ప్రధాని సభకు జన సమీకరణపై కసరత్తు
ABN , Publish Date - Jan 05 , 2025 | 01:49 AM
ఈనెల ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్రమోదీ నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పలువురు ఐఏఎస్ అధికారులను ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించారు.
ఏయూలో సభకు 1,40,000 మంది, రోడ్‌షోకు 60 వేల నుంచి 70 వేల మంది...
జనం తరలింపునకు 2,000 బస్సులు
ఏర్పాట్ల పర్యవేక్షణకు పొరుగు జిల్లాల నుంచి ఐఏఎస్ అధికారులు
మరో 10 మంది డిప్యూటీ కలెక్టర్లు, 20 మంది తహసీల్దార్లు
అన్ని శాఖల అధికారులతో 42 కమిటీలు ఏర్పాటు
విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):
ఈనెల ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్రమోదీ నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పలువురు ఐఏఎస్ అధికారులను ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్, వీఎంఆర్‌డీఎ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్‌తోపాటు ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ, పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్, సబ్‌కలెక్టర్ శౌర్యమన్ పటేల్, పాలకొండ సబ్ కలెక్టర్ యశ్వంతకుమార్‌రెడ్డిలకు ప్రధాని పర్యటనకు సంబంధించి పలు బాధ్యతలు అప్పగించారు. వీరు కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరో పది మంది డిప్యూటీ కలెక్టర్లు, 20 మంది తహసీల్దార్లు, ఇంకా రవాణ, పౌర సరఫరాలు, రోడ్లు, భవనాల శాఖల నుంచి అధికారులను నియమించారు. జన సమీకరణ, బహిరంగ సభ, వేదిక, గ్యాలరీల ఏర్పాటు, ఇతర పనుల పర్యవేక్షణ నిమిత్తం మొత్తం 42 కమిటీలు వేశారు. ప్రతి కమిటీకి జిల్లా అధికారి ఒకరు నేతృత్వం వహిస్తారు.
రెండు లక్షల మంది జనాల సమీకరణ లక్ష్యం
ప్రధాని సభకు రెండు లక్షల మందిని సమీకరించాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అనకాపల్లి జిల్లా నుంచి 40 వేలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పది వేల నుంచి 20 వేలు, నగరానికి ఆనుకుని ఉన్న నాలుగు గ్రామీణ మండలాల నుంచి 10 వేలు, మరో 1.2 లక్షల మందిని నగరం నుంచి తరలించాలని యోచిస్తోంది. సభా వేదిక ముందు రెండు పెద్ద హాళ్లు నిర్మిస్తున్నారు. ఒక దాంట్లో 60 వేలు, మరో దాంట్లో 40 వేలు కుర్చీలు వేస్తున్నారు. ఇంకా రెండు హాళ్లలో కలిపి రెండు వేల మందికి సరిపడేలా 50 గ్యాలరీలు ఏర్పాటుచేస్తున్నారు. మిగిలిన వారు సభా ప్రాంగణం బయట ఉంటారు. వీరంతా ప్రధాని, ఇతర ప్రముఖల ప్రసంగాలు వినేందుకు ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుచేస్తున్నారు. వెంకటాద్రి వంటిల్లు నుంచి సభా వేదిక వరకు ప్రధాని రోడ్‌షోలో 60 నుంచి 70 వేల మంది పాల్గొనేలా జనాలను సమీకరిస్తున్నారు. సభ, రోడ్‌షోకు జనాలను తరలించడానికి ఆర్టీసీ, ప్రైవేటు యాజమాన్యాలకు చెందిన రెండు వేల బస్సులు తీసుకుంటున్నారు. జనాల తరలింపునకు మొత్తం 300 పాయింట్లు గుర్తించారు. బస్సులు ఇటు మద్దిలపాలెం, అటు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ జంక్షన్‌లో జనాలను దించేసి ఎంపిక చేసిన పార్కింగ్ ప్రదేశాలకు వెళతాయి. ప్రతి పార్కింగ్ కేంద్రానికి డిప్యూటీ కలెక్టర్/జిల్లా స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. సభ ముగిసిన తరువాత జనాలు మద్దిలపాలెం, త్రీటౌన్ జంక్షన్‌లకు వచ్చి బస్సుల్లో ఇళ్లకు వెళ్లేలా ముందుగానే వారికి సమాచారం ఇవ్వనున్నారు.
మధ్యాహ్నం పులిహోర, రాత్రికి వెజ్ బిర్యానీ
ప్రధాని సభకు హాజరయ్యే వారికి మధ్యాహ్నం పులిహోర, పెరుగు చట్నీ, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాక్‌తో కూడిన ప్యాకెట్ అందజేస్తారు. అలాగే రాత్రికి వెజ్ బిర్యానీ, పెరుగుచట్నీ, వాటర్ బాటిల్‌తో మరో ప్యాకెట్ ఇవ్వాలని నిర్ణయించారు. జనాలను పికప్ చేసుకునేందుకు 300 పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఇచ్చేందుకు 1.2 లక్షల ఆహార ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. సభ అనంతరం అనకాపల్లి జిల్లాకు చెందిన వారికి 40 వేల మందికి, విజయనగరం/శ్రీకాకుళం వెళ్లే 20 వేల మందికి, జిల్లాలో నాలుగు గ్రామీణ మండలాలకు చెందిన 10 వేల మందికి పంపిణీ చేసేందుకు వెజ్ బిర్యానీ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. కాగా ప్రధాని రోడ్ షోలో పాల్గొనే 60 నుంచి 70 వేల మందికి స్నాక్స్, వాటర్ బాటిల్ అందిస్తారు. జాయింట్ కలెక్టర్ మయూర్‌అశోక్ ఆధ్వర్యంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల పౌర సరఫరాల అధికారులు భాస్కరరావు, సూర్యప్రకాశ్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణమూర్తి, ఇతర అధికారులు ఆహారం తయారీ, పంపిణీ బాధ్యతలు పర్యవేక్షించనున్నారు.