్ ఉంటుందా? లేదా?
కొత్తగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా జోన్‌లో వాల్తేరు డివిజన్ ఉండదని మొదట్లో రైల్వే వర్గాలు ప్రకటించాయి. దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతోనే జోన్ ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి, అందులో కీలక ప్రాంతాలను కొత్తగా ఏర్పాటుచేసిన రాయగడ డివిజన్‌లో కలిపి, మిగిలిన ప్రాంతాలను విజయవాడ డివిజన్‌లో ఉంచుతారని ప్రకటించారు. అయితే వాల్తేరు డివిజన్‌తో కూడిన జోన్ ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు నాయకులు కేంద్రాన్ని కోరారు. దానికి సానుకూల స్పందన వచ్చిందని ప్రచారం చేశారు. అయితే బుధవారం ప్రధాని సభలో వాల్తేరు డివిజన్‌పై స్పష్టత ఇవ్వలేదు. పైగా దీనికి రెండు రోజుల ముందే రాయగడ డివిజన్ పరిధిని ప్రకటించారు. దానికి డివిజన్ రైల్వే మేనేజర్‌ను కూడా నియమించారు. అంతకు ముందు డీఆర్‌ఎం కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం కూడా చుట్టారు. ఇక్కడ జోనల్ కార్యాలయం నిర్మించాక కార్యకలాపాలు ప్రారంభిస్తామంటే మరో పుష్కరకాలం గడిచిపోతుంది. అలా కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాల్లో జోనల్ కార్యాలయాలు ప్రారంభించాల్సి ఉంది. వీటిని పర్యవేక్షించడానికి జోన్‌కు జనరల్ మేనేజర్‌ను తక్షణమే నియమించాలి. అప్పుడే కేంద్రానికి చిత్తశుద్ధి ఉందని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసిస్తారు.
కొత్త రైళ్లు...ప్రాజెక్టులు
విశాఖలో జోనల్ కార్యాలయం ప్రారంభమైతే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రాంత యువతకు అవకాశాలు పెరుగుతాయి. కొత్త రైళ్లను వేసుకోవాలన్నా, అత్యవసరంగా అదనపు కోచ్‌లు ఏర్పాటు చేయాలన్నా, సరకు రవాణాకు ర్యాక్‌లు ఇవ్వాలన్నా స్థానిక అధికారులు నిర్ణయం తీసుకోవచ్చు. తయారీ, ఉత్పత్తి రంగాలకు చెందిన ప్రాజెక్టులు వస్తాయి. జోనల్ స్థాయి రైల్వే ఆస్పత్రి వస్తుంది. సుదీర్ఘమైన తీర ప్రాంతం, పోర్టులు, విమానాశ్రయాలు ఉండటం, కొత్త పరిశ్రమలు రావడం వల్ల ఈ జోన్‌కు ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే బడ్జెట్‌లో కేటాయింపులు వస్తాయి. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రైల్వే వసతులు లభిస్తాయి.
రూ.2,08,548 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు
నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్...
పూర్తయిన పలు ప్రాజెక్టులు జాతికి అంకితం
విశాఖపట్నం, జనరి 8 (ఆంధ్రజ్యోతి):
ప్రధాని నరేంద్రమోదీ బుధవారం విశాఖపట్నంలో రూ.2,08,548 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజావేదిక బహిరంగ వేదికపైనే ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే పూర్తయిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు
- అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్
- విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం
- గంగవరం పోర్టు-స్టీల్‌ప్లాంటు మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణం
- దువ్వాడ-సింహాచలం (ఉత్తర) మధ్య మూడు, నాలుగు రైల్వే లైన్ల నిర్మాణం
- విశాఖ-గోపాలపట్నం మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణం
- గుత్తి-పెండేకల్లు మధ్య రైల్వే లైన్ డబ్లింగ్.
- మహబూబ్‌నగర్-డోన్ మధ్య రైల్వే లైన్ విద్యుద్దీకరణ
- ఎన్‌హెచ్-167కి ఆదోని వద్ద బైపాస్ నిర్మాణం
- డోర్నాల నుంచి కుంట జంక్షన్ వరకు ఎన్‌హెచ్-765 రెండో లేన్ నిర్మాణం
- సంగమేశ్వరం నుంచి నల్లకాలువ సెక్షన్ వరకు ఎన్‌హెచ్-167 రెండో లేన్ విస్తరణ
- ఎన్‌హెచ్ 67 నుంచి తాడిపర్తికి నాలుగో లేన్ నిర్మాణం
- ఎన్‌హెచ్-167బి లో మైదుకూరు నుంచి ముదిరెడ్డిపల్లి వరకు రెండో లేన్ నిర్మాణం
- ఎన్‌హెచ్-440లో వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు రెండు, నాలుగో లేన్ల విస్తరణ
- ఎన్‌హెచ్-565లో దావులపల్లి నుంచి మల్లెపాలెం వరకు రెండో లేన్ నిర్మాణం
- ఎన్‌హెచ్-365బీబీలో బుట్టాయగూడెం నుంచి పట్టిసీమ వరకు రెండో లేన్ విస్తరణ
- ఎన్‌హెచ్-167 ఏజీలో కొండమోడు నుంచి పేరేచర్ల సెక్షన్ వరకు నాలుగో లేన్ విస్తరణ
- ఎన్‌హెచ్-516ఈ పాడేరుకు బైపాస్ రహదారి నిర్మాణం
- అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధి
- కృష్ణపట్నం ఇండస్ర్టియల్ ఏరియాలో క్రిస్ సిటీ నిర్మాణం
జాతికి అంకితం చేసినవి
గుర్తి-ధర్మవరం రైల్వే లైన్ డబ్లింగ్, విజయవాడ-గుడివాడ-భీమవరం-నర్సాపూర్, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు రైలు మార్గాల విద్యుద్దీకరణ, ఇంకా మరో ఎనిమిది ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.