new life:వికాసం.. ఉత్సాహం.. అదే కొత్త జీవితం
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:35 AM
new life:నలభై ఏళ్లు దాటిన తరువాతే అసలైన జీవితం మొదలవుతుంది. జీవితం అంటే ఏంటో తెలిసేది ఇక్కడినుంచే. అద్భుతమైన వరం ప్రకృతి. దాని నుంచి నేర్చుకునే ఉత్సాహం ఉండాలే గాని ఎన్నటికీ తరగని పాఠాలు నేర్చుకోవచ్చును.
- నిజాయితీగా ముందుకుపోతే విజయం మీదే
- కుటుంబం, సంప్రదాయాలకు ప్రాధాన్యతనివ్వాలి
-ఇతరులను గౌరవించాలి
-కొత్త ఏడాది నుంచే ప్రారంభించండి
రాజాం రూరల్, డిసెంబరు31 (ఆంధ్రజ్యోతి): నలభై ఏళ్లు దాటిన తరువాతే అసలైన జీవితం మొదలవుతుంది. జీవితం అంటే ఏంటో తెలిసేది ఇక్కడినుంచే. అద్భుతమైన వరం ప్రకృతి. దాని నుంచి నేర్చుకునే ఉత్సాహం ఉండాలే గాని ఎన్నటికీ తరగని పాఠాలు నేర్చుకోవచ్చును. కొత్త విషయాలను ఆస్వాదించవచ్చును. పోటీ ప్రపంచంలో లక్ష్యసాధనలో ముందుకు సాగవచ్చును. రేపటిపై ఆశతో భవిష్యత్తుకో కొత్తరూపం ఇవ్చొచ్చును. నిరాశకు ఆస్కారం లేకుండా, నిజాయితీగా ముందుకుపోతే. విజయం మీ ముంగిట నిలుస్తుంది. మనిషి మనిషిగా బతకాలంటే.. మానవత్వం చాటాలంటే.. మంచి భర్తగా.. తండ్రిగా.. స్నేహితుడిగా. గురువుగా.. యజమానిగా.. నిలవాలంటే కాస్త మనసుపెడితే చాలు. అనుకున్నది ఆచరిస్తే మేలు. ఆదర్శంగా నిలబడితే చాలు.
నిత్య ఉషోదయం..
సూర్యుడు ఎంత ప్రశాంతంగా ఉదయిస్తాడో, అంతే ప్రశాంతంగా అస్తమిస్తాడు. మధ్యలో చంఢ ప్రచంఢంగా వెలగుతాడు.. మన జీవితమూ అంతే.. సూర్యోదయాన్ని కళ్లారా చూస్తే స్ఫూర్తి పొందవచ్చును.
జీవితం..
జీవితం అంటే ఇష్టారాజ్యంగా వెళ్లడం కాదు. దానికో పద్ధతి ఉంది. అవేమిటో ముందు తెలుసుకోవాలి. క్రమశిౄక్షణ పాటించాలి. ముందు వెనుకలు ఆలోచించాలి. కుటుంబం, సంప్రదాయం, నైతికతకు ప్రాధాన్యతనివ్వాలి.
నిజాయితీగా..
ఎవరూ వేళెత్తి చూపని విధంగా జీవించడానికి ప్రాధాన్యతనివ్వండి. అందుకోసం ప్రారంభం నుంచే ప్రణాళికతో ముందుకు సాగండి. పనికిరాని ఆరోపణలను పక్కన పెట్టండి. అనవసరమైన వాటి జోలికి పోకండి. జీవితం చివరి అంకంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆపాత మధురాన్ని మనసారా ఆస్వాధించవచ్చును.
మార్పు..
జీవితం నేర్పేది ఇదే. ఎలాంటి మార్పునైనా స్వీకరించగలగాలి. అప్పుడే మానసికంగా మనం ఎదిగినట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ విలువలకు తిలోదకాలివ్వొద్దు. జీవితంలో మార్పు ఎంతో అవసరమన్న విషయాన్ని విస్మరించకూడదు.
నాయకత్వం..
పుట్టుకతో వచ్చేది కాదిది. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. మనమే ఎదగాలి. మనల్ని మనం ముందు గౌరవించుకోవాలి. ఇతరులను గౌరవించాలి. చేసే పనిలో మంచైనా, చెడైనా స్వీకరించగలగాలి. ఆ ధైర్యం సాధించాలి.
విజయం..
ఎప్పుడూ తిన్నగా రాదు. ఆమార్గంలో పూలే కాదు.. రాళ్లూ ఉంటాయి. అష్ట వంకర్లుంటాయి. ఎగుడు దిగుడులూ ఉంటాయి. ప్రతి విజయాన్ని గొప్పపాఠంగా మలచుకుంటే అంతకన్నా ఏముంది జీవితానికి. విజయంసాధిస్తే అదృష్టం అని సరిపెట్టుకోవడం కన్నా పెద్ద మూర్ఖత్వం లేదు. దానివెనుక ఉన్న అమోఘమైన కృషిని గుర్తించాలి.
ఈరోజు నుంచే ప్రయత్నించండి
కొత్త సంవత్సరం (ఈరోజు) నుంచే నుంచే మీరు మారేందుకు ప్రయత్నం ప్రారంభించండి. ఫలితాలు ప్రారంభంలో కనిపించవు. అయినా ఓపికతో ముందుకు సాగండి. వచ్చే మార్పును కొన్నాళ్ల తరువాత మీరే తెలుసుకుంటారు.