Share News

ఫలించిన ఎంపీ కృషి

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:36 AM

విశాఖ విమానాశ్రయంలో ఎయిర్‌కార్గో కార్యకలాపాలను పునరుద్ధరించనున్నారు.

ఫలించిన ఎంపీ కృషి

విశాఖ నుంచి అంతర్జాతీయ ఎయిర్‌ కార్గో సేవలు

పునరుద్ధరణకు అనుమతుల మంజూరు

పారిశ్రామిక వర్గాల్లో హర్షాతిరేకాలు

విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):

విశాఖ విమానాశ్రయంలో ఎయిర్‌కార్గో కార్యకలాపాలను పునరుద్ధరించనున్నారు. ఈ సేవలు నిలిచిపోవడంతో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎంపీ శ్రీభరత్‌ పునరుద్ధరణకు కృషిచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు.

విమానాశ్రయంలో వచ్చే వారం నుంచే అంతర్జాతీయ ఎయిర్‌కార్గో సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సుమద్రం ద్వారా ఎగుమతి, దిగుమతులు జరుగుతు న్నాయి. ఫార్మా ఉత్పత్తులు, దుస్తులు, రొయ్యల రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. 2019-20 మధ్య 470 టన్నుల అంతర్జాతీయ కార్గో రవాణా జరిగిన విమానాశ్రయంలో ఈ సేవలు నిలిచిపోయాయి.

కేంద్రంతో నిరంతర చర్చలు

ఎయిర్‌కార్గో సేవలు నిలిచిపోవడంతో పారిశ్రామికవేత్తలు సమస్యను ఎంపీ శ్రీభరత్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివరించారు. ఎయిర్‌పోర్టు అధికారులు, అడ్వైజరీ కమిటీ సిఫార్సులను నివేదించారు. విమానయానశాఖా మంత్రి రామ్మోహన్‌నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిష్కారం దిశగా పలుమార్లు సమావేశమయ్యారు. దీంతో ఎయిర్‌కార్గో సేవల పునరుద్ధరణకు అనుమతి లభించింది. ఈ క్రమంలో ఏపీ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ కార్గో నిర్వహణ బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకు వచ్చింది. ఎయిర్‌కార్గో సేవల ప్రారంభానికి అనుమతి లభించడం పట్ల ఎంపీ శ్రీభరత్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సేవలు పారిశ్రామిక రంగానికి ఊతమిస్తాయన్నారు. ఇక్కడి ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంటుందన్నారు. సేవల పునరుద్ధరణకు సహకరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సేవల పునరుద్ధరణపై ఏపీ ఎయిర్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కె.కుమార్‌రాజా, ఒ.నరేష్‌కుమార్‌, డీఎస్‌ వర్మ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 13 , 2025 | 12:36 AM