బడ్జెట్ లెక్కలపై సభ్యుల అసంతృప్తి
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:16 AM
స్థానిక మున్సిపల్ కార్యాల యంలో చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది.
బొబ్బిలి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపల్ కార్యాల యంలో చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. ముందుగా దివంగత నేత, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు, వైసీపీకి చెందిన వైస్‌చైర్మన్ చెలికాని మురళీకృష్ణ, టీడీపీ ఫ్లోర్‌లీడరు గెంబలి శ్రీనివాసరావు, ఒకటో వార్డు కౌన్సిలరు చోడిగంజి రమేష్ నాయుడు తదితరులు బడ్జెట్‌లో చూపిన లెక్కలపై అధికారులను ప్రశ్నించారు. అధికారులు చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో వారంతా అసహనానికి గురయ్యారు. గజిబిజి లెక్కలతో గందరగోళానికి గురిచేయకుండా పౌర సేవలు సక్రమంగా అందేలా చూడాలని కోరారు.
ఆక్రమణలు తొలగించాలి
బొబ్బిలి పట్టణంలో ఆక్రమణలు, ట్రాఫిక్ సమస్యపై వైస్‌చైర్‌పర్సన్ గొలగాని రమాదేవి ప్రశ్నించారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ సంకాంత్రి పండుగ దాటిన వెంటనే పట్టణంలో అన్ని రకాల ఆక్రమణలను యుద్ధప్రాతిపదికన తొలగించాలని కమిషనర్‌ను ఆదేశించారు. మున్సిపాల్టీ పరిధిలో ఏర్పాటు చేయనున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్లపై కౌన్సిల్ సభ్యులు అడిగిన ప్రశ్నకు కమిషనర్ లాలం రామలక్ష్మి, డీఈఈ కిరణ్ తదితరులు బదులిచ్చారు. పట్టణానికి మొత్తం 8 శుద్ధి ప్లాంట్లు మంజూరయ్యాయని, వీటికి స్థలాల కేటాయింపు బాధ్యత పూర్తిగా రెవెన్యూ శాఖదేనని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ డీఈ కిరణ్, ఏఈ గుప్త, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.