పెదకుదమ వైపు గజరాజులు
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:08 AM
మండలంలోని సుంకి, సంతోషపురం పంచాయతీల్లో సంచరించిన గజరాజుల గుంపు గురువారం జియ్యమ్మవలస మండలం పెదకుదమ వైపు పయనమయ్యాయి.
గరుగుబిల్లి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సుంకి, సంతోషపురం పంచాయతీల్లో సంచరించిన గజరాజుల గుంపు గురువారం జియ్యమ్మవలస మండలం పెదకుదమ వైపు పయనమయ్యాయి. గత పది రోజులకు పైగా సుంకి పరిధిలో అధికంగా వరి, అరటి, పామాయిల్ పంటలతో పాటు టీ దుకాణాలు, వ్యవసాయ మోటార్లు, పైపులను ధ్వంసం చేశాయి. గజరాజుల గుంపు సంచారంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. ఏనుగుల సంచారంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత కొద్ది రోజుల కిందట జియ్యమ్మవలస మండలం చినకుదమ, పెదకుమద గ్రామాల్లో సంచరించి తదుపరి గిజబ, నందివానివలస మీదుగా సంతోషపురం, సుంకి ప్రాంతాల్లో సంచరించి రైతులను హడలెత్తించాయి. తిరిగి ఈ ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతుల్లో దిగులు నెలకొంది. గజరాజులు కారణంగా నష్టం వాటిల్లిన పంటలకు ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.