అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసుపై వివాదం
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:26 AM
జీవీఎంసీలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వయోపరిమితిపై వివాదం నెలకొంది. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచారు. అదే జీవీఎంసీలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అనధికారికంగా అమలు చేస్తూ వస్తున్నారు.
60 ఏళ్లు నిండిన 400 మంది
పారిశుధ్య కార్మికులకు జీవీఎంసీ నోటీసులు
ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా 62 ఏళ్లు వర్తింపజేయాలని కార్మిక సంఘాల డిమాండ్
నిబంధనలు అంగీకరించవంటున్న అధికారులు
ఆందోళనకు సంఘాల సమాయత్తం
విశాఖపట్నం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వయోపరిమితిపై వివాదం నెలకొంది. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచారు. అదే జీవీఎంసీలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అనధికారికంగా అమలు చేస్తూ వస్తున్నారు. ప్రజారోగ్య విభాగంలో సుమారు ఆరు వేల మంది, నీటి సరఫరా, యూజీడీ ఇతర విభాగాల్లో మరో రెండు వేల మంది వరకూ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ప్రజారోగ్య విభాగంలో 60 ఏళ్లు దాటిన 400 మంది కార్మికులకు ఉద్యోగ విరమణ చేయాలంటూ జీవీఎంసీ అధికారులు ఇటీవల నోటీసులు జారీచేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్ల పరిమితి ఉండడంతో వారికి కూడా అదే నిబంధన వర్తిస్తుందని, హఠాత్తుగా 60 ఏళ్లు దాటినందున ఉద్యోగ విరమణ చేయాలని నోటీసులు ఇవ్వడం ఏమిటని కార్మిక సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ అంశంపై జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్‌ను కలిశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధన ప్రకారం అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లు మాత్రమేనని, తాను రెండేళ్లు పెంచి 60 ఏళ్లు వరకూ పనిచేసే అవకాశం కల్పించానని కమిషనర్ వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించి ప్రభుత్వం గతంలో జారీచేసిన ఉత్తర్వులను యూనియన్ నేతలకు చూపించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 62 ఏళ్లు పరిమితి వర్తింపజేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. అయినప్పటికీ తానేమీ చేయలేనని కమిషనర్ చెప్పడంతో, ఆందోళనకు దిగాలని నిర్ణయించామని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. అరవై ఏళ్లు నిండినవారిని ఉద్యోగం నుంచి తొలగిస్తే కనీసం వారి వారసులకు అవకాశం కల్పించాలని కోరినా అధికారులు పట్టించుకోకుండా కొత్తవారిని నియమించేందుకు నోటిఫికేషన్ జారీచేయాలని చూస్తున్నారని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు.