small industries చిన్న పరిశ్రమలకు పెద్ద అండ
ABN , Publish Date - Jan 02 , 2025 | 11:32 PM
Big support for small industries ఉత్పాదక, సేవా రంగాల అభివృద్ధి ద్వారా ఆర్థిక ప్రగతిని సాధించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనతోనే ప్రగతి సాధన సాధ్యమని భావిస్తోంది. ఇందుకు ఎంఎస్‌ఎంఈల సంఖ్యను లెక్కించే పనిలో పడింది.
చిన్న పరిశ్రమలకు
పెద్ద అండ
ఆర్థికాభివృద్ధికి ఎంఎస్‌ఎంఈలే కీలకమంటున్న ప్రభుత్వం
ప్రోత్సహించే దిశగా అడుగులు
ఖాళీ భూముల గుర్తింపు
ఉత్పాదక, సేవా రంగాలపైనే దృష్టి
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో సర్వే
అందుబాటులోకి ప్రత్యేక యాప్
శృంగవరపుకోట, జనవరి2 (ఆంధ్రజ్యోతి):
- సేవల రంగం కూడా ఓ పరిశ్రమే(ఉత్పత్తి.) దానికి విస్తృత ప్రచారం కల్పించాలి. చాలా జిల్లాల్లో జీడీపీఎస్ అధికంగా వుంది. పరిశ్రమలు, సర్వీస్ రంగాల భాగస్వామ్యం బాగా ఉండటమే దీనికి కారణం. పరిశ్రమలతో పాటు సేవా రంగాన్ని ప్రోత్సహించడం తప్పనిసరి.
- డిసెంబర్ 11న జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట.
- ప్రజాప్రతినిధుల సహకారంతో ఎంఎస్‌ఎంఈ యూనిట్లను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏపీఐఐసీ కింద జిల్లాలో 9 పారిశ్రామిక వాడలున్నాయి. వీటిల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసుకొనేందుకు భూములు అందుబాటులో ఉన్నాయి. జిల్లా స్థూల ఉత్పత్తిని రూ.11.214 కోట్లకు తీసుకెళ్లేందుకు రూపొందించిన ప్రణాళికలను అమలు చేస్తాం.
- కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు కలెక్టర్ అంబేద్కర్ అన్న మాట.
ఉత్పాదక, సేవా రంగాల అభివృద్ధి ద్వారా ఆర్థిక ప్రగతిని సాధించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనతోనే ప్రగతి సాధన సాధ్యమని భావిస్తోంది. ఇందుకు ఎంఎస్‌ఎంఈల సంఖ్యను లెక్కించే పనిలో పడింది. ఈ బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఇప్పుడు తరచూ ఎంఎస్‌ఎంఈ మంత్రాన్నే జపిస్తున్నాయి. ఆర్థికాభివృద్ధి సాధనకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలే కీలకమని బలంగా నమ్ముతున్నాయి. జిల్లాలో ఈ రంగాలకు కేటాయించిన భూముల వివరాలను ఇప్పటికే గుర్తించారు. 20 సూత్రాల పథకం అమలుకు తీసుకున్న చర్యల్లోనూ పొందుపరిచారు. గత శనివారం కలెక్టర్ అడిటోరియంలో జరిగిన సమావేశంలో దీనిపైనే చర్చ జరిగింది. ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహిస్తుండంతో దీనిపై అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
జిందాల్ యాజమాన్యం వద్ద శృంగవరపుకోట మండలంలో 1100 ఎకరాలకు పైబడి స్థలం వుంది. ఇందులో పది రకాల ఉత్పాదక, సేవా రంగాలకు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉంది. అలాగే బొబ్బిలి గ్రోత్ సెంటర్, నెల్లిమర్ల ఐడీఏ, విజయనగరం ఐఈ ప్రాంతాల్లోనూ ఇండస్ట్రీయల్ పార్కులకు స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో గత ప్రభుత్వాలు పరిశ్రమల నిర్మాణానికి కేటాయించిన భూముల వివరాలను కూడా సేకరిస్తున్నారు. మూతపడిన పరిశ్రమలు, సంస్థల గురించి ఇప్పటికే నివేదికలు తయారు చేశారు. ఖాళీగా వున్న స్థలాల్లో ఏదో ఒక ఉత్పాధక, సేవారంగ పరిశ్రమ స్థాపించేందుకు జిల్లా యంత్రాంగం ఆలోచిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం 2014-2019 మధ్య రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ యూనిట్లను నెలకొల్పేందుకు అడుగులేసింది. కొత్తవలస మండలం బలిఘట్టం, రెల్లి తదితర గ్రామాల్లో భూములను కేటాయించింది. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఇవన్నీ మరుగున పడ్డాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిపై దృష్టిసారించింది.
- సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంఖ్యపై ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారం లేదు. ఉన్నవన్నీ అంచనాలే. విద్యుత్ కనక్షన్‌ల ఆధారంగా అధికారులు ఎంఎస్‌ఎంఈల సంఖ్యను అంచనా వేస్తున్నారు. వాస్తవంగా ఎంఎస్‌ఎంఈలు ఎన్ని ఉన్నాయి.. వాటి ప్రధాన సమస్యలేంటి.. వాటి పరిష్కారానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలి... ఇవన్నీ తెలుసుకొనేందుకు వీలుగా డేటా బ్యాంకు తయారు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. తొలుత ఎంఎస్‌ఎంఈలను లెక్కించేపనిలో పడింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆ బాధ్యతను అప్పగించారు. నెల రోజులుగా వీరంతా వివరాలను సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఉద్యమ్ పోర్టల్‌ను వినియోగిస్తున్నారు.
- పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వున్న సాధారణ వ్యాపార సంస్థలను ఎంఎస్‌ఎంఈ యూనిట్‌ల పరిధిలోకి తీసుకురావడంతో వీటిని కూడా లెక్కిస్తున్నారు. కిరాణా దుకాణాలు, ఫ్యాన్సీ, చికెన్, కూల్ డ్రీంక్, పండ్లు, పాల ఉత్పత్తులు, హోటల్స్, టిఫిన్, బుక్ స్టాల్, కూరగాయలు, పూలు, పుట్‌వేర్, క్లాత్, సిమెంట్, స్టీల్, మొబైల్ వంటి అన్ని రకాల రీటైల్, హోల్‌సేల్ దుకాణాలతో పాటు సేవా కార్యకలాపాలకు చెందిన మొబైల్, టీవీ, జిరాక్స్, ఇంటర్నెట్, మోటార్, పంచర్ రిపేరింగ్, మోటార్ రివైండింగ్, వెల్డింగ్ వర్కులు, షీట్ సెంటరింగ్, ఫంక్షన్‌హాల్, టెంట్ హౌస్‌లు, క్యాటరింగ్, వుడ్‌ప్లెయింగ్, స్టిక్కరింగ్ కార్యకలాపాలు, వీడియో, ఆడియో, గేమ్ దుకాణాలు, ఫొటో స్టూడియోలు, పిండిమరలు, వెట్ గ్రైండింగ్ (దోశపిండి,మసాల గ్రౌండింగ్)డిష్ నెట్ వర్కులు, టైలర్ షాపులు, బ్యూటీ పార్లర్‌లు, ఆసుపత్రులు, ఎలక్రికల్ వర్కులు తదితర వాటి వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా అవసరమైన సంస్థలకు స్టాండప్ ఇండియా, సీజీటీఎంఎస్‌ఈ, పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ, ముద్ర, పీఎం విశ్వకర్మ పథకాల కింద రుణం అందుతుంది.
ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి అందుబాటులో భూములు
------------------------------------------------------------------------
గ్రామం యూనిట్ భూమి (ఎకరాల్లో)
-----------------------------------------------------------------------
చినరావుపల్లి 1 172.84
కంటికాపల్లి 12 320.83
మరుపల్లి 2 80.00
కొంగవానిపాలెం 2 11.83
నెల్లిమర్ల 1 71.41
---------------------------------------------------