Share News

Water Scarcity తాగునీటికి కటకట

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:17 AM

Drinking Water Scarcity వీరఘట్టం మేజర్‌ పంచాయతీలో తాగునీటి ఎద్దడి నెలకొంది. పూర్తిస్థాయిలో నీరు అందకపోవడంతో శీతాకాలంలోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు పార్వతీపురం జిల్లా కేంద్రం.. ఇటు పాలకొండ నియోజవర్గానికి అతి సమీపంలో ఈ పంచాయతీ ఉన్నా.. సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పనులను పూర్తి చేయించలేకపోయింది. దీంతో ఆ ప్రాంతవాసులు తాగునీటికి కటకటలాడుతున్నారు.

Water Scarcity  తాగునీటికి కటకట
వీరఘట్టంలో రక్షిత నీటి పథకం ట్యాంక్‌

  • బిందెడు నీటి కోసం తిప్పలు.. వేసవిలో రెట్టింపవుతున్న బాధలు

  • గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పూర్తికాని జేజేఎం పనులు

  • కూటమిపైనే ఆశలు

వీరఘట్టం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): వీరఘట్టం మేజర్‌ పంచాయతీలో తాగునీటి ఎద్దడి నెలకొంది. పూర్తిస్థాయిలో నీరు అందకపోవడంతో శీతాకాలంలోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు పార్వతీపురం జిల్లా కేంద్రం.. ఇటు పాలకొండ నియోజవర్గానికి అతి సమీపంలో ఈ పంచాయతీ ఉన్నా.. సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పనులను పూర్తి చేయించలేకపోయింది. దీంతో ఆ ప్రాంతవాసులు తాగునీటికి కటకటలాడుతున్నారు. వేసవిలో వారి బాధలు రెట్టింపవు తున్నాయి. బిందెడు నీటి కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతవాసులంతా కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. రానున్న వేసవిలో తాగునీటి ఇక్కట్లు లేకుండా చూడాలని కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

వీరఘట్టంలో 14,315 మంది నివసిస్తున్నారు. 3,586 కుటుంబాలకు తాగునీరు అందించేందుకు గాను గ్రామ సమీపంలోని 400 కేఎల్‌ సామర్థ్యంతో అప్పట్లో రక్షిత నీటి పథకం నిర్మించారు. ఒట్టిగెడ్డ వద్ద మోటార్లు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టారు. అయితే కాలక్రమంలో గ్రామంలో జనాభా పెరుగుతున్నప్పటికీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయలేదు. దీంతో శివారు ప్రాంతాల్లో ఉన్న ప్ర‘జల’కు కష్టాలు తప్పడం లేదు. ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జేజేఎం కింద ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేయలేదు. మరోవైపు నిధులు కూడా వెనక్కి మళ్లిపోయాయి. దీంతో ఆ పనులకు బ్రేక్‌ పడింది. ఇటీవల 40 కేఎల్‌ సామర్థ్యంతో రక్షిత నీటి పథకం నిర్మించినా పైప్‌లైన్‌ పనులు పూర్తి కాకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా వేసవితో పాటు అన్ని కాలాల్లోనూ ఆ గ్రామస్థులు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరఘట్టం శివారున ఉన్న డౌన్‌ స్ర్టీట్‌, కస్పావీధి, కూరాకులవీఽధిలో 500 కుటుంబాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదు. గంటల కొద్దీ నిరీక్షించినా ప్రయో జనం దక్కడం లేదు. రోజుకు ఒక బిందె నీరు మాత్రమే పట్టి పొదుపుగా వాడాల్సిన పరిస్థితి నెలకొంది. వారికి పూర్తిస్థాయిలో తాగునీరు అందాలంటే 200 కేఎల్‌ సామర్థ్యంతో మరో రక్షిత నీటి పథకం నిర్మించాల్సిన అవసరం ఉంది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రతిపాదనలు పంపిస్తాం..

గ్రామానికి సరిపడా తాగునీరు అందాలంటే మరొక వాటర్‌ ట్యాంక్‌ నిర్మించాల్సిన అవసరం ఉంది. 200 కేఎల్‌ సామర్థ్యం రక్షిత నీటి పథకం నిర్మిస్తే శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపిస్తాం.

- కావ్యశ్రీ, జేఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌

Updated Date - Jan 06 , 2025 | 12:17 AM