Share News

ఎకో పల్పింగ్‌ యూనిట్‌ ఎప్పటికి పూర్తయ్యేనో?

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:32 PM

మండల కేంద్రంలో ఐటీడీఏ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుం దో అర్థంకాని పరిస్థితి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో రెండేళ్ల క్రితం కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేయడంతో అసంపూర్తి నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి.

ఎకో పల్పింగ్‌ యూనిట్‌ ఎప్పటికి పూర్తయ్యేనో?
అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తున్న ఎకో పల్పింగ్‌ యూనిట్‌ భవనం

గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులకు బ్రేక్‌

రెండేళ్ల క్రితం అర్ధాంతరంగా నిలిపివేసిన కాంట్రాక్టర్‌

రూ.20 లక్షలతో కొనుగోలు చేసిన యంత్రాలు నిరుపయోగం

మండలంలోని కాఫీ రైతులకు తప్పని కష్టాలు

కాఫీ పండ్లను చింతపల్లి యూనిట్‌కు తరలించాల్సిన దుస్థితి

గూడెంకొత్తవీధి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఐటీడీఏ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుం దో అర్థంకాని పరిస్థితి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో రెండేళ్ల క్రితం కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేయడంతో అసంపూర్తి నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. ఈ యూనిట్‌ కోసం రూ.20 లక్షలతో కొనుగోలు చేసిన యంత్రాలు తుప్పుపట్టి నిరుపయోగంగా పడి ఉన్నాయి.

గిరిజన రైతులు పండించిన కాఫీ పండ్ల నుంచి నాణ్యమైన పార్చిమెంట్‌ ఉత్పత్తి చేసేందుకు చింతపల్లి ఎకో పల్పింగ్‌ యూనిట్‌ తరహాలో రూ.1.3 కోట్ల ట్రైకార్‌ నిధులతో గూడెంకొత్తవీధి మండల కేంద్రంలోనూ నిర్మించేందుకు ఐటీడీఏ మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించింది. మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని ఐటీడీఏ లక్ష్యాన్ని నిర్దేశించింది. 2022 సంవత్సర కాఫీ సీజన్‌ నాటికే ఎకో పల్పింగ్‌ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీడీఏ అధికారులు ప్రకటించారు. అయితే నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు.

తుప్పుపడుతున్న యంత్రాలు

ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులు నిలిచిపోవడం వల్ల యంత్రాలు నిరుపయోగంగా ఉండి తుప్పుపడుతున్నాయి. ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి అవసరమైన యంత్రాలను అప్పట్లో సుమారు రూ.20 లక్షలతో కొనుగోలు చేశారు. యూనిట్‌ నిర్మాణం పూర్తికాకపోవడం వల్ల యంత్రాలను ఇన్‌స్టాల్‌ చేసే పరిస్థితి లేదు. ప్రధానంగా ఎకో పల్పింగ్‌ యూనిట్‌ వద్ద పైకప్పు నిర్మాణం, యంత్రాలు ఇన్‌స్టాల్‌ చేసేందుకు విద్యుత్‌ సరఫరా ఉండాలి. ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోవడానికి ఈపీడీసీఎల్‌కు సుమారు రూ.8 లక్షలు చెల్లించాలి. విద్యుత్‌ కనెక్షన్‌కి సంబంధించిన నిధులను సైతం గత ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో ఎకో పల్పింగ్‌ యూనిట్‌ వద్ద పనులు చేపట్టే అవకాశం లేకుండాపోయింది.

కాఫీ ఉత్పత్తిలో జీకేవీధి అగ్రగామి

జిల్లాలో గూడెంకొత్తవీధి మండలం కాఫీ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. మండలంలో ఆదివాసీ రైతులు అత్యధికంగా 42 వేల ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతున్నారు. సరైన సేద్య పద్ధతులు పాటించకపోవడం వల్ల ఆశించిన దిగుబడులు రాకపోయినప్పటికి ప్రతి ఏడాది 4,200 టన్నుల క్లీన్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఐటీడీఏ సహకారంతో మ్యాక్స్‌ కాఫీ పండ్లకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తున్నది. గత ఏడాది కిలో కాఫీ పండ్లకు రూ.43 గరిష్ఠ ధరను అందజేశారు. గిరిజన రైతులు కాఫీ పండ్లను మ్యాక్స్‌ ద్వారా మార్కెటింగ్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మండల కేంద్రంలో ఎకో పల్పింగ్‌ యూనిట్‌ అందుబాటులోకి రాకపోవడం వల్ల మండలానికి చెందిన ఆదివాసీలు పండించిన కాఫీ పండ్లను చింతపల్లి ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి తరలించుకోవాల్సి వస్తున్నది. దీంతో రవాణా ఖర్చు పెరుగుతున్నది.

ఎకో పల్పింగ్‌ యూనిట్‌ అందుబాటులోకి వస్తే..

ఎకో పల్పింగ్‌ యూనిట్‌ అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆదివాసీలు కాఫీ తోటల నుంచి సేకరించిన పండ్లను వెను వెంటనే ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి తరలించే అవకాశముంటుంది. చింతపల్లికి తరలించే రవాణా భారం తగ్గుతుంది. రైతులు ప్రైవేటు వర్తకులను ఆశ్రయించకుండా సేకరించిన పండ్లను పూర్తి స్థాయిలో మ్యాక్స్‌ ద్వారా మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం కలుగుతుంది. రైతులు చెర్రీగా విక్రయించుకోకుండా మెజారిటీ పండ్లను పార్చిమెంట్‌గా విక్రయించుకుని గరిష్ఠ ధర పొందే అవకాశముంటుంది. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు ఎకో పల్పింగ్‌ యూనిట్‌ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాఫీ రైతులు కోరుతున్నారు.

Updated Date - Jan 01 , 2025 | 11:32 PM