నగరం...నిర్మానుష్యం
ABN , Publish Date - Jan 14 , 2025 | 01:00 AM
నిత్యం రద్దీగా కనిపించే నగరం సోమవారం నిర్మానుష్యంగా మారిపోయింది. సంక్రాతి పండగను సొంతూర్లో ఘనంగా జరుపుకునేందుకు పల్లె వాసులంతా తరలిపోవడంతో నిత్యం జనసమ్మర్థంతో కనిపించే రోడ్లు ఖాళీగా దర్శనమించ్చాయి. బీచ్‌రోడ్డుతోపాటు జూపార్కులో కూడా సందర్శకుల తాకిడి లేకపోవడంతో నగరం బోసిపోయినట్టయింది.
సంక్రాంతికి స్వస్థలాలకు తరలివెళ్లిన పల్లె వాసులు
ఖాళీగా దర్శనమిస్తున్న ప్రధాన కూడళ్లు
బీచ్ , జూపార్క్‌లో తగ్గిన సందర్శకుల రద్దీ
(ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం)
నిత్యం రద్దీగా కనిపించే నగరం సోమవారం నిర్మానుష్యంగా మారిపోయింది. సంక్రాతి పండగను సొంతూర్లో ఘనంగా జరుపుకునేందుకు పల్లె వాసులంతా తరలిపోవడంతో నిత్యం జనసమ్మర్థంతో కనిపించే రోడ్లు ఖాళీగా దర్శనమించ్చాయి. బీచ్‌రోడ్డుతోపాటు జూపార్కులో కూడా సందర్శకుల తాకిడి లేకపోవడంతో నగరం బోసిపోయినట్టయింది.
తెలుగు ప్రజలకు సంక్రాంతి అత్యంత ప్రధాన పడగ. ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి, విద్య కోసం ఎక్కడెక్కడికో వెళ్లి స్థిరపడినవారు సైతం సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చి పండగ జరుపుకుంటారు. కుటుంబసభ్యులు, బంధువులతోపాటు స్నేహితులంతా ఒకచోట చేరి జ్ఞాపాలను గుర్తుచేసుకుని, ఆనందంగా గడుపుతారు. నగరంలో నివసిస్తున్నవారిలో అత్యధికులు ఉత్తరాంధ్రతోపాటు పాటు వేర్వేరు ప్రాంతాలకు చెందినవారే. ఏడాదంతా ఉద్యోగం, వ్యాపారం ఇతర వ్యాపకాల్లో బిజీగా గడిపినవారంతా సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లి సంక్రాంతిని జరుపుకోవడానికి ఆసక్తిచూపుతారు. విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 11 నుంచి 19 వరకూ సెలవులు ప్రకటించింది. దీంతో చాలామంది ఈనెల 11 నుంచే ప్రయాణాలు పెట్టుకున్నారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారు, వ్యాపారులు, స్వయం ఉపాధి చేసుకునేవారు, కూలిపనులు చేసుకునేవారు మాత్రం ముందుగా వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఆది, సోమవారాల్లో స్వస్థలాలకు పయనమయ్యారు. మిగిలిపోయినవారు భోగి పండగను సోమవారం నగరంలోనే జరుపుకుని బయలుదేరారు. దీనివల్ల మధ్యాహ్నం 12 గంటల వరకు అనకాపల్లి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే మార్గాలపై వాహనాల రద్దీ కనిపించినా తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. నిత్యం వాహనాల రద్దీ, ట్రాఫిక్ జామ్‌తో పద్మవ్యూహాన్ని తలపించే హనుమంతవాక కూడలి, వెంకోజీపాలెం, ఇసుకతోట, ఎంవీపీకాలనీ, సత్యం జంక్షన్, జగదాంబ జంక్షన్, ద్వారకానగర్, గాజువాక వంటి ప్రధాన కూడళ్లు రద్దీ లేకపోవడంతో కళా విహానంగా మారాయి. ద్వారాకనగర్, ఆశీల్‌మెట్ట నుంచి జగదాంబ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్‌నుంచి డాబాగార్డెన్స్ రోడ్డులో వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. నగరంలో ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటలు వ రకూ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కో కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడితే వాహనాలు కిలోమీటరు పొడవునా బారులుతీరిపోతాయి. కానీ సోమవారం నగరంలో పరిస్థితి దీనికి పూర్తివిరుద్ధంగా కనిపించింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్‌సిగ్నల్‌పడినా పదిలోపు వాహనాలు మాత్రమే ఆగిఉంటున్నాయి.
సాధారణంగా సెలవురోజుల్లో కోలాహాలంగా కనిపించే బీచ్, జూపార్క్ సందర్శకుల తాకిడిలేకపోవడంతో ఖాళీగా కనిపించాయి. తప్పనిసరిపరిస్థితిలో నగరంలోనే పండగ జరుపుకునేందుకు ఉండిపోయినవారు మాత్రం బీచ్‌కు వెళ్లి గాలిపటాలు ఎగరవేస్తూ కాలక్షేపం చేశారు. రాత్రికాగానే వారంతా తిరిగి ఇళ్లకు చేరిపోవడంతో బీచ్ నిర్మానుష్యంగా మారిపోయింది. ఊరెళ్లినవారంతా సంక్రాంతి, కనుమ పండగలను స్వస్థల్లాలో జరుపుకున్న తర్వాతే తిరిగి వస్తారు కాబట్టి అంతవరకూ నగరంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా.