ప్రారంభానికి ముందే హెల్త్ క్లినిక్‌కు సుస్తీ
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:27 PM
మండలంలోని బకులూరు గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభానికి నోచుకోక ముందే శిథిలావస్థకు చేరుకుంటోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు హడావిడిగా, ఇష్టానుసారం దీనిని నిర్మించడంతో ఈ దుస్థితి నెలకొందని స్థానికులు విమర్శిస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో నాసిరకంగా భవన నిర్మాణం
ఊడిపోతున్న తలుపులు, ట్యూబ్ లైట్లు
పూర్తికాని మరుగుదొడ్ల నిర్మాణం
నిరుపయోగంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వైనం
కొయ్యూరు, జనవరి 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని బకులూరు గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభానికి నోచుకోక ముందే శిథిలావస్థకు చేరుకుంటోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు హడావిడిగా, ఇష్టానుసారం దీనిని నిర్మించడంతో ఈ దుస్థితి నెలకొందని స్థానికులు విమర్శిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో బకులూరు గ్రామ సచివాలయం పక్కనే రూ.20 లక్షల వ్యయంతో ప్రజారోగ్య పరిరక్షణ పేరుతో విలేజ్ హెల్త్ క్లినిక్‌ను నిర్మించారు. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్ నాసిరకం తలుపులు, విద్యుత్ సామగ్రి అమర్చి కిటికీలకు ఇనుప గ్రిల్ వేసి తలుపులు అమర్చకుండా, మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయకుండా రంగులు వేసి బిల్లులు మార్చేసుకున్నారని తెలిసింది. అయితే అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని పూర్తి చేసినట్టు రికార్డుల్లో చూపించారు. తలుపులు ఊడిపోతూ, ట్యూబ్ లైట్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఇది నిరుపయోగంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ భవనానికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.