వైకుంఠవాసునిగా సింహాచలేశుడు
ABN , Publish Date - Jan 11 , 2025 | 01:07 AM
ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలంలోని వరాహ లక్ష్మీనారసింహస్వామి శుక్రవారం భక్తులకు వైకుంఠవాసుడిగా దర్శనమిచ్చారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన స్వామి
తొలి దర్శనం చేసుకున్న ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు
తెల్లవారుజాము నుంచే బారులు తీరిన భక్తులు
స్వామి పల్లకిని మోసిన ఎమ్మెల్యేలు గంటా, పల్లా
విస్తృత ఏర్పాట్లు చేసిన దేవస్థానం
సింహాచలం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి):
ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలంలోని వరాహ లక్ష్మీనారసింహస్వామి శుక్రవారం భక్తులకు వైకుంఠవాసుడిగా దర్శనమిచ్చారు. స్వామివారిని శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంటకే సుప్రభాతసేవతో మేల్కొలిపి ధూప సేవ, సేవాకాలం, నిత్యహోమం వంటి ప్రభాత ఆరాధనలు పూర్తిచేశారు. ఆలయ అలంకారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని శంఖు, చక్ర, గదాయుధాలు, కటి హస్తాలు, సకల ఆభరణాలు, పరిమళ భరిత పుష్పమాలికలతో కాలుపైకాలు వేసుకుని కూర్చున్న రాజ భంగిమలో అలంకరించారు. అనంతరం బంగారు తొళ్ళక్కియాన్‌లో ఉత్సవమూర్తిని ఏడు మేలి ముసుగుల మధ్య ఉంచి, ఉభయ దేవేరులతో అధిష్ఠింపజేశారు. పండితుల వేద మంత్రోచ్ఛరణలు, సంకీర్తనలు, నాదస్వరాలపనలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ బేడా మండప తిరువీధి నిర్వహించారు. ఆ మార్గంలో పూజలు చేసి, ఒక్కో ముసుగును తొలగించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఆలయ ఉత్తర ద్వారంలో ఆఖరి ముసుగును తొలగించి భక్తులకు వైకుంఠవాసుడిగా దర్శనాన్ని కల్పించారు.
తిరువీధిలో స్వామి పల్లకిని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు (గణబాబు) దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు మోసి చామర సేవలందించారు. ఉత్తర ద్వారంలో అశోక్‌గజపతిరాజు కుటుంబసభ్యులకు తొలి దర్శనం కల్పించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు స్వామిని దర్శించుకున్నారు. ఆ తరువాత స్వామి వారిని ఉత్తర రాజగోపురంలో ప్రత్యేకంగా పుష్పాలతో తీర్చిదిద్దిన వేదిక పై ఉంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 11.30 గంటల వరకు వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని, పూజలు చేశారు. అనంతరం సింహగిరి మాడవీధుల్లో తిరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందపురం మండలం గోరింట గ్రామానికి చెందిన కోలాట బృందం శిరస్సున నీళ్ల బిందెలుంచుకుని చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో సుమారు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.