ఇసుకాసురుల ఇష్టారాజ్యం
ABN , Publish Date - Jan 11 , 2025 | 10:57 PM
జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, జిల్లాకు చెందిన మంత్రి మాజీ పీఏ అనుచరుడి అండదండలు పుష్కలంగా ఉండడంతో ఇసుక మాఫియా ఆగడాలు మూడు ట్రాక్టర్లు, ఆరు లారీలుగా వర్థిల్లుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
వరహా నదిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు
రాజకీయ పలుకుబడితో దందా
అనధికార వేలం పాట నిర్వహించి గుత్తాధిపత్యం
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు
(అనకాపల్లి/కోటవురట్ల- ఆంధ్రజ్యోతి)
జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, జిల్లాకు చెందిన మంత్రి మాజీ పీఏ అనుచరుడి అండదండలు పుష్కలంగా ఉండడంతో ఇసుక మాఫియా ఆగడాలు మూడు ట్రాక్టర్లు, ఆరు లారీలుగా వర్థిల్లుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం పాత గొట్టివాడ వరహా నదిలో గత ఐదు నెలలుగా అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండానే ఇసుకను తోడేస్తున్నారు. గొట్టివాడ, కైలాసపట్నం, పాతరోడ్డు గ్రామాలకు ఆనుకొని ఉన్న వరహా నది పరీవాహక ప్రాంతాల్లో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో అక్రమార్కుల కన్ను వాటిపై పడింది. జిల్లాకు చెందిన మంత్రికి ప్రైవేటు పీఏగా ఇటీవల వరకు కొనసాగిన వ్యక్తి అనుచరుడి అండదండలతోనే గొట్టివాడకు చెందిన ఒక నేత ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిత్యం రాత్రి వేళ, తెల్లవారుజామున గొట్టివాడ గ్రామానికి సమీప వరహా నదిలో ఇసుక తవ్వకాలు జరిపి ఎలమంచిలి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలరేగిపోతున్నారు. అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లతో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి ప్రైవేటు పీఏగా కొంత కాలం కొనసాగిన వ్యక్తి అనుచరుడి అండదండలతో స్థానిక నేత ఐదు నెలల కిందట ఇసుక అనధికార తవ్వకాలకు ఏడాదికి రూ.5 లక్షల వంతున వేలం పాట పాడి, రోజుకు రూ.2 లక్షల విలువైన ఇసుకను తరలించుకుపోతున్నాడని తెలిసింది. ప్రభుత్వ భవనాలు, సిమెంట్ రోడ్లు, ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలు, వ్యక్తిగత ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నప్పటికీ అనధికార వేలం పాట నిర్వహించి ఇసుకపై గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కాగా వరహా నది నుంచి ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నా, పైస్థాయి నుంచి వస్తున్న ఒత్తిడితో వదిలేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి వంతెనలు, రక్షిత మంచినీటి పథకాలకు సుమారు 500 మీటర్ల సమీపంలో తవ్వకాలు జరపరాదన్న నిబంధన ఉన్నా అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వరహా నదిలో ఇసుక యథేచ్ఛగా తోడేసి నదీ గర్భాన్ని గుల్ల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు ఉంటుందని, ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని స్థానికులు భావించినా ఇసుక అడ్డగోలు తవ్వకాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.