education department విద్యాశాఖ వినూత్న బాట
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:41 PM
Education is an innovative path పాఠశాల విద్యాశాఖపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ప్రజాపయోగంగా ఉండి వైసీపీ నిలిపివేసిన పథకాలను పునరుద్ధరిస్తోంది. ఇటీవలే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో 15 వేల మంది గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది.
విద్యాశాఖ వినూత్న బాట
మార్పులకు దిగిన కూటమి ప్రభుత్వం
మొన్న ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
నిన్న బడి రవాణా పథకం పునరుద్ధరణ
జిల్లాకు రూ.94.56 లక్షలు విడుదల
విజయనగరం, జనవరి7(ఆంధ్రజ్యోతి):
పాఠశాల విద్యాశాఖపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ప్రజాపయోగంగా ఉండి వైసీపీ నిలిపివేసిన పథకాలను పునరుద్ధరిస్తోంది. ఇటీవలే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో 15 వేల మంది గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. తాజాగా బడి రవాణా పథకాన్ని పునరుద్ధరించింది. సాధారణంగా కిలోమీటరు లోపు ప్రాథమిక, మూడు కిలోమీటర్లలోపు ప్రాథమికోన్నత, ఐదు కిలోమీటర్లలోపు ఉన్నత పాఠశాల ఉండాలి. ఈ పరిధి దాటితే ఒక్కో విద్యార్థికి రూ.300ను రవాణా చార్జీలు అందించేవారు. మరీ దూరం ఎక్కువగా ఉన్నవారికి రూ.600 అందించాలి. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకానికి మంగళం పలికారు. కూటమి అధికారంలోకి రావడంతో బడి రవాణా పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 1576 మంది విద్యార్థులకు రూ.94.56 లక్షలు మంజూరు చేసింది.
గతంలో 18 వేల సైకిళ్లు మంజూరు
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018-19 విద్యాసంవత్సరంలో ఈ పథకం కింద జిల్లాలో 18వేల మంది విద్యార్థులకు సైకిళ్లను అందించారు. ఈ సైకిళ్ల పంపిణీని సైతం వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఎన్నికల ముంగిట అందిస్తామని సన్నాహాలు చేసింది. కానీ అందించలేకపోయింది. చాలా ఎమ్మార్సీల్లో ఈ సైకిళ్లు మూలనపడి ఉన్నాయి. ఇదే సమయంలో ఊరుకు బడి దూరం కావడంతో డ్రాపౌట్స్ పెరిగారు. బడిఈడు పిల్లలు 6,259 మంది పాఠశాలకు దూరంగా ఉన్నట్టు సమగ్ర శిక్ష సర్వేలో సైతం తేలింది. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టిపెట్టింది. బడి రవాణా పథకానికి నేరుగా నిధులు జమచేసింది.
విలీనంతో చాలా అన్యాయం
జిల్లా వ్యాప్తంగా 340 పాఠశాలలను పక్కా స్కూళ్లలో విలీనం చేసి చాలా గ్రామాల ప్రజలకు అన్యాయం చేశారు. తరగతుల విలీనం పుణ్యమా అని వందలాది పాఠశాలల్లో 10 మంది లోపే విద్యార్థులున్నారు. మూడో తరగతికి వస్తే మరో పాఠశాలలో చేర్చాల్సి ఉండడంతో తల్లిదండ్రులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రైవేటు బడుల వైపు మొగ్గుచూపారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు ఖాళీగా కనిపించాయి. ఈ పరిస్థితిని మార్చాలని, ప్రాథమికోన్నత పాఠశాలలను కొనసాగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
స్కూల్ కాంప్లెక్సుల బలోపేతం
గతంలో మాదిరిగా స్కూల్ కాంప్లెక్స్‌లను మరింత బలోపేతం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో స్కూల్ కాంప్లెక్స్‌లో 50 మంది ఉపాధ్యాయులు ఉండేలా చేయనున్నారు. ఇప్పటివరకూ ప్రతి మండలంలో 10 నుంచి 12 వరకూ స్కూల్ కాంప్లెక్సులుండేవి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వాటి సంఖ్య సగానికి తగ్గే అవకాశం ఉంది. నిర్దేశిత సంఖ్యలో ఉపాధ్యాయులు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరైతే బోధన, ఇతరత్రా అంశాలకు ఆటంకం ఉండదు. గత ఐదేళ్లలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు తూతూమంత్రంగా జరిగాయి. అటు పాఠశాలలపై హెచ్‌ఎంల పర్యవేక్షణ కూడా తగ్గింది. దీంతో విద్యాబోధన, పరీక్ష ఫలితాలపై ప్రభావం చూపింది. అందుకే తిరిగి హెచ్‌ఎంలకే పర్యవేక్షక బాధ్యతలు అప్పగించనున్నారు.
నిధులు మంజూరు
బడికి రవాణా పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రతిపాదనల మేరకు నేరుగా తల్లిదండ్రుల ఖాతాకే నిధులు జమయ్యాయి. ఈ పథకంతో తల్లిదండులకు ఆర్థిక భారం తగ్గుతుంది. చిన్నారుల్లో ప్రేరణ కలుగుతుంది. చదువుకుంటే ఎన్నిప్రయోజనాలో వారికి పాఠశాల వయసు నుంచే తెలుస్తుంది.
- యు.మాణిక్యంనాయుడు, డీఈవో, విజయనగరం
------------------------