Share News

అమ్మో.. రాళ్లగెడ్డ-లోతుగెడ్డ రోడ్డు

ABN , Publish Date - Jan 11 , 2025 | 10:10 PM

మండలంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు బలపం కోరుకొండ ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. రాళ్లగెడ్డ నుంచి లోతుగెడ్డ వంతెన వరకు భారీ గోతులు ఏర్పడి రాకపోకలు సాగించలేని దుస్థితి నెలకొంది.

అమ్మో.. రాళ్లగెడ్డ-లోతుగెడ్డ రోడ్డు
కోటగున్నలు సమీపంలో ఏర్పడిన గోతులు

రాకపోకలకు భీతిల్లుతున్న గిరిజనం

అడుగడుగునా భారీ గోతులు

గత ఐదేళ్లలో కన్నెత్తి చూడని వైసీపీ పాలకులు

ఆదివాసీలకు తప్పని రవాణా కష్టాలు

చింతపల్లి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు బలపం కోరుకొండ ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. రాళ్లగెడ్డ నుంచి లోతుగెడ్డ వంతెన వరకు భారీ గోతులు ఏర్పడి రాకపోకలు సాగించలేని దుస్థితి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ప్రజల రాకపోకలు సాగించే లోతుగెడ్డ-రాళ్లగెడ్డ రోడ్డు ప్రధానమైనది. ఈ రహదారిపై చింతపల్లి మండలంలోని బలపం, కుడుముసారి, తమ్మంగుల పంచాయతీలకు చెందిన 89 గ్రామాల ఆదివాసీలు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్‌ పరిధిలోని మూడు పంచాయతీల ప్రజలు కూడా ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారిని పదేళ్ల క్రితం నిర్మించారు. ఐదేళ్ల క్రితం ఈ రహదారిపై చిన్నపాటి గోతులు ఏర్పడ్డాయి. సకాలంలో గత వైసీపీ ప్రభుత్వం ఆ గోతులను పూడ్చకపోవడంతో ప్రస్తుతం భారీ గోతులు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల రహదారి ఆనవాళ్లు కనిపించడం లేదు. ఈ రహదారిపై ఒక్కో గొయ్యి రెండు అడుగుల లోతులో ఉన్నాయి. లోతుగెడ్డ బ్రిడ్జి నుంచి రాళ్లగెడ్డకు వరకు ఎనిమిది కిలోమీటర్లు వాహనచోదకులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ రహదారిపై ప్రయాణించే ఆదివాసీల కష్టాలు వర్ణణాతీతం. ఆర్టీసీ బస్సు, సర్వీసు జీపులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అతికష్టంపై రాకపోకలు సాగిస్తున్నాయి. వర్షాలు కురిసిన సమయంలో వాహనాలు గోతుల్లోని బురదలో కూరుకుపోతున్నాయి. సర్వీసు ఆటోలు, జీపులు రెండు రోజులు ఈ మార్గంపై ప్రయాణిస్తే మరమ్మతులకు గురవుతున్నాయని డ్రైవర్లు వాపోతున్నారు. తరచూ ఏదో ఒకచోట ద్విచక్ర వాహనాల ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఐదేళ్లుగా పట్టించుకోని వైనం

రాళ్లగెడ్డ-లోతుగెడ్డ బ్రిడ్జి వరకు రహదారి మరమ్మతుల గురించి గత వైసీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. మూడేళ్ల క్రితం బలపంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన నాటి ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, వైసీపీ నేతల దృష్టికి స్థానికులు రోడ్డు సమస్యను తీసుకు వెళ్లారు. రహదారి మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. కనీసం గోతులను కూడా పూడ్చలేదు. ఈ రహదారి సమస్యను కొంతమంది ఉద్యోగులు ఏడాదిన్నర క్రితం నాటి ఎస్టీ కమిషన్‌ సభ్యుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ కుంభా రవిబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే ఉపాధ్యాయులు ఈ సమస్యను వీడియో రూపంలో చిత్రీకరించి ఆయనకు వివరించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని, సాధ్యమైనంత వేగంగా పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రోజులు, నెలలు గడిచినా రహదారి మరమ్మతులు చేసేందుకు అధికారులు గాని, పాలకులు గాని ముందుకురాలేదు.

కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

కూటమి ప్రభుత్వ హయాంలోనే ఈ రహదారి బాగుపడుతుందని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గిరిజన గ్రామాలకు రహదారులు కల్పించేందుకు పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఆదివాసీలకు కూటమి ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. అలాగే కలెక్టర్‌, ఐటీడీఏ పీవో లోతుగెడ్డ- రాళ్లగెడ్డ రహదారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Jan 11 , 2025 | 10:10 PM