మినుము పంటపై తెగుళ్ల దాడి
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:14 AM
పూత దశలో వున్న మినుము పంటలను పలు రకాల తెగుళ్లు సోకవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు రంగు మొజాయిక్ తెగులు మందులు పిచికారీ చేసినా తగ్గడం లేదని వాపోతున్నారు.
ఎల్లో మొజాయిక్‌తో పసుపు రంగులోకి ఆకులు
పొగాకు లద్దె పురుగుతో ఎండిపోతున్న పంట
ఆందోళన చెందుతున్న రైతులు
నివారణ చర్యలు సూచిస్తున్న కేవీకే శాస్త్రవేత్త రాజ్‌కుమార్
రావికమతం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పూత దశలో వున్న మినుము పంటలను పలు రకాల తెగుళ్లు సోకవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు రంగు మొజాయిక్ తెగులు మందులు పిచికారీ చేసినా తగ్గడం లేదని వాపోతున్నారు. మండలంలో ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేసిన పొలాల్లో రైతులు.. పంట కోత అనంతరం రబీలో మినుము, పెసర, బొబ్బర వంటి పప్పుదినుసుల పంటలను వేశారు. కొమిర,మత్స్యపురం, చినపాచిల, కేబీపీ అగ్రహారం, బుడ్డిబంద, కవ్వగుంట, గర్నికం, మేడివాడ, మట్టవానిపాలె, గొల్లలపాలెం తదితర గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో మినుము వేశారు. ప్రస్తుతం అన్నిచోట్లా మినుము మొక్కలు పూత దశకు చేరుకున్నాయి. అయితే వాతావరణంలో మార్పులతోపాటు భూమిలో కొన్నిరకాల పోషకాలు లోపించడంతో పలు రకాల తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా పల్లాకు తెగులు (ఎల్లో మొజాయిక్), బూడిద రంగు తెగులు, పొగాకు లద్దె పురుగు ఆశించాయి. ఎల్లో మొజాయిక్ తెగులు ఆశించిన పొలాల్లో మినుము ఆకులు గిడసబారి పసుపు రంగులోకి మారితున్నాయి. ఒక మొక్కకు సోకిన తెగులు రోజుల వ్యవధిలోనే పొలం మొత్తం విస్తరిస్తున్నది. మందు పిచికారీ చేసినా ఉపయోగం ఉండడం లేదని రైతులు చెబుతున్నారు. ఇక బూడిద తెగులు ఆశించిన పొలాల్లో మినప మొక్కపై తెల్లటి మచ్చలు ఏర్పడి, ఎండిపోతున్నాయి. ఈ తెగుళ్ల కారణంగా పూత రాలిపోతున్నదని ఆందోళన చెందుతున్నారు. కాగా మినుము పంటను సోకిన తెగుళ్ల నివారణ గురించి కోమళ్లపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్‌కుమార్‌ను సంప్రదించగా.. విత్తన శుద్ధి చేయకపోవడం వల్ల తెగుళ్లు ఆశిస్తున్నట్టు చెప్పారు. పొగాకు లద్దెపురుగు ఆశించిన, పల్లాకు తెగులు సోకిన మొక్కలను పీకివేసి, దూరంగా తీసుకెళ్లి దహనం చేయాలని సూచించారు. అనంతరం పొగాకు లద్దె పురుగు నివారణకు క్లోరీఫైరిపాస్ లేదా మోనోక్రోటోపాస్ మందును లీటరు నీటికి 1.6 ఎం.ఎల్. చొప్పున కలిపి ఆకులన్నీ తడిసేలా పిచికారీ చేయాలన్నారు. అలాగే ఐదు కిలోల తవుడులో అర కిలో బెల్లం, అర లీటర్ మోనోక్రోటోపాస్ మందు కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి తెగులు ఉన్న ప్రదేశాల్లో వేయాలని, పొగాకు లద్దె పురుగులు వీటిని తిని చనిపోతాయన్నారు. పల్లాకు తెగులు తెల్లదోమ వల్ల వస్తుందని,పొలంలో ముందుగా ఈ మొక్కలు పీకివేసి అనంతరం థయోమితోయేట్ మందు లీటర్ నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు.