Share News

మార్కెట్లు కిటకిట

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:29 PM

Markets Bustling with Activity సంక్రాంతి నేపథ్యంలో జిల్లాలో మార్కెట్లన్నీ ఆదివారం కిటకిటలాడాయి. పండగ మూడు రోజులకు అవసరమైన పూజా సామగ్రి, నిత్యావసర సరుకులు, దుస్తులు ఇతరత్రా తదితర వస్తువులను కొనుగోలు చేశారు.

మార్కెట్లు కిటకిట
పార్వతీపురం ప్రధాన రహదారి ఇలా..

పార్వతీపురం టౌన్‌/ సాలూరు/సాలూరు రూరల్‌/పాలకొండ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి నేపథ్యంలో జిల్లాలో మార్కెట్లన్నీ ఆదివారం కిటకిటలాడాయి. పండగ మూడు రోజులకు అవసరమైన పూజా సామగ్రి, నిత్యావసర సరుకులు, దుస్తులు ఇతరత్రా తదితర వస్తువులను కొనుగోలు చేశారు. స్థానికులతో పాటు గ్రామీణ ప్రాంతవాసులు కూడా భారీగా పట్టణాలకు తరలిరావడంతో ప్రధాన కూడళ్లు, రహదారులు రద్దీగా మారాయి. పార్వతీపురం, సాలూరు, పాలకొండ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. కొద్ది సేపు వాహన రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు.

ఆకాశన్నంటిన ధరలు...

జిల్లాలో వస్త్ర వ్యాపారం ఊపందుకుంది. పార్వతీపురం, సాలూరు, పాలకొండ పట్టణాలతో పాటు 15 మండలాల్లోని వస్త్రదుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌లో అమ్మకాలు జోరుగా సాగుతు న్నాయి. కొందరు వియనగరం, పార్వతీపురం జిల్లా కేంద్రాలకు వెళ్లి దుస్తులు కొనుగోలు చేస్తున్నారు. పూర్వీకులకు నూతన వస్ర్తాలను సమర్పించడం ఆనవాయితీ. అందుకే ధరలు అధికంగా ఉన్నప్పటికీ ప్రజలు వెనుకాడలేదు. అయితే కోల్‌కతా, చెన్నై, రాజస్థాన్‌ తదితర ప్రాంతాల వారు ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌ దుకాణాల్లో దుస్తుల ధరలు అందుబాటులో ఉండడంతో అత్యధికులు వాటిని కొనుగోలు చేశారు.

సంక్రాంతి పండగకు పిండి వంటలతో పాటు వివిధ రకాలైన వంటకాలు తయారు చేయడం ఆనవాయితీ. అయితే పలు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటడడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధానంగా వంట నూనె ధరలను పరిశీలిస్తే గత ఏడాది డిసెంబరు వరకు 15 కేజీల నూనె డబ్బా రూ.2 వేల వరకు ఉండగా, ప్రస్తుతం దీని ధర రూ.2,800కు చేరింది. వేరుశనగ, మినపగుళ్లు, కందిపప్పు, పెసరపప్పు, ఇతర పప్పు దినుసులతో పాటు పసుపు, కారం, ఇతర వస్తువుల ధరలు సగానికి సగం పెరిగాయి. దీంతో ప్రజలు తమ స్థోమతకు తగ్గట్లుగా కొనుగోలు చేశారు.

Updated Date - Jan 12 , 2025 | 11:29 PM