తెగ తాగారు
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:27 AM
జిల్లాలో మద్యం వ్యాపారులకు న్యూ ఇయర్ అమ్మకాలు కిక్ ఇచ్చాయి. డిసెంబరు 31వ తేదీన రికార్డుస్థాయిలో రూ.10.77 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు చాలామంది 30నే మద్యం కొనుగోలు చేయడంతో ఆరోజు రూ.ఏడు కోట్ల సరకు అమ్మకాలు జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
మద్యం అమ్మకాలకు న్యూఇయర్ కిక్
31న రూ.10.77 కోట్లు మద్యం విక్రయం
30న రూ.7 కోట్ల అమ్మకం
సాధారణ రోజుల్లో రూ.4 కోట్ల వ్యాపారం
విశాఖపట్నం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో మద్యం వ్యాపారులకు న్యూ ఇయర్ అమ్మకాలు కిక్ ఇచ్చాయి. డిసెంబరు 31వ తేదీన రికార్డుస్థాయిలో రూ.10.77 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు చాలామంది 30నే మద్యం కొనుగోలు చేయడంతో ఆరోజు రూ.ఏడు కోట్ల సరకు అమ్మకాలు జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లా (జీవీఎంసీలో కలిసి ఉన్న అనకాపల్లి జిల్లాలోని ఐదు వార్డుల్లో తొమ్మిది దుకాణాలను మినహాయించి)లో 145 మద్యం దుకాణాలు, 119 బార్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో సాధారణ రోజుల్లో రూ.నాలుగు కోట్ల వరకూ మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. కొత్తసంవత్సరం వస్తుందంటే డిసెంబరు 31వ తేదీ రాత్రి మద్యం విక్రయాలు భారీగానే ఉంటాయి. గత ఏడాది జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాలు, ప్రైవేటు బార్లలో రూ.పది కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు అంచనా. ఈ ఏడాది డిసెంబరు 31న ఉదయం పది నుంచి రాత్రి 11 గంటల వరకు 145 మద్యం దుకాణాల్లో రూ.8.89 కోట్లు విలువైన మద్యం అమ్ముడైంది. 119 బార్లలో రూ.1.55 కోట్లు, 12 స్టార్ హోటళ్లలో మద్యం విక్రయాలకు తాత్కాలిక లైసెన్స్ ఇవ్వడంతో వాటిల్లో రూ.16,67,890, ఆరు క్లబ్‌లలో రూ.7,89,657, ఏపీ టూరిజానికి చెందిన నాలుగు అవుట్‌లెట్లలో రూ.9,02,870 విలువైన మద్యం అమ్ముడైంది. మొత్తం డిసెంబరు 31న రూ.10,77,67,000 విలువైన మద్యం అమ్ముడైంది. ఇదికాకుండా కొంతమంది డిసెంబరు 31 వేడుకల కోసం ముందురోజే మద్యం కొనుగోలు చేసి భద్రపరచుకున్నారు. అందుకే 30న రూ.7 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అందులో సుమారు రూ.మూడు కోట్ల విలువైన మద్యం డిసెంబరు 31వ తేదీ కోసమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం డిసెంబరు 31న సుమారు రూ.13.77 కోట్ల విలువైన మద్యం తాగేసినట్టు లెక్క.