Share News

భోగి రోజే సంక్రాంతి

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:17 AM

Bhogi day is Sankranti ఆ గ్రామంలో భోగి పండుగ రోజునే సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు.. భోగికి దూరంగా ఉంటారు.. దశాబ్దాలుగా తాతతండ్రుల నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం నేటితరం కూడా ఇదే ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తోంది. యువత సైతం పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఆచారానికి విలువనిస్తోంది. ఈ విచిత్రమైన పద్ధతి రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో దశాబ్దాలుగా కొనసాగుతోంది.

భోగి రోజే సంక్రాంతి
అంతకాపల్లి గ్రామం

భోగి రోజే సంక్రాంతి

దశాబ్దాలుగా భోగి మంటలకు దూరం

అంతకాపల్లిలో ప్రత్యేకం

రాజాం రూరల్‌, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ఆ గ్రామంలో భోగి పండుగ రోజునే సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు.. భోగికి దూరంగా ఉంటారు.. దశాబ్దాలుగా తాతతండ్రుల నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం నేటితరం కూడా ఇదే ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తోంది. యువత సైతం పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఆచారానికి విలువనిస్తోంది. ఈ విచిత్రమైన పద్ధతి రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో దశాబ్దాలుగా కొనసాగుతోంది.

పూర్వీకుల ఆనవాయితీ ప్రకారం అంతకాపల్లి గ్రామానికి చెందిన వాకముళ్ళ ఇంటిపేరు గల కుటుంబీకులు భోగి రోజునే సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. గ్రామంలో నివాసం ఉంటున్న 70 కుటుంబాలతో పాటు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం భోగి రోజున గ్రామానికి చేరుకుని వాకముళ్ళ వారితో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ కుటుంబాలు మినహా గ్రామస్థులంతా మకర సంక్రాంతి వేడుకలను సంక్రాంతి రోజునే జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే భోగి రోజున సంక్రాంతి వేడుకలు నిర్వహించే వాకముళ్ల కుటుంబీకులు గ్రామంలోని బంధుమిత్రులకు భోగి పండుగ రోజున విందుకు ఆహ్వానిస్తారు. అలాగే సంక్రాంతి పర్వదినాన వాకముళ్ల కుటుంబీకులకు గ్రామంలోని వారి బంధుమిత్రులు విందుకు ఆహ్వానిస్తారు. ఈ పద్ధతి దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది.

భోగి మంటల్లేవ్‌..

ఇదే గ్రామంలో గ్రామస్థులంతా భోగి వేడుకలకు దూరంగా ఉంటారు. భోగభాగ్యాలనిచ్చే భోగి పండగను పల్లెలు, పట్టణం అనే తేడా లేకుండా జరుపుకోవడం దశాబ్దాలుగా వస్తున్నా ఇక్కడ మాత్రం భోగి మంటలు కనిపించవు. వాస్తవానికి పల్లెల్లో భోగి రోజున పండుగ సందడి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. భోగి పండుగకు పది రోజుల ముందే చిన్నారులు భోగి పిడకలు తయారు చేస్తారు. భోగి మంటలు వేసేందుకు కలప సేకరిస్తారు. భోగి రోజున వేకువజామున తలంటుకుని అందరూ భోగి మంటల వద్దకు చేరుకుని చిన్నా, పెద్దా ఆనందంగా గడుపుతారు. మంటల్లో భోగిపిడకలు వేస్తారు. ఇంతటి ఆహ్లాదకరమైన సందడి వాతావరణానికి అంతకాపల్లి గ్రామస్థులు కొన్ని దశాబ్దాలుగా దూరంగా ఉంటున్నారు. ఆ గ్రామంలో భోగి మంటలు వేయడం మానేసి వందేళ్లు దాటిందంటే అతిశయోక్తి కాదు. గ్రామంలో సుమారు 3వేల మంది జనాభా ఉన్నారు.

ఎందుకంటే...

వందేళ్ల క్రితం గ్రామంలో జరుపుకుంటున్న భోగి మంటల్లో పిల్లి పడి మరణించిందన్న ఒకే ఒక్క కారణంతో తదుపరి ఏడాది నుంచి గ్రామంలో భోగి వేడుకలు నిలిపివేశారు. శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా, కొత్తతరం యువత సైతం తాతతండ్రులు అనుసరించిన విధానానికి గౌరవమిస్తూ వేడుకలకు దూరంగా ఉండడం విశేషం.

తాతల నాటి నుంచే

గార తవిటినాయుడు, అంతకాపల్లి

నా వయసు 65. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా గ్రామంలో భోగి పండుగ చేసుకోవడం లేదు. మా తాతల నాటి నుంచే భోగికి దూరంగా ఉంటున్నారు. వందేళ్ల క్రితం భోగి మంటల్లో పిల్లి పడి మరణించిందట. ఆ కారణంతో జరుపుకోవడం లేదు. భోగి రోజున సంక్రాంతి నిర్వహించే వాకముళ్ల కుటుంబీకులు సైతం భోగి పండుగకు దూరమే.

Updated Date - Jan 12 , 2025 | 12:17 AM