Share News

నగరంలో మళ్లీ కాలుష్యం

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:38 AM

కణాల శాతం సగటు కంటే రెండు నుంచి

నగరంలో మళ్లీ కాలుష్యం

పది రోజులుగా పెరుగుతున్న ధూళి కణాలు

సగటు కంటే రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ

పీఎం 10, పీఎం 2.5 అధికంగా నమోదు

పూర్‌ కేటగిరీలో విశాఖపట్నం

విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):

నగరంలో మళ్లీ కాలుష్యం పెరుగుతోంది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఆదివారం వరకు గాలిలో ధూళి కణాల శాతం సగటు కంటే రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా నమోదవడం ప్రమాద తీవ్రతను తెలుపుతోంది. ముఖ్యంగా ఊపరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే పీఎం 10, పీఎం 2.5 ఎక్కువగా నమోదవడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయం భవనంపై ఉన్న ఆన్‌లైన్‌ యాంబియంట్‌ ఎయిర్‌క్వాలిటీ మిషన్‌లో ఆదివారం సగటున పీఎం 2.5 అయితే 203 (ఏడాది సగటు 40) నమోదైంది. గరిష్ఠంగా 287, కనిష్ఠంగా 102 నమోదైంది. 24 గంటలపాటు నమోదైన వివరాల సగటు మేరకు పీఎం 2.5 అయితే 203గా రికార్డు కావడంతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రామాణికాల మేరకు పూర్‌ కేటగిరీగా నమోదైంది. యాంబియంట్‌ ఎయిర్‌క్వాలిటీ 50 కంటే తక్కువగా ఉంటే గుడ్‌, 51 నుంచి 100 వరకు సంతృప్తికరమని, 101 నుంచి 200 వరకు మోడరేట్‌, 201 నుంచి 300 వరకు పూర్‌, 301 నుంచి 400 వరకు నమోదైతే వెరీ పూర్‌ అని పరిగణిస్తారు. ఈనెలలో మూడు, నాలుగు, తొమ్మిది తేదీలలో పీఎం 2.5 యాంబియంట్‌ ఎయిర్‌క్వాలిటీ పూర్‌’ కేటగిరీలో ఉంది.

నగరంలో డిసెంబరు, జనవరిలో కాలుష్యం ప్రభావం ఎక్కువ. గాలుల వేగం తక్కువ, నగరం బౌల్‌ ఏరియాలో ఉండడం, పోర్టుతోపాటు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం బయటకు వెళ్లకపోవడంతో మంచు కురవడంతో ధూళి కాలుష్యం నగరంపై సెటిల్‌ అవుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గాలిలో ధూళి కణాల ప్రభావం పెరగడంతో పీఎం 2.5, పీఎం 10 పరిమితికి మించి నమోదవుతుందన్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. పీఎం 2.5 అంటే కంటికి కనిపించని అత్యంత సూక్ష్మ ధూళి కణాలు. గాలి పీల్చుకున్నప్పుడు శరీరంలోనికి వెళ్లి ఊపిరితిత్తుల్లో సెటిల్‌ అవుతుంది. పీఎం 10 ధూళి కణాల పరిమాణం కొంచెం ఎక్కువ కనుక గాలి పీల్చినపుడు ముక్కుద్వారా వెళ్తే తుమ్ముల ద్వారా బయటకు వచ్చేస్తాయి. పోర్టు, పరిసరాల్లో పరిశ్రమల నుంచి వచ్చే ధూళి, భవన నిర్మాణాలు, వాహన కాలుష్యం ప్రమాదకరంగా ఉంది. నగరంలో 12 లక్షలకుపైగా ఉన్న వాహనాలలో కొంతవరకు కాలంచెల్లినవి. వీటినుంచి నల్లని పొగ రావడం కాలుష్యానికి కారణంగా పేర్కొంటున్నారు. భవన నిర్మాణ సమయంలో ధూళి కణాలు రాకుండా ప్రమాణాలు పాటించడంలేదు. చుట్టూ టార్పాలిన్ల ఏర్పాటు, నీటిని పిచిరారీ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. రాత్రి కురిసే మంచు పగటి పూట ఎండకు పొడిగా మారి గాలుల ద్వారా నగరంలో అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Jan 13 , 2025 | 12:38 AM