Share News

organic products: ఆర్గానిక్‌ ఉత్పత్తులతో ఆరోగ్యం

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:07 AM

organic products: ఆర్గానిక్‌ ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు.

 organic products: ఆర్గానిక్‌ ఉత్పత్తులతో  ఆరోగ్యం
ఆర్గానిక్‌ ఉత్పత్తులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

విజయనగరం, కలెక్టరేట్‌ జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఆర్గానిక్‌ ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు పండించిన ఆర్గానిక్‌ ఉత్పత్తులను శుక్రవారం కలెక్టరేట్‌ ఆడిటోరియం వద్ద ప్రదర్శించారు. వీటిని జేసీ సేతు మాధవన్‌తో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? ఎంత పెట్టుబడి పెడుతున్నారు? ఎంత లాభం వస్తుంది? సమస్యలేమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే జిల్లాలో 12 వేల ఎకరాల్లో ఆర్గ్గానిక్‌ పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. సాగు విస్తీర్ణం పెంచడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ తారాక రామారావు, తదితరులు పాల్గొన్నారు.


దరఖాస్తులను ఆడిట్‌ చేయాలి

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తునూ డిప్యూటీ కలెక్టర్లు ఆడిట్‌ చేయాలని కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి లైన్‌ డిప్యూటీ కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘రెవెన్యూ సదస్సుల్లో 6,846 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 2,776 దరఖాస్తులను ఇప్పటికే తహసీల్దార్లు పరిష్కరించారు. వాటిని కూడా డిప్యూటీ కలెక్టర్లు ఆడిట్‌ చేయాలి. గ్రామాల్లో అర్జీదారులను పిలిపించి వారు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం లభించాలి. ఈ దరఖాస్తులను పరిష్కరిస్తే దాదాపు జిల్లాలో రెవెన్యూ సమస్యలు ఉండవు. కోర్టుల నుంచి ప్రత్యేకంగా ఏమైనా ఆదేశాలు ఉన్నవి మినహా, వివాదాలు ఉన్న భూముల సమస్యలను కూడా పరిష్కరించవచ్చు.’ అని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీవోలు పాల్గొన్నారు.


20 నుంచి కుష్ఠుపై అవగాహన కార్యక్రమాలు..

ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 2 వరకూ 14 రోజుల పాటు కుష్ఠు వ్యాఽధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. శుక్రవారం తన చాంబర్‌లో లెప్రసీ అవగాహన కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. శరీరంపై స్పర్శలేని మచ్చలు, రాగి రంగు మచ్చలు, కాళ్లు లేదా చేతుల కండరాల్లో బలహీనత, పాదాలు, నరాల్లో తిమ్మిర్లు, తదితర లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి జీవన్‌రాణి పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:07 AM