‘నూతన’ సందడి
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:29 AM
A new Buzz కాలచక్రం గిర్రున తిరిగిపోయింది.. చూస్తుండగానే కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి 2024 కనుమరుగైంది. కోటి ఆశలు.. కొంగొత్త ఆకాంక్షలతో మరో వసంతం మన ముందుకొచ్చింది. 2024కు వీడ్కోలు చెబుతూ.. 2025కు జిల్లావాసులు ఘన స్వాగతం పలికారు.
అర్ధరాత్రి నుంచే వేడుకలు ప్రారంభం
అంతటా సందడి వాతావరణం
ఆశలు ఫలించాలి.. మన్యం మురవాలని కోరుకుంటున్న ప్రజలు
పార్వతీపురం, డిసెంబరు 31 (ఆంరఽధజ్యోతి): కాలచక్రం గిర్రున తిరిగిపోయింది.. చూస్తుండగానే కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి 2024 కనుమరుగైంది. కోటి ఆశలు.. కొంగొత్త ఆకాంక్షలతో మరో వసంతం మన ముందుకొచ్చింది. 2024కు వీడ్కోలు చెబుతూ.. 2025కు జిల్లావాసులు ఘన స్వాగతం పలికారు. కొన్నిచోట్ల మంగళవారం అర్ధరాత్రి కేక్‌లను కట్‌చేసి యువత సందడి చేశారు. బుధవారం నుంచి ప్రారంభమవుతున్న నూతన ఏడాదిలో అందరికీ మంచి జరగాలని జిల్లా ప్రజలు భగవంతుడిని ప్రార్థించారు. క్రైస్తవులు అర్థరాత్రి దాటిన వరకు చర్చిలు, ప్రార్థన మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నూతన ఏడాది అన్ని రకాలుగా కలిసి రావాలని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యం లో జిల్లా మరింతగా అభివృద్ధి చెందాలని మన్యం వాసులు ఆశిస్తున్నారు. మొత్తంగా జిల్లా అంతటా సందడి వాతావరణం నెలకొంది.
ఊపందుకున్న వ్యాపారాలు..
సాలూరు రూరల్: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లాఓ వివిధ వ్యాపారాలు ఊపందుకున్నాయి. పుష్పగుచ్ఛాలు, స్వీట్లు, పండ్లు, బేకరీ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మరోవైపు ఆపిల్, ఆరెంజ్, కేకులు, శీతలపానియాలు, డైరీల విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబరు 31 మంగళవారం కావడంతో మాంసాహార హోటల్స్‌కు డిమాండ్ ఏర్పడింది. దీంతో హోటల్స్ వారు బిర్యానీ తదితర వాటికి ఆఫర్స్ ప్రకటించారు. మరోవైపు అర్థరాత్రి వరకు మద్యం విక్రయాలు సాగాయి. దీంతో మందుబాబులతో మద్యం దుకాణాలు రద్దీగా మారాయి.
జిల్లావాసులకు కలెక్టర్ శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు, ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. జిల్లాను స్వచ్ఛ సుందరంగా తీర్చిదిద్దేందుకు, రక్తహీనత నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్న తెలిపారు. తనను కలుసుకోవడానికి వచ్చే ప్రజలు, అధికారులు, బొకేలు, స్వీట్లు తీసుకురావద్దని తెలిపారు. రక్తహీనత నివారణకు విరాళాలు అందించాలని కోరారు. బాలిక శిశు అభివృద్ధి నిధి ఖాతాకు (069901000332) తోచిన మొత్తం జమ చేయొచ్చన్నారు. పౌష్టికాహార సామగ్రి అందించొచ్చని, రక్తహీనత కలిగిన వారిని దత్తత తీసుకోవచ్చని పేర్కొన్నారు.
ఆశ్రమ పాఠశాలలో మంత్రి సందడి
సాలూరు రూరల్: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గిరిజన విద్యార్థులతో కలిసి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సందడి చేశారు. మంగళవారం రాత్రి కొత్తవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులతో కలిసి థింసా నృత్యం చేశారు. వారితో కాసేపు సంతోషంగా గడిపారు. గిరిజన విద్యార్థులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. కొత్త సంవత్సరం అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి, ఆశ్రమ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.