Share News

Vaikuntha Ekadashi: ముక్కోటి.. భక్తకోటి

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:06 AM

Vaikuntha Ekadashi:జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ముక్కోటి ఏకాదశిని ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

Vaikuntha Ekadashi: ముక్కోటి.. భక్తకోటి
రామతీర్థంలో గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

రామతీర్థంలో ఉత్సాహంగా గిరి ప్రదక్షిణ

విజయనగరం జనవరి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ముక్కోటి ఏకాదశిని ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా దేవతామూర్తుల దర్శనానికి బారులు తీరారు. గోవిందా.. గోవిందా.. నమో నారా యణ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. బంతి, చామంతి, గులాబీలతో పుష్పాభిషేకాలు నిర్వహించారు. విజయనగరం, నెల్లిమర్ల, గరివిడి, చీపురుపల్లి, గజపతినగరం, బొండపల్లి, మెంటాడ, దత్తిరాజేరు, బొబ్బిలి, ఎస్‌కోట, గంట్యాడ, జామి తదితర మండలాల్లోని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. విజయనగరంలోని మన్నార్‌ రాజగోపాల స్వామి, శివాలయం వీధి, తోటపాలెం, రింగురోడ్డు, టీటీడీ కల్యాణ మండపం ఎదుట, చింతలవలస తదితర ప్రాంతాల్లో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. నెల్లిమర్లలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో గిరి ప్రదక్షిణ ఉత్సాహంగా సాగింది. భక్తులు రామనామస్మరణ చేస్తూ, దాదాపు 10 కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేశారు. గిరి ప్రదర్శనకు ముందు, తరువాత రాములోరిని దర్శించుకున్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:06 AM