Share News

Loan Borrowers మూడు లక్షలకు పైబడే రుణగ్రస్థులు

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:39 AM

Loan Borrowers Exceeding Three Lakhs జిల్లావాసుల్లో అత్యధికలు రుణ భారంతో సతమత మవుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు.. పిల్లల చదువులు, వ్యవసాయం తదితర అవసరాల కోసం మరికొందరు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. తలకు మించిన అప్పులతో రుణగ్రస్థులుగా మారుతున్నారు.

 Loan Borrowers  మూడు లక్షలకు పైబడే రుణగ్రస్థులు

పిల్లల చదువు కోసం కొందరు..

వ్యవసాయ పెట్టుబడులు, ఇతరత్రా అవసరాలకు మరికొందరు

ఈఎంఐలతో తిప్పలు.. తిరిగి చెల్లించలేక అవస్థలు

పార్వతీపురం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లావాసుల్లో అత్యధికలు రుణ భారంతో సతమత మవుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు.. పిల్లల చదువులు, వ్యవసాయం తదితర అవసరాల కోసం మరికొందరు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. తలకు మించిన అప్పులతో రుణగ్రస్థులుగా మారుతున్నారు. అయితే గతంతో పోలిస్తే ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద రుణాల తీసుకునే వారి సంఖ్య బాగా తగ్గింది. బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుండడంతో జిల్లావాసులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. ఆస్తులను ష్యూరిటీగా పెట్టి కొంతమంది.. బంగారు ఆభరణాలను కుదవ పెట్టి మరికొంతమంది రుణాలు పొందుతున్నారు. అయితే అవసవరాల కోసం అప్పులు చేస్తున్న వారు తిరిగి చెల్లించే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యలు.. ఆదాయం పెరగకపోవడం.. పంట నష్టాలను చవిచూడడం తదితర కారణాలతో సకాలంలో ఈఎంఐలను చెల్లించలేకపోతున్నారు. ఇదే సమయంలో వారిపై అధిక వడ్డీభారం కూడా పడుతోంది. కారణాలు ఏమైనా జిల్లాలోని సుమారు మూడు లక్షల పైబడి ప్రజలు అప్పుల ఊబిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

పిల్లల చదువు కోసం ...

పిల్లల ఉన్నత విద్య రుణాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులే కాదు సామాన్య, మధ్యతరగతి వర్గీయులు ఎంతోమంది బ్యాంకుల ఎదుట క్యూ కడుతున్నారు. ఇంజనీరింగ్‌, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర ఉన్నత విద్య కోసం జిల్లావాసులు బ్యాంకు రుణాలు పొందుతున్నారు. అయితే పిల్లల చదువులు పూర్తయిన తర్వాత వారు ఉద్యోగాలు చేయకపోయినా తప్పనిసరిగా వాయిదాలు కట్టాల్సి వస్తోంది. సకాలంలో ఈఎంఐ చెల్లించని పక్షంలో ఓ వైపు అధిక వడ్డీ భారం పడు తుండగా.. మరోవైపు బ్యాంకుల నుంచి ఒత్తిడి ఎదుర్కోలేక జిల్లా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల విద్య రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. రుణాలు పొందిన వారు కొంత కాలం వరకు సక్రమంగానే ఈఎంఐలు చెల్లిస్తున్నారు. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవడంతో రుణాలను తిరిగి చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

వ్యవసాయం కోసం...

వ్యవసాయం కోసం రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏటా వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోవడం, కూలీలు, ఎరువుల ధరలు, యంత్రాల అద్దెలు అన్నదాతలకు భారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులను ఆశ్రయించి రుణాలు పొందుతున్నారు. అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. దీంతో వారు పెట్టుబడులును సైతం పొందలేని పరిస్థితి. మొత్తంగా అన్నదాతలకు వ్యవసాయం కత్తిమీద సాములా మారింది. పాత అప్పులను తీర్చేందుకు మళ్లీ కొత్తగా రుణాల కోసం పరుగులెత్తాల్సిన దుస్థితి ఏర్పడింది.

వివిధ రుణాలు పొందిన వారు..

- జిల్లా జనాభా 9,25,340 మంది

- బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారు 3 లక్షల పైబడి..

- పంట రుణాలు తీసుకున్న వారు 1,34,120 మంది

- వ్యవసాయ ఆధారిత రుణాలు తీసుకున్న వారు 1,92,297 మంది

- ఎంఎస్‌ఎం రుణాలు తీసుకున్నవారు 18678 మంది

- నాన్‌ ప్రయార్టీ రుణాలు తీసుకున్న వారు 59,172 మంది

- ఎడ్యుకేషన్‌ లోన్‌ 1058 మంది

- ఇళ్లు నిర్మాణాల కోసం రుణాలు తీసుకున్న వారు 1617 మంది

Updated Date - Jan 05 , 2025 | 12:39 AM