Share News

new year నూతనోత్సాహం

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:38 PM

happy new year కొత్త సంవత్సరం తొలి రోజున జిల్లా ప్రజలు కొత్తగా గడిపేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులకు బహుమతులు, స్వీట్లు ఇవ్వడంతో పాటు ఆలయాలకు క్యూ కట్టారు.

new year నూతనోత్సాహం
అర్ధరాత్రి తర్వాత విజయనగర వాసుల కేరింత

నూతనోత్సాహం

పిల్లల నుంచి పెద్దల వరకు శుభాకాంక్షల వెల్లువ

అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు క్యూ

స్వీట్లు, పూల బొకేలు, మొక్కలకు డిమాండ్‌

ఆలయాలకు పోటెత్తిన జనం

విజయనగరం/ కలెక్టరేట్‌, జనవరి 1(ఆంరఽధజ్యోతి):

కొత్త సంవత్సరం తొలి రోజున జిల్లా ప్రజలు కొత్తగా గడిపేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులకు బహుమతులు, స్వీట్లు ఇవ్వడంతో పాటు ఆలయాలకు క్యూ కట్టారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లు కోలాహలంగా మారిపోయాయి. స్వీట్లు, పూల బొకేలు, మొక్కలకు చాలా డిమాండ్‌ ఏర్పడింది. వాటిని ధర పెంచి విక్రయించడం కనిపించింది. పిల్లలు రోజంతా సందడి చేశారు. గ్రీటింగ్‌ కార్డులు అందజేస్తూ స్వీట్లు, చాక్‌లైట్లు, బిస్కెట్లు పంచుకున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఇల్లు, క్యాంప్‌ కార్యాలయం నేతలు, నాయకులు, ప్రజలతో నిండిపోయాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపేందుకు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. వారు పెన్నులు, పుస్తకాలు, మొక్కలు అందజేశారు. కలెక్టర్‌ అంబేడ్కర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు అధికారులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో రావడం కనిపించింది. ఎస్పీ కార్యాలయం కూడా కళకళలాడింది. ఎస్పీ వకుల్‌జిందాల్‌, ఏఎస్‌పీలు నాగేశ్వరరావు, సౌమ్యలతకు పోలీసు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని పైడిమాంబ దేవాలయం, ఎస్‌.కోట దుర్గాదేవి ఆలయం, బొబ్బిలి వేణుగోపాలస్వామి, రామతీర్థంలోని రాములోరి ఆలయాన్ని భక్తులు విశేషంగా సందర్శించారు.

నిబంధనలు పట్టని 184 మందిపై కేసులు

విజయనగరం క్రైం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పే క్రమంలో మంగళవారం రాత్రి నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. జిల్లా అంతటా ఎక్కడికక్కడ పోలీసు పికెట్‌ ఏర్పాటు చేయడంతో పాటు వాహన తనిఖీలు చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై 42 కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై 5 కేసులు నమోదు చేశారు. జిల్లా మొత్తంగా మోటారు వాహనం చట్టం అతిక్రమించిన వారిపై 184 కేసులు నమోదు చేశారు. గుర్ల పోలీసు స్టేషన్‌ పరిధిలోని దత్త ఎస్టేట్‌లో పేకాటడుతున్నట్టు అందిన సమాచారంతో పోలీసులు రైడ్‌ చేసి పేకాటాడుతున్న 32 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 22 సెల్‌ఫోన్లు, 4 కార్లు, పది మోటారు సైకిళ్లు , లక్షా 82 వేల 744 స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వకుల్‌జిందాల్‌ తెలిపారు.

ఫుల్‌గా తాగేశారు

రూ 14.3 కోట్ల మద్యం విక్రయాలు

విజయనగరం క్రైం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబరు 31న రూ.14.3 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాకు నెల్లిమర్లలోని ఐఎంఎల్‌ డిపో నుంచి మద్యం సరఫరా అయింది. 177 మద్యం షాపులు, 28 బార్లలో 25,700 కేసుల మద్యం బాటిళ్లు విక్రయాలు జరిగాయి. తద్వారా రూ.14.3 కోట్ల లావాదేవీలు జరిగినట్లయింది. గత ఏడాది 19 వేల మద్యం బాటిళ్ల ద్వారా రూ.13.5 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది భారీగానే మద్యం విక్రయాలు జరిగాయని డిపో మేనేజర్‌ గౌరీశ్వరరావు తెలిపారు.

Updated Date - Jan 01 , 2025 | 11:38 PM