Share News

ఐకానిక్‌ భవనం ఐటీకి రిజర్వు

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:22 AM

విశాఖపట్నానికి మరో పెద్ద ఐటీ సంస్థ రాబోతున్నది. అది ఏమిటనేది త్వరలో వెల్లడి కానుంది. ఆ సంస్థ కోసం ముందుగానే ‘సూపర్‌ ఐకానిక్‌ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు చేసి పెట్టింది. అదే వీఎంఆర్‌డీఏ సిరిపురంలో నిర్మిస్తున్న మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ బిల్డింగ్‌. అది పేరుకు కారు పార్కింగ్‌ భవనమే అయినప్పటికీ అందులో ఐదు అంతస్థులు ఐటీ కార్యాలయాలకు అద్దెకు ఇచ్చేలా నిర్మించారు.

ఐకానిక్‌ భవనం ఐటీకి రిజర్వు

వీఎంఆర్‌డీఏ ఉద్యోగ భవన్‌ ఎదుట

తుది దశకు నిర్మాణం

మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ బిల్డింగ్‌గా పేర్కొంటున్నా

పై ఐదు అంతస్థులు

ఐటీ కంపెనీలకు అద్దెకు ఇచ్చేందుకు నిర్ణయం

దరఖాస్తులు ఆహ్వానించిన అధికారులు

వేలం నుంచి మినహాయించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు

దిగ్గజ సంస్థకు ఇవ్వాలని యోచన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నానికి మరో పెద్ద ఐటీ సంస్థ రాబోతున్నది. అది ఏమిటనేది త్వరలో వెల్లడి కానుంది. ఆ సంస్థ కోసం ముందుగానే ‘సూపర్‌ ఐకానిక్‌ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు చేసి పెట్టింది. అదే వీఎంఆర్‌డీఏ సిరిపురంలో నిర్మిస్తున్న మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ బిల్డింగ్‌. అది పేరుకు కారు పార్కింగ్‌ భవనమే అయినప్పటికీ అందులో ఐదు అంతస్థులు ఐటీ కార్యాలయాలకు అద్దెకు ఇచ్చేలా నిర్మించారు.

సిరిపురంలో ఉద్యోగ భవన్‌ ముందున్న 1.72 ఎకరాల్లో రూ.80 కోట్ల అంచనా వ్యయంతో వీఎంఆర్‌డీఏ భవన నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు ఆ వ్యయం రూ.87.5 కోట్లకు చేరింది. ఇది 11 అంతస్థుల భవనం. కింద బేస్‌మెంట్‌లో మూడు, ఆ పైన మొదటి, రెండో అంతస్థులు (మొత్తం ఐదు అంతస్థులు) పార్కింగ్‌కు కేటాయించారు. వీటి విస్తీర్ణం 1.9 లక్షల చ.అడుగులు. వీటిలో 430 కార్లు, 400 ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌ చేసుకోవచ్చు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ను షాపింగ్‌ మాల్‌ తరహాలో వాణిజ్య అవసరాలకు కోసం నిర్మించారు. ఆ పైన మూడో అంతస్థు నుంచి ఏడో అంతస్థు వరకు (ఐదు అంతస్థులు) ఐటీ కంపెనీలకు ఇవ్వాలని నిర్ణయించారు. వీటి విస్తీర్ణం 1.65 లక్షల చదరపు అడుగులు.

సూపర్‌ ఐకానిక్‌ భవనం

వీఎంఆర్‌డీఏ నగరం నడిబొడ్డున చేపట్టిన ఈ నిర్మాణం విశాఖలో సూపర్‌ ఐకానిక్‌ భవనాల్లో ఒకటిగా నిలుస్తోంది. పూర్తిగా అద్దాలతో క్రూయిజ్‌ షిప్‌ మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ భవనంలో ఐదో అంతస్థు నుంచి ఎదురుగా సముద్రం కనిపిస్తుంది. వందలాది వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం కలిగి, నగరంలో మధ్యలో ఉండడంతో దీనిని టీసీఎస్‌ కంటే పెద్ద ఐటీ సంస్థకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే దీనిని రిజర్వు చేసి పెట్టారు.

వేలం నుంచి మినహాయింపు

ఈ భవనంలో కమర్షియల్‌ షాపుల కోసం ఉద్దేశించిన గ్రౌండ్‌ ఫ్లోర్‌, మూడో అంతస్థు నుంచి ఏడో అంతస్థు వరకు ఐటీ కంపెనీలకు అద్దెకు ఇస్తామని వీఎంఆర్‌డీఏ ప్రకటించి దరఖాస్తులు ఆహ్వానించింది. అనేక ఐటీ సంస్థలు ముందుకు వచ్చాయి. అయితే అద్దె, నిర్వహణ వ్యయం, జీఎస్‌టీ కలుపుకొంటే రేట్లు కొంచెం అధికంగా ఉన్నాయని, కాసింత తగ్గించాలని వారు వీఎంఆర్‌డీఏ అధికారులను కోరారు. వారి అభ్యర్థనను పరిశీలించేలోపే ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయి. అనేక ఐటీ సంస్థలు విశాఖలో కార్యకలాపాల నిర్వహణకు ముందుకు వస్తున్నాయని, భవనాల అవసరం చాలా ఉందని, తొందరపడి చిన్న చిన్న సంస్థలకు ఐకానిక్‌ భవనాన్ని కేటాయించవద్దని సూచించారు. దాంతో రెండు రోజుల క్రితం (డిసెంబరు 30వ తేదీ) నిర్వహించిన వేలం నుంచి ఆ భవనాన్ని మినహాయించారు.

నెలాఖరుకు సిద్ధం

ప్రణవ్‌ గోపాల్‌, చైర్మన్‌, వీఎంఆర్‌డీఏ

మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ భవనాన్ని ఈ నెలాఖరుకు పూర్తిచేస్తాం. ముందు వాణిజ్య అవసరాలకు ఉపయోగించాలని అనుకున్నాము. కానీ విశాఖ ఐటీ హబ్‌గా మారుతున్న తరుణంలో పెద్ద ఐటీ సంస్థకు భవనం మొత్తం ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పార్కింగ్‌ అందరికీ ఉపయోగపడుతుంది. పై అంతస్థులు మాత్రం ఐటీ సంస్థకే ఇస్తాము.

Updated Date - Jan 02 , 2025 | 01:23 AM