Share News

గ్రానైట్‌ కొండపై గద్దలు!

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:47 PM

accupied plane on granite hill! గ్రానైట్‌ నిక్షేపాలపై గద్దలు కన్నేశాయి. వేరే రాష్ట్రం నుంచి వచ్చి రహస్యంగా చూసి వెళ్లిపోయాయి. గతంలో కొంత కొల్లగొట్టినా.. ఇప్పుడు పూర్తిగా ఊడ్చేయడానికి ఉబలాటపడుతున్నాయి. నిక్షేపాలను అంచనా వేసేందుకు స్థానిక యంత్రాగానికి కనీస సమాచారం ఇవ్వకుండానే ప్రైవేటు సైన్యాన్ని దించేశాయి. ఇది తెలిసి ఆందోళన చెందుతున్న ఆదివాసీ, ప్రజాసంఘాలు అధికార యంత్రాంగాన్ని ఆశ్రయించాయి. రెవెన్యూ అధికారులు మాత్రం తమకెలాంటి సమాచారం లేదని చెబుతున్నారు.

గ్రానైట్‌ కొండపై గద్దలు!

గ్రానైట్‌ కొండపై గద్దలు!

గుట్టుగా సర్వే నిర్వహించిన వైనం

తమిళనాడు వాసులుగా గుర్తింపు

బృందంలో విజయనగరం, శ్రీకాకుళం వ్యక్తులు

గిరిజన, ఆదివాసీల్లో ఆందోళన

రెవెన్యూ అధికారికి వినతిపత్రం

గ్రానైట్‌ నిక్షేపాలపై గద్దలు కన్నేశాయి. వేరే రాష్ట్రం నుంచి వచ్చి రహస్యంగా చూసి వెళ్లిపోయాయి. గతంలో కొంత కొల్లగొట్టినా.. ఇప్పుడు పూర్తిగా ఊడ్చేయడానికి ఉబలాటపడుతున్నాయి. నిక్షేపాలను అంచనా వేసేందుకు స్థానిక యంత్రాగానికి కనీస సమాచారం ఇవ్వకుండానే ప్రైవేటు సైన్యాన్ని దించేశాయి. ఇది తెలిసి ఆందోళన చెందుతున్న ఆదివాసీ, ప్రజాసంఘాలు అధికార యంత్రాంగాన్ని ఆశ్రయించాయి. రెవెన్యూ అధికారులు మాత్రం తమకెలాంటి సమాచారం లేదని చెబుతున్నారు.

మెంటాడ, జనవరి 6((ఆంధ్రజ్యోతి):

మెంటాడ మండం కొండలింగాలవలస గ్రామ పంచాయతీ పరిధిలో బోడిమెట్ట కొండ ప్రాంతంలో అపార గ్రానైట్‌ ఖనిజ నిక్షేపాలున్నాయి. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఇవి విస్తరించి ఉన్నట్లు ప్రాథమిక అంచనా. వేలకోట్ల రూపాయల విలువైన సంపద కావడంతో కొల్లగొట్టేందుకు సుమారు పదిహేనేళ్ల క్రితంనుంచీ ఇతర ప్రాంతాలకు చెందిన ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కొందరు బడాబాబులు ఉద్దంగి గ్రామ సమీపాన కొండపై కొన్నాళ్లపాటు తవ్వాకాలు జరిపి నిక్షేపాల్లో కొంతమేర తరలించగా, తర్వాత ఏ కారణంతోనే నిలిపివేశారు. అప్పటి తవ్వకాల ఆనవాళ్లు నేటికీ నిక్షేపంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే పదిరోజుల క్రితం ఓ బృందం గుట్టుచప్పుడు కాకుండా సర్వే నిర్వహించినట్టు కొద్దిరోజుల అనంతరం స్థానిక ఆదివాసీలు, గిరిజన, ప్రజాసంఘాల ప్రతినిధులు అనుమానిస్తున్నారు. వారు సవరవిల్లి వరకూ పరిశీలించారని చెబుతున్నారు. ఆ బృందంలో తమిళనాడుకు చెందినవారితోపాటు విజయనగరం, శ్రీకాకుళానికి చెందిన వారున్నట్టు కూడా గుర్తించారు. కొండ ప్రాంతంలో పర్యటించి సర్వే చేసినట్టు నిర్ధారించుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ కొండలు పాచిపెంట మండలం సరిహద్దు వరకూ ఉన్నాయి. కొండపై నిక్షేపాల తవ్వకాలకు అనుమతి ఇస్తే కొండను ఆనుకొని ఉన్న భూములకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కలవరపడుతున్నారు. అలాగే గ్రానైట్‌ క్వారీ ప్రారంభమైతే ప్రకృతి వనరులు ధ్వంసమై స్థానికంగా నివాసముంటున్న గిరిజనులకు అన్నివిధాలా నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా ప్రైవేటు వ్యక్తులు సర్వే నిర్వహించారన్న సమాచారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. దీనివెనుక ఎవరనేది నిగ్గుతేల్చి వారికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని గిరిజన, ఆదివాసీ, ప్రజాసంఘాలు, వామపక్షాలు భావిస్తున్నాయి.

అనుమతి ఇవ్వొద్దు

కొండపై గ్రానైట్‌ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వవద్దని గిరిజనులు కోరుతున్నారు. కొండను తవ్వితే అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కొండలను అనుకుని సుమారు 150 కుటుంబాలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నాయి. తవ్వకాలు మొదలైతే తమ జీవనాధారం పూర్తిగా దెబ్బతింటుందని గిరిజనులు వాపోతున్నారు. పశువులకు మేత, తాగునీరు కరువై పోతుందని అవేదన చెందుతున్నారు. వణ్యప్రాణుల మనుగడ కూడా ప్రశ్నార్థం అవుతుందంటున్నారు. ఇక్కడి కొండల నుంచి జాలువారిన నీటితో కూనేటిగెడ్డ తదిత వాగుల ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే 500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందదని, ఆ భూములు బీడువారుతాయని రైతులు కలవర పడుతున్నారు. అంతేకాకుండా ఈ కొండను అనుకుని ఉన్న జిరాయితీ భూములకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. గ్రానైట్‌ తవ్వకాలు మొదలైతే దుమ్ము, దూళి, శబ్దకాలుష్యంతో తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని వారు ఆందోళన చెందుతున్నారు.

- గిరిజన సంఘం కార్యదర్శి టి.సోములు, సీపీఎం మండల కార్యదర్శి రాకోటి రాములు,గిరిజన ప్రతినిధులు చల్ల సత్యం, సొంట్యాన గంగరాజు తదితరుల ఆధ్వర్యంలో ఇప్పటికే తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన అడవిపుత్రులు తహసీల్దార్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌కు ఇటీవల వినతిపత్రాన్ని అందజేశారు. గ్రానైట్‌ తవ్వకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు ఆమోదయోగ్యం కాదని వారంతా తేల్చిచెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో గిరిజనులు, ప్రజా సంఘాలు కొద్దిరోజులుగా బోడిమెట్ట ప్రాంతంలో అపరిచితుల కదిలికలపై నిఘా పెట్టాయి. మొత్తమ్మీద ఎప్పుడో ముగిసిందని భావిస్తున్న గ్రానైట్‌ వ్యవహారం మళ్లీ ఇప్పుడు మొదటికే వస్తుండడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని తహసీల్దార్‌ కోరాడ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా సర్వేపై తమకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారుల సూచన మేరకు ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 11:47 PM