Share News

ప్రధాని సభ చిరస్మరణీయంగా నిలవాలి

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:15 AM

విశాఖలో ఈ నెల ఎనిమిదో తేదీన నిర్వహించనున్న ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభ చిరస్మరణీయంగా నిలిచేలా నేతలు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఐటీ, మానవ వనరుల అభివృద్ధిశాఖా మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు.

ప్రధాని సభ చిరస్మరణీయంగా నిలవాలి

  • దేశం మనవైపు చూసేలా నిర్వహించాలి

  • సమన్వయంతో విజయవంతం చేయాలి

  • 3 లక్షల మందిని తరలించేలా చర్యలు

  • రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు మోదీకి కృతజ్ఞత తెలిపేలా నిర్వహణ

  • ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి నారా లోకేశ్‌

  • గణబాబుకు రోడ్‌ షో, పల్లాకు సభ పర్యవేక్షణ బాధ్యతలు

విశాఖపట్నం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):

విశాఖలో ఈ నెల ఎనిమిదో తేదీన నిర్వహించనున్న ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభ చిరస్మరణీయంగా నిలిచేలా నేతలు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఐటీ, మానవ వనరుల అభివృద్ధిశాఖా మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. ప్రధాని రోడ్‌ షో, సభ ఏర్పాట్లపై ఆదివారం విశాఖ కలెక్టరేట్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక రీతిలో సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా విశాఖలో ప్రధాని సభ జరగాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సింగిల్‌ అజెండాగా పనిచేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్నారని, ఈ సందర్భంగా మూడు పార్టీల నేతలు, ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. గతంలో విజయవాడలో నిర్వహించిన సభను మించి యావత్‌దేశం మనవైపు చూసేలా విశాఖ సభ నిర్వహించాలని పిలుపునిచ్చారు. సభకు కనీసం మూడు లక్షల మంది హాజరయ్యేలా చూడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ అధిక నిధులు కేటాయిస్తోందని, అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతోందని, మోదీ సభను విజయవంతం చేయడం ద్వారా దానికి కృతజ్ఞతలు తెలపాలన్నారు. రోడ్‌షో ద్వారా ప్రధాని ప్రజలను పలుకరించనున్నారని, ప్రజలంతా ప్రధాని కాన్వాయ్‌కి చేరువగా ఉండేలా బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సింగిల్‌ బారికేడింగ్‌ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు ఇబ్బందిలేకుండా రోడ్‌షో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

నేతలకు బాధ్యతల అప్పగింత

ప్రధాని మోదీ వెంకట్రాది వంటిల్లు నుంచి ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో సభా వేదిక వరకు రోడ్‌షో నిర్వహిస్తారని, ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పాల్గొంటారన్నారు. రోడ్‌షో బాధ్యతలను విప్‌ గణబాబుకు, బహిరంగ సభ నిర్వహణ బాధ్యతలను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అప్పగించారు. మిగిలిన నేతలంతా వారికి సహకరించాలన్నారు. ప్రధాని సభ చారిత్రాత్మకమని, ఈ మూడు రోజులు ప్రజా ప్రతినిధులు, అధికారులు సింగిల్‌ అజెండాగా పనిచేయాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌, సీపీ శంకుబాత్ర బాగ్చీ మంత్రికి వివరించారు. అన్ని రకాల కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. వీవీఐపీ, వీఐపీ వాహనాలు, సభకు తరలివచ్చే ప్రజల వాహనాలకు 26 చోట్ల పార్కింగ్‌ సదుపాయం కల్పించామన్నారు. పాసుల జారీకి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. సమీక్ష సమావేశంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

ప్రధాని పర్యటన షెడ్యూల్‌

విశాఖపట్నం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల ఎనిమిదో తేదీని నగరానికి రానున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం విడుదల చేసింది. ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టునుంచి ప్రధాని ప్రత్యేక విమానంలో బయలుదేరి, మధ్యాహ్నం 4.15 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 4.20 గంటలకు రోడ్డుమార్గంలో తాటిచెట్లపాలెం జంక్షన్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, దత్‌ ఐలాండ్‌ జంక్షన్‌ మీదుగా ఏయూ ఎకనామిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఎదురుగా ఉన్న వెంకటాద్రి వంటిల్లు వద్దకు 4.25 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఓపెన్‌టాప్‌ వాహనంలో రోడ్‌షో నిర్వహిస్తూ ఏయూ ఇంజనీరింగ్‌ మైదానంలోని వేదిక వద్దకు సాయంత్రం 5.30 గంటలకు చేరుకుంటారు. 6.30 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించిన అనంతరం బహిరంగసభలో మాట్లాడుతారు. 6.35 గంటలకు ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం నుంచి రోడ్డుమార్గంలో ఎయిర్‌పోర్టుకు చేరుకుని, రాత్రి 7 గంటలకు ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌ వెళతారు.

బూత్‌ స్థాయి నుంచి జన సమీకరణ

ప్రతి నియోజకవర్గానికి బస్సుల కేటాయింపు

ప్రఽధాని సభ విజయంతానికి నేతల విస్తృత కసరత్తు

మహారాణిపేట, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్‌షో, సభ విజయవంతానికి బూత్‌స్థాయి నుంచి జన సమీకరణ చేపట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రధాని సభ విజయంతానికి చేపట్టాల్సిన చర్యలపై విస్తృత కసరత్తు చేశారు. ఇందులో భాగంగా బూత్‌లెవెల్‌లో కేడర్‌ను సమాయత్తం చేసుకుని పెద్దఎత్తున జనాన్ని ప్రధాని సభకు తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గాని బస్సులు కేటాయించాలని సూచించారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు డోల శ్రీబాలవీరాంజనేయస్వామి, వంగలపూడి అనిత, విప్‌ గణబాబు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్‌, సుందరపు విజయకుమార్‌, గౌతు శిరీష, గొండు శంకర్‌, బెందాళం అశోక్‌, కార్పొరేషన్ల చైర్మన్లు గండి బాబ్జీ, తాతయ్యబాబు, దొన్నుదొర, పీలా గోవింద్‌, దామచర్ల సత్య, కిడారి శ్రావణ్‌కుమార్‌, మల్ల సురేంద్ర, నేతలు బుద్దా నాగజగదీష్‌, గిడ్డి ఈశ్వరి, లాలం భవాని, బండారు అప్పలనాయుడు, కోట్ని బాలాజి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 01:15 AM