Share News

అప్పన్నను దర్శించుకున్న ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కిశోర్‌ మక్వానా

ABN , Publish Date - Feb 10 , 2025 | 01:00 AM

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ మక్వానా దర్శించుకున్నారు.

అప్పన్నను దర్శించుకున్న ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కిశోర్‌ మక్వానా

సింహాచలం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ మక్వానా దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. కిషోర్‌ మక్వానా గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలు చేసి శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. గోదాదేవి అమ్మవారి దర్శనం తరువాత పండితులు వేదాశీర్వచనాలీయగా, ఈఓ శాలువాతో సత్కరించి స్వామివారి ఫొటోను, ప్రసాదాలను అందజేశారు.

---------------------------------------------------------------------------------------

జాతీయ క్రీడల్లో జ్యోతికి స్వర్ణ పతకం

విశాఖపట్నం స్పోర్ట్సు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):

నగరానికి చెందిన ఒలింపియన్‌, అర్జున అవార్డీ ఎర్రాజీ జ్యోతి జాతీయ క్రీడల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. డెహ్రాడూన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి స్వర్ణ పతకం సాధించింది. ఈ మీట్‌లో 100 మీటర్ల హర్డిల్‌ రేస్‌ను 13.1 సెకన్లలో పూర్తి చేసి జాతీయ క్రీడల్లో కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సందర్భంగా ఆమెకు జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డి.నాగేశ్వరరావు, ఎం.నారాయణరావు, ఇతర ప్రతినిధులు అప్పలరాజు, రాంకుమార్‌, తదితరులు అభినందనలు తెలిపారు.

---------------------------------------------------------------------------------------

నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

జిల్లాలో 34,679 మంది విద్యార్థులు

మద్దిలపాలెం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సైన్స్‌ (ఎంపీసీ, బైపీసీ) గ్రూపులకు చెందిన 34,679 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 146 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల పర్యవేక్షణకు 146 కేంద్రాల్లో చీఫ్‌ సూపరింటెండెంట్లను నియమించారు. అలాగే నాలుగు ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు ఏర్పాటుచేశారు. పరీక్షా గదికి ఫోన్లు అనుమతించరు.

-పకడ్బందీ ఏర్పాట్లు

బి.మురళీధర్‌, ఆర్‌ఐవో

ప్రాక్టికల్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ల్యాబ్‌ పరికరాలు అందుబాటులో ఉన్న కళాశాలల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతి గదిలో సీసీ కెమెరా ఏర్పాటు చేసి కార్యాలయానికి అనుసంధానం చేశాం. ఇక్కడ నుంచి సిబ్బంది మూల్యాంకనం, మార్కుల నమోదుతో సహా అన్నీ విషయాలు గమనిస్తారు.

Updated Date - Feb 10 , 2025 | 01:00 AM