మెడ్‌టెక్ జోన్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్
ABN , Publish Date - Jan 11 , 2025 | 01:03 AM
నగర శివార్లలోని ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు సైన్స్ టెక్నాలజీ క్లస్టర్ మంజూరైంది.
కేంద్ర సంస్థ పీఎస్‌ఏ నుంచి నిధులు
ఈ వేస్ట్ మేనేజ్‌మెంట్, కొత్త ఉత్పత్తులపై ఫోకస్
భాగస్వాములుగా స్థానిక విద్యా సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌లకు అవకాశం
విశాఖపట్నం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి):
నగర శివార్లలోని ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు సైన్స్ టెక్నాలజీ క్లస్టర్ మంజూరైంది. భారత ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ (పీఎస్‌ఏ) కార్యాలయం దీనిని మంజూరు చేసిందని మెడ్‌టెక్ జోన్ ఎండీ జితేంద్ర శర్మ నగరంలో రెండు రోజులు జరిగిన డీప్ టెక్నాలజీ సదస్సుకు వచ్చినప్పుడు వివరించారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని, దీనికి అవసరమైన నిధులు పీఎస్‌ఏ సమకూరుస్తుందన్నారు.
సెన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్‌లో ఇండస్ట్రీ 4.0, ఎలక్ర్టానిక్ (ఈ) వేస్ట్ మేనేజ్‌మెంట్, కొత్త ఉత్పత్తులపై దృష్టి పెడతారు. విశాఖపట్నంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), భారత్ హెవీ ఎలక్ర్టికల్స్ లిమిటెడ్ (భెల్), ఏపీ మెడ్‌టెక్ జోన్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, తూర్పు నౌకాదళం, హెచ్‌పీసీఎల్, ఫార్మా సిటీ వంటి అనేక పారిశ్రామిక సంస్థలు ఉన్నందున ఈ ప్రాంతంలో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ క్టస్లర్ ఏర్పాటుచేస్తే బాగుంటుందని ప్రధాని మంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపగా ఈ సెంటర్ మంజూరైంది. స్థానిక విద్యా సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌లను ఇందులో భాగస్వాములుగా చేసుకుంటారు.
రోబో టెలీ సర్జరీపై పరిశోధనలు
మెడ్‌టెక్ జోన్‌లో మూడు అంశాలపై కొత్తగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎక్కడో దూరంగా ఉన్న ప్రత్యేక వైద్య నిపుణులు 5జీ టెక్నాలజీ ద్వారా రోగిని చూస్తూ ఇక్కడ రోబో ద్వారా సర్జరీ చేస్తారు. కార్డియాలజీ, న్యూరో రంగాల్లో ప్రత్యేక వైద్యులు కొరత ఉన్నందున మెడ్‌టెక్ జోన్ దీనిపై దృష్టిపెట్టింది. ఇది అందుబాటులోకి వస్తే ఆపరేషన్ల కోసం వైద్యులు ప్రత్యేక విమానాల్లో ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే రోగులకు సంబంధించిన మెడికల్ రికార్డులను ఇంటిగ్రేడెడ్ ఎలక్ర్టానిక్ విధానంలో రూపిందించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.