‘తారకరామ’పైనే ఆశలు
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:23 AM
Hopes are on 'Tarakarama' తారకరామతీర్థ సాగర్.. జిల్లాలో వేలాది ఎకరాల్లో సాగు... విజయనగరం, వందలాది గ్రామాల తాగునీటి అవసరాలు తీర్చగలిగే ప్రాజెక్టు ఇది. అపర భగీరఽథిగా నిలుస్తుందని ప్రజలంతా కలలు కన్నారు. ఏటా పనుల కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తూ వస్తున్నారు.
‘తారకరామ’పైనే ఆశలు
దశాబ్దాలుగా కలగా మిగిలిన ప్రాజెక్టు
గత ఐదేళ్లూ పూర్తి నిర్లక్ష్యం
ఏటా బడ్జెట్‌లో కేటాయింపులే తప్ప మంజూరు లేకపోయె
ప్రత్యేకంగా దృష్టిపెట్టిన కూటమి ప్రభుత్వం
తారకరామతీర్థ సాగర్.. జిల్లాలో వేలాది ఎకరాల్లో సాగు... విజయనగరం, వందలాది గ్రామాల తాగునీటి అవసరాలు తీర్చగలిగే ప్రాజెక్టు ఇది. అపర భగీరఽథిగా నిలుస్తుందని ప్రజలంతా కలలు కన్నారు. ఏటా పనుల కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తూ వస్తున్నారు. వైసీపీ పాలనలో బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప నిధుల కేటాయింపు లేదు. దీంతో ప్రగతి పడకేసింది. కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా అంచెలంచెలుగా ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలన్న సంకల్పంతో ఉంది. నిర్వాసితులకు పునరావాసంతో పాటు ప్రాజెక్టు నిర్మాణ పనులు జరిపించడానికి శరవేగంగా పావులు కదుపుతోంది. యంత్రాంగం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది.
నెల్లిమర్ల, జనవరి5 (ఆంరఽధజ్యోతి):
నెలిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 49 రెవెన్యూ గ్రామాల్లో 24,710 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నది తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. 2014లో టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించి పనులను శరవేగంగా జరిపించింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఐదేళ్ల పాటు నిర్లక్ష్యం చేసింది. దీంతో పనులు నత్తనడకన సాగాయి. ఇప్పటివరకూ కేవలం 44 శాతం పనులు పూర్తయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. బ్యారేజీకి సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయి. డైవర్షన్ కెనాల్స్, టెన్నల్ పనులు 50, జలాశయం పనులు 55, కెనాల్స్ పనులు 80 శాతం పూర్తయ్యాయి. అయితే గత ఐదేళ్లలో బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. తీరా విడుదలకు వచ్చేసరికి మొండిచేయి చూపారు. 2019-20లో రూ.41 కోట్లు కేటాయించారు. కేవలం రూ.5.63 కోట్లు మాత్రమే విడుదల చేశారు. 2021లో రూ.80 కోట్లకుగాను రూ.23.57 కోట్లు, 2022లో రూ.201 కోట్లకుగాను రూ.28.49 కోట్లు, 2023లో రూ.124.50 కోట్లకుగాను రూ.2.76 కోట్లు, 2024లో 30.27 కోట్లకుగాను రూ.16.58 కోట్లు విడుదల చేశారు.
ఇంకా ఎన్నాళ్లో..
2008లో పూర్తికావాల్సిన ప్రాజెక్టు ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియడం లేదు. 2005లో దివంగత రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.220 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. 2008 నాటికి పనులు పూర్తిచేస్తామన్నారు. అప్పటినుంచి పనులు ఆగుతూ.. సాగుతూ వస్తున్నాయి. పునరావాసం, పరిహారం సమస్యలు వెంటాడుతున్నాయి. మొత్తం ప్రాజెక్టుకుగాను రూ.281 కోట్లు కేటాయించగా.. అందులో భూసేకరణకే రూ.201 కోట్లు ఖర్చుచేశారు. మిగతా రూ.80 కోట్లతో పనులు జరిపారు. గత ఏడాది నాబార్డు నిధులు రూ.194 కోట్లు మంజూరుకావడంతో పెండింగ్ పనులు చేపడుతూ వచ్చారు. ఈ ఏడాది బడ్జెట్ లో రూ.50 కోట్లు కేటాయించినా.. నిధుల మంజూరులో ఆశించిన పురోగతి లేదు. ఇది పనులపై ప్రభావం చూపుతోంది.
లక్ష్యం ఇదే..
ప్రాజెక్టు పూర్తయితే పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లోని 49 గ్రామాల పరిధిలో 24,710 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఇందులో కుమిలి చెరువు కింద ఉన్న 8,172 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని స్థిరీకరించవచ్చు. అదనంగా మరో 16,538 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మూడు మండలాల్లో తాగునీటి అవసరాలకు 0.162 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. అలాగే విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని సాగునీటి అవసరాలకు మరో 0.48 టీఎంసీల నీటిని తరలించవచ్చు. అసలు విజయనగరంలో తాగునీటి ఇక్కట్లు లేకుండా చూడవచ్చు.
చేయాల్సిన పనులివే..
పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. ఏటీ అగ్రహారం, పడాలపేట, కోరాడపేట గ్రామాల్లో నిర్వాసితులకు పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించాల్సి ఉంది. ప్రాజెక్టుకు 3,446 ఎకరాల భూమి అవసరం ఉండగా.. ఇప్పటివరకూ 3,243 ఎకరాలను సేకరించగలిగారు. చంపావతినదిపై ఆనందపురం వద్ద నిర్మించిన బ్యారేజీ నుంచి కుమిలి వద్ద నిర్మించే జలాశయానికి నీరు తరలించేందుకు డైవర్షన్ కాలువ నిర్మాణం చేపట్టాలి. నెల్లిమర్ల మండలం గొల్లపేట వద్ద కొండలను తొలచి కాలువను నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఆర్ పేట వద్ద టెన్నల్ పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలో 9 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రత్యేకంగా స్లూయిజ్, తూములు నిర్మించాల్సి ఉంది. కుమిలి చెరువు కింద 3500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలంటే తూమును తప్పకుండా నిర్మించాలి. కుమిలి జలాశాయం నిర్మాణ పనులు దాదాపు 50 శాతం పెండింగ్‌లోనే ఉన్నాయి. జలాశయం చుట్టూ 9 కిలోమీటర్ల మేర మట్టికట్ట పనులు చేపడుతున్నారు. నాలుగు కిలోమీటర్ల మేర రాతిపేర్పుడు పనులు పూర్తయ్యాయి. ఇంకా ఐదు కిలొమీటర్ల మేర చేపట్టాల్సి ఉంది. ఆనందపురం వద్ద 2.70 టీఎంసీల నీటి ప్రవాహానికి బ్యారేజీ నిర్మాణం చేపడుతున్నారు. 13 తలుపులకుగాను మూడు మాత్రమే ఏర్పాటుచేశారు. మిగతావి ఏర్పాటు చేయాల్సి ఉంది.