Midday Meals ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:03 PM
Midday Meals for Intermediate Students జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కానుంది. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వం సిద్ధం చేశారు. ఇంటర్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రభుత్వ నిర్ణయంపై జిల్లావాసుల హర్షం
పార్వతీపురం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కానుంది. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వం సిద్ధం చేశారు. ఇంటర్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 5,905 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో 2,016 మంది వసతిగృహాల్లో ఉంటూ కళాశాలల్లో చదువుతున్నారు. మరో 3,507 మంది ఇళ్ల నుంచి కళాశాలలకు వస్తున్నారు. కాగా గత వైసీపీ ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి మంగళం పాడేసింది. పార్వతీపురం జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్‌ను సైతం మూసివేయించింది. దీంతో నిరుపేద విద్యార్థులు ఆకలితో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు చెందిన వారు మధ్యలోనే చదువులను ఆపేశారు. ఈ సమస్యలను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు రోజూ మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు కానుండగా.. సీఎం చంద్రబాబు నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, కురుపాంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాలకొండలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డి.మంజులవీణ తెలిపారు.