fecelites in schools అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
ABN , Publish Date - Jan 21 , 2025 | 11:48 PM
Infrastructure in all schools
అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
నాలుగేళ్లలో రూ.1450 కోట్లతో పనులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అభివృద్ధి
గురుకులాల సొసైటీ కార్యదర్శి, సమగ్ర శిక్ష డైరెక్టర్ మస్తానయ్య
బొబ్బిలి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి):
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ఏపీ గురుకుల పాఠశాలల సొసైటీ ఇన్‌చార్జి కార్యదర్శి, రాష్ట్ర సమగ్ర శిక్ష డైరెక్టర్ వీఎన్ మస్తానయ్య తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పీఎంశ్రీ పథకానికి 855 పాఠశాలలు ఎంపిక చేసినట్లు చెప్పారు. బొబ్బిలి బాలుర గురుకుల పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. గురుకులంలో రూ.15.5 లక్షలతో నిర్మించిన కెమిస్ర్టీ ల్యాబ్ భవనాన్ని, రూ.5 లక్షలతో జరుగుతున్న ప్లేగ్రౌండ్ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 శాతం వాటాధనంతో నాలుగేళ్ల పాటు రూ.1450 కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాయన్నారు. ఇప్పటికే పనులు మొదలైనట్లు చెప్పారు. పీఎంశ్రీ నిధులతో లేబరేటరీస్, అందులో పరికరాలు, ర్యాంపులు, లైబ్రరీలు తదితర వాటిని సమకూర్చుతున్నామన్నారు. గత ఏడాది రూ.177 కోట్లు, ఈ ఏడాది రూ.450 కోట్లు మంజూరయ్యాయన్నారు. గురుకులాల్లో ఖాళీగా ఉన్న 194 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. 14 ప్రిన్సిపాల్ పోస్టులు, 53 పీజీటీ, 120 టీజీటీ, మూడు పీఈటీ పోస్టుల కోసం ప్రతిపాదనలు పంపామని, వచ్చే విద్యాసంవత్సరానికల్లా భర్తీ అయ్యే అవకాశం ఉందన్నారు. తొలుత విద్యార్థుల సిక్ రూమ్‌ను చూసి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు సౌకర్యంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సుమారు 12.50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ గురుకులానికి 40 ఏళ్లు దాటినా ప్రహరీ లేని విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా నిర్మాణం కోసం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ రఘునాథ్, సమగ్ర శిక్ష ఏఈ కిశోర్‌కుమార్, గురుకుల సిబ్బంది ఉన్నారు.