మన్యానికి పోటెత్తిన పర్యాటకులు
ABN , Publish Date - Jan 11 , 2025 | 10:15 PM
మన్యం అందాలను తిలకించేందుకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. వంజంగి మేఘాల పర్వతం, ఆంధ్ర కశ్మీరు లంబసింగి, చెరువులవేనం, తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి.
కిటకిటలాడిన పర్యాటక ప్రాంతాలు
వంజంగి, లంబసింగి అందాలు తిలకించేందుకు క్యూ..
వరుస సెలవులతో రద్దీ
పాడేరురూరల్/చింతపల్లి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మన్యం అందాలను తిలకించేందుకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. వంజంగి మేఘాల పర్వతం, ఆంధ్ర కశ్మీరు లంబసింగి, చెరువులవేనం, తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి. శీతాకాలంలో మంచు అందాలను ఆస్వాదించేందుకు భారీగా పర్యాటకులు తరలివచ్చారు.
పాడేరు మండలంలో వంజంగి మేఘాల పర్వతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ప్రాంతాల నుంచి వందలాది మంది ప్రకృతి ప్రియులు శుక్రవారం సాయంత్రానికి పాడేరుకు చేరుకున్నారు. పాడేరులో రాత్రి బస చేసిన పర్యాటకులు శనివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో బయలుదేరి మేఘాల పర్వతం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎముకులు కొరికే చలిలో పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలు, భానుడి కిరణాలు, నీలివర్ణ మేఘాలను చూసి పులకించిపోయారు. ప్రకృతి అందాలను సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించుకొని ఆనందంగా గడిపారు. పర్యాటకుల తాకిడితో పాడేరు రహదారులు, టిఫిన్, భోజన హోటల్స్ రద్దీగా మారాయి.
లంబసింగికి పర్యాటకుల తాకిడి
చింతపల్లి మండలంలో ఆంధ్రకశ్మీర్‌గా పేరుగాంచిన లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. గిరిజన ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీనికి తోడు సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు లంబసింగికి క్యూ కడుతున్నారు. శనివారం లంబసింగికి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. దీంతో ఉదయం ఐదు గంటల నుంచే చెరువులవేనం వ్యూపాయింట్, లంబసింగి జంక్షన్, భీమనాపల్లి, తాజంగి జలాశయాల వద్ధ పర్యాటకుల సందడి ప్రారంభమైంది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్దకు ఒకేసారి భారీ సంఖ్యలో పర్యాటకులు రావడంతో జాతర వాతావరణం నెలకొంది. పర్యాటకులు మంచు అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాల సరసన ఫొటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. సాయంత్రం వరకు పర్యాటక ప్రాంతాలు, స్ట్రాబెర్రీ తోటలు పర్యాటకులతో రద్దీగా కనిపించాయి.